ఎంతమాటన్నాడు: మహిళలకు దిమాక్ తక్కువట.. డ్రైవింగ్ కి పనికిరారట

muslim-drivingమహిళలను కించపర్చిన మతపెద్దపై చర్య తీసుకున్న సౌదీ ప్రభుత్వం

సౌదీ అరేబియాలో మహిళలపై కఠినమైన ఆంక్షలు ఉన్నాయి. మహిళలు చదువుకోవడానికి కూడా అక్కడ చాల ఇబ్బంది. ఇంట్లో అమ్మాయిలు చదువుకోవాలంటే తప్పనిసరిగా ఆ కుటుంబంలోని తండ్రి, భర్త లేదా సోదరుల నుంచి అనుమతి తీసుకోవాల్సిందే. ఇక అక్కడ మహిళలు డ్రైవింగ్‌ చేయడానికి కూడా వీలులేదు. అయితే ఈ డ్రైవింగ్‌ విషయమై సౌదీ మతపెద్ద ఒకరు మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. పురుషుల మెదడుతో పోలిస్తే మహిళలకు పావు వంతు మాత్రమే ఉంటుందని.. అందుకే వారు డ్రైవింగ్‌ చేయలేరన్నారు మతపెద్ద సాద్‌ అల్‌ హిజ్రీ. సాధారణంగా పురుషులతో పోలిస్తే మహిళలకు సగం మెదడే ఉంటుందని, ఇక షాపింగ్‌ వంటి వాటి కోసం బయటకు వెళ్లేటప్పుడు అది పావువంతే అవుతుందని, అందుకే మహిళలకు డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఇవ్వరన్నారు అల్ హిజ్రీ.

ఈ వ్యాఖ్యలు కాస్తా సోషల్‌మీడియాలో వైరల్ కావడంతో మహిళా హక్కుల కార్యకర్తల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీనిపై స్థానికంగా పెద్దఎత్తున దుమారం చెలరేగింది. దీంతో స్పందించిన ప్రభుత్వం అతడిపై చర్యలు తీసుకుంది. హిజ్రీ బోధనలు, మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఆయనపై నిషేధం విధించినట్లు ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. బోధనల పేరుతో అనుచిత వ్యాఖ్యలకు పాల్పడితే, మహిళలను కించపరిస్తే కఠిన చర్యలు తప్పవు. భవిష్యత్తులో ఎవరైనా ఇలా చేస్తే మరింత కఠిన నిర్ణయాలు తీసుకుంటామని ప్రకటించింది ప్రభుత్వం. మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఆయనపై నిషేధం విధించడంపై స్పందించిన హిజ్రీ.. తాను కావాలని ఇలా అనలేదని, అనుకోకుండా నోరు జారనని సమర్థించుకునే ప్రయత్నం చేశారు.

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy