ఉమ్మడి వరంగల్ జిల్లాలో కుంభవృష్టి.. అధికారులు అలర్ట్

అల్పపీడనం ప్రభావంతో.. ఆదివారం అర్ధరాత్రి నుంచి… సోమవారం మధ్యాహ్నం వరకు.. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కుండపోత వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, జనగామ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీవర్షాలు ఎడతెరిపి లేకుండా కురిశాయి. దీంతో.. క్షేత్రస్థాయిలో అధికారులు అలర్ట్ గా ఉండాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెళ్లాయి.

గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో అధికారులు హెడ్ క్వార్టర్స్ లో అందుబాటులో ఉండాలని కలెక్టర్లు ఆదేశాలు జారీచేశారు. హెడ్ క్వార్టర్స్, ఆఫీసులలో ఏ అధికారి అందుబాటులో లేకపోయినా సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. వీఆర్ఏ లను గ్రామాలకు వెళ్లి.. చెరువుల పరిస్థితి మీద రిపోర్టులు పంపాలని సూచించారు. వీఆర్ఓ, వీఆర్ఏలు గ్రామాల్లోనే ఉండాలని ఆదేశించారు. ఎక్కడైనా పంట నష్టం జరిగితే.. నష్టపరిహారం చెల్లిస్తామని రైతులకు భరోసా కల్పించాలన్నారు.

కల్వర్టుల దగ్గర వరద నీరు పొంగి పొర్లితే … ప్రమాద హెచ్చరిక బోర్డులు పెట్టాలన్నారు కలెక్టర్లు. శిథిలావస్థకు చేరిన భవనాలు.. పాత భవనాల్లో ఉండేవారిని మరో చోటకు తరలించాలని అధికారులకు సూచించారు. ప్రాణనష్టం జరక్కుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.

అటు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మంగపేట మండలంలో గత వారం రోజులుగా ఎడతెరిపిలేని వర్షాలకు మల్లూరులోని అత్త చెరువుకు గండి పడింది. పంట పొలాలపై నుంచి చెరువు నీరు ప్రవహించింది. వరినాట్లు కొట్టుకుపోయాయి. రాజుపేట శివారు లోని కప్ప వాగులో మోటార్లు నీటి ధాటికి కొట్టుకుపోయాయి.

ఉమ్మడి వరంగల్ పరిధిలోని ఐదు జిల్లాల్లో వర్ష సహాయక చర్యలు యుద్ధప్రాతిపదికన తీసుకోవాలంటూ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఆదేశించారు. రెవెన్యూ, నీటిపారుదల, పోలీస్, మున్సిపల్ శాఖల అధికారులు సమన్వయం చేసుకుని పనిచేయాలన్నారు. అవసరమైతే ఎన్డీఆర్ఎఫ్ సేవలను వినియోగించాలని సూచించారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy