ఉమ్మడి హైకోర్టు సీజే రాధాకృష్ణన్

justiceతెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ తొట్టతిల్‌ బి.నాయర్‌ రాధాకృష్ణన్‌ పేరు ఖరారైంది. ఆయన నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం ఆమోదముద్ర వేసింది. ఆయన ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, సీనియర్‌ న్యాయమూర్తులు జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్, జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌లతో కూడిన కొలీజియం బుధవారం సమావేశమై పలు నియామకాలకు ఆమోదముద్ర వేసింది. అందులో భాగంగానే ఉమ్మడి హైకోర్టుకు పూర్తిస్థాయి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ రాధాకృష్ణన్‌ను నియమించాలని కొలీజియం నిర్ణయించింది. కేంద్రం ఆమోదముద్ర అనంతరం కొలీజియం సిఫార్సులు రాష్ట్రపతికి చేరతాయి. అనంతరం రాష్ట్రపతి నియామకపు ఉత్తర్వులు జారీ చేస్తారు. ప్రస్తుతం ఉమ్మడి హైకోర్టుకు జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్‌ దాదాపు ఏడాదిన్నరగా తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.  జస్టిస్‌ రాధాకృష్ణన్‌ సీజేగా రానున్న నేపథ్యంలో జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్‌ ఉమ్మడి హైకోర్టులోనే న్యాయమూర్తిగా కొనసాగుతారని తెలిసింది. హైకోర్టు విభజన పూర్తయ్యాక ఆయన ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యే అవకాశముంది. అప్పటిదాకా ఉమ్మడి హైకోర్టులోనే న్యాయమూర్తిగా కొనసాగుతారు.

జస్టిస్‌ రాధాకృష్ణన్‌ బయోడేటా 

జస్టిస్‌ తొట్టతిల్‌ బి.నాయర్‌ రాధాకృష్ణన్‌ 1959 ఏప్రిల్‌ 29న కేరళలో జన్మించారు. తండ్రి ఎన్‌.భాస్కరన్‌ నాయర్, తల్లి కె.పారుకుట్టి ఇద్దరూ న్యాయవాదులే. రాధాకృష్ణన్‌ కొల్లంలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేశారు. కేరళ వర్సిటీ నుంచి బీఎస్సీ, బెంగళూరు వర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌బీ చేశారు. 1983లో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. తిరువనంతపురంలో పి.రామకృష్ణ పిళ్లై వద్ద జూనియర్‌గా వృత్తి జీవితాన్ని ఆరంభించారు. 1988లో ప్రాక్టీస్‌ను హైకోర్టుకు మార్చారు. సివిల్, రాజ్యాంగపరమైన కేసుల్లో దిట్టగా పేరు సంపాదించారు. పలు ప్రభుత్వ రంగ సంస్థలకు, బ్యాంకులకు న్యాయవాదిగా వ్యవహరించారు. 2004 అక్టోబర్‌లో కేరళ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2016 మే 13న కేరళ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. రెండుసార్లు ఆ బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy