ఎంతైనా….నానా

nanapatekarనానా పటేకర్ ఒక సినిమా ఆర్టిస్టుగా చాలా సాధించాడు. బోలెడంత డబ్బు కూడా సంపాదించాడు. కానీ, అక్కడితో ఆగిపోలేదు. రైతు కుటుంబాల కన్నీళ్ళు తుడిచాడు. వందలాదిమందికి ఆత్మీయుడయ్యాడు. పదిమందికి సాయపడాలంటే ఏదో రాజకీయ పార్టీ హెల్ప్ ఉండాలని అనుకోలేదు….ఎమ్మెల్యేనో, మంత్రో అయిపోవాలనుకోలేదు. చాలా మామూలు మనిషిగానే ముందుకెళ్తున్నాడు నానా పటేకర్.

నానా పటేకర్ సినిమాలు చూస్తే….విలన్ గా వేసినవే ఎక్కువుంటాయి. కేరక్టర్ లో విలనీ లేకపోయినా అతన్ని చూడగానే విలన్ అనిపిస్తాడు. ఆ ఫేస్ అలా అలవాటైపోయింది. సినిమాల్లో విలనేమో కానీ, నిజజీవితంలో మాత్రం హీరోనే. ఎవరికీ పట్టని బతుకులకు అండగా నిలిచిన హీరో. ఎవరూ ఆదరించని అనామకుల్ని అక్కున చేర్చుకున్న హీరో. యాక్షన్ సీన్లలోనూ, స్టెప్పుల్లోనూ మాత్రమే హీరోయిజం చూసేవాళ్ళకి అతను హీరోగా కనిపించకపోవచ్చు. కానీ, కొన్ని మరాఠీ కుటుంబాలకు అతను హీరోనే.

Nana-Patekar-1రైతుబంధు..

‘టీవీ ఆర్టిస్టు ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య చేసుకుంటే మీడియా అంతా దాన్నే ఫోకస్ చేస్తుంది. మరి, విదర్భలో మరాట్వాడాలో రైతుల ఆత్మహత్యలమీద ఇంత కవరేజ్ ఎందుకివ్వరు?’ అని నిలదీశాడు నానా పటేకర్. ఇలా దులిపేయడానికి పూర్తి హక్కుంది నానా పటేకర్ కి. రైతులు ఎందుకు ప్రాణాలు తీసుకుంటున్నారో నానా పటేకర్ కి తెలిసినంతగా మహా మేధావులకు కూడా తెలియదేమో. ఎందుకంటే, విదర్భలో, మరాట్వాడాలో ఎంతో తిరిగాడతను. ఎన్నో తెలుసుకున్నాడు.  నేనున్నానంటూ రైతుల కుటుంబాలకు అండగా నిలబడినవాడు. అందుకే నిలదీసే హక్కుంది అతనికి.

లాతూర్ లో చుక్కనీరు దొరకడంలేదని అక్కడికి రైల్లో నీళ్ళు పంపించడం దేశమంతా చూస్తోంది. అసలు, లాతూర్ లో నీళ్ళు ఎందుకు దొరకడంలేదో చాలామందికి తెలియకపోవచ్చు. కానీ, నానా పటేకర్ కి తెలుసు. రెండేళ్ళ కిందటే లాతూరుకు వెళ్ళి చూసొచ్చినవాడు కనుక….అతనికి అక్కడి బాధలు తెలుసు. తను పుట్టి పెరిగిన మహారాష్ట్రలో ఇలాంటి పరిస్థితి ఉంటుందనుకోలేదు నానా. తెలిశాక ఆగలేదు.

‘తినడానికి ఏదో ఒకటి దొరుకుతుంది. బిర్యానీనో, ఫుల్ మీల్సో దొరక్కపోవచ్చు.  బ్రెడ్డూ, బన్ను అయినా దొరుకుతాయి. కానీ నీళ్ళు ఎలా దొరకుతాయి? నీటికి ఆల్టర్నేటివ్ లేదు కదా?’ అంటాడు నానా.

మహారాష్ట్రకి ముంబాయిలాంటి వాణిజ్యనగరమే కాదు. విదర్భ, మరాట్వాడా లాంటి కరువు ప్రాంతాలూ ఉన్నాయి. ప్రతి ఏడాదీ ఈ రెండు ప్రాంతాల గురించి వినిపించకుండా ఉండదు. అప్పులు చేసి సాగు చేసినా, పంట చేతికందక….కూలబడే రైతులు అక్కడ కోకొల్లలు. చేసిన అప్పులు తీర్చలేక, కుటుంబాన్ని నడపలేక….ఆదుకునే వాళ్ళు కనిపించక….ఆత్మహత్యలు చేసుకునే రైతులు అక్కడ ఎంతమందో! ఇలా అసువులు తీసుకున్న రైతుల గురించి నేషనల్ మీడియాలో, లోకల్ మీడియాలో లెక్కలేనన్ని కథానాలు వస్తుంటాయ్.

మీడియా కథనాలతో విదర్భ రైతుల ఆత్మహత్యల గురించి ప్రపంచమంతా తెలుసుకుంది. ‘అయ్యో’ అనేవాళ్ళు, ‘సర్కారు ఏం చేస్తుంది, నిద్రపోతుందా?’ అని నిలదీసేవాళ్ళు ఎందరో! అలా అనేసి, మరిచిపోతారు. మీడియా కూడా తన పని అయిపోయిందని చేతులు దులిపేసుకుంటుంది.

కానీ, రైతు ఆత్మహత్యల వార్తలు చదివి ఊరుకోలేదు నానా పటేకర్. ఎందుకిలా జరుగుతుందో తెలుసుకున్నాడు.  కుటుంబపెద్ద ప్రాణాలు తీసుకోవడంతో రోడ్డునపడ్డవాళ్ళ ఇళ్ళకు వెళ్ళాడు. ‘నేనున్నాను’ అంటూ భరోసా ఇచ్చాడు.  ఈ  ఫ్యామిలీలకు ఆసరాగా నిలవాలనుకున్నాడు. 230 కుటుంబాలకు 15 వేల చొప్పున ఇవ్వడం నానా పటేకర్  మొదటి సాయం. ఎవరి చేతికో ఇస్తే అసలైనవాళ్ళకు అందుతుందో లేదోనని తనే స్వయంగా వాళ్ళ ఇళ్ళకు వెళ్ళి డబ్బిచ్చాడు. కొత్త బట్టలు, మందులు కూడా ఇచ్చాడు.

Nana-Patekar-NAAMసాయం ఇలా..

సాయం అంటే ఏంటి? జస్ట్ డబ్బులు ఇచ్చేస్తే సరిపోతుందా? ఆత్మహత్యలు చేసుకోవాల్సిన అవసరం రైతులకు ఎందుకొచ్చింది? ఏం చేస్తే వాళ్ళు ఆత్మహత్య చేసుకోకుండా ఉంటారు?…..ఇలా ఎన్నో ప్రశ్నలు తనకు తనే వేసుకున్నాడు నానా పటేకర్. ప్రాణాలు తీసుకునే పరిస్థితి రైతులకు రాకూడదనుకున్నాడు. ఆ ఆలోచనలోనుంచి పుట్టింది ‘నామ్ ఫౌండేషన్’.

ఆత్మహత్యకు దారితీసే పరిస్థితి రైతుకు రాకూడదనే సెంటర్ పాయింట్ తో కిందటేడాది సెప్టెంబర్ లో ‘నామ్  ఫౌండేషన్’ కి ఒక రూపం వచ్చింది. విదర్భలోని దోందాల్ గావ్, ఆమలా అనే గ్రామాల్ని దత్తత తీసుకుందీ ఫౌండేషన్. అక్కడ రైతులకు ఆసరాగా ఉండడానికి అనేక ప్లాన్స్ అమలుచేస్తోంది.  ‘ఏ పంట ఎప్పుడు వేయాలో,దేనికి ఎలాంటి ఎరువులు వేయాలో, చీడ పడితే ఏం చేయాలో నామ్ ఫౌండేషన్ ద్వారా  రైతులకు  ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఏర్పాటు ఉంది. కొన్ని సెంటర్లు ఏర్పాటు చేసి రైతులకు ట్రయినింగ్ కూడా ఇస్తున్నారు.  భూగర్భ జలాలు పెంచడానికి, పచ్చదనం కోసం ఆ రెండు ఊళ్ళలో కోటి చెట్లు నాటి పెంచే ప్రయత్నంలో ఉన్నారు.

రెండు ఊళ్ళలో ఎంప్లాయ్ మెంట్ సెంటర్లు ఏర్పాటయ్యాయి. దాదాపు 600 మందికి ఉద్యోగాలు వచ్చేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. రైతులు వ్యాపారాలు చేయడానికి కూడా ఎంకరేజ్ చేస్తుందీ ఫౌండేషన్.

నామ్ ఫౌండేషన్ ఏర్పాటులో, దాన్ని నడపడంలో నానాకు సాయపడుతున్నవాడు మకరంద్ అనాస్పురే. మరాటీ నాటకరంగంనుంచి వచ్చినవాడు మకరంద్. నానా పటేకర్ ఆలోచనల్లాగానే ఉంటాయి మకరంద్ ఆలోచనలు కూడా.

నామ్ ఫౌండేషన్ కి మొదటిరోజే 80 లక్షల విరాళం వచ్చింది. రెండువారాల్లో ఆరున్నర కోట్ల రూపాయలు సమకూర్చారు దాతలు. ఈ ఫండ్స్ తోనే దత్తత చేసుకున్న గ్రామాల్లో పనులు చేస్తున్నాడు నానా.

సొంతకారు లేని హీరో…

బాలీవుడ్ హీరో లైఫ్ స్టయిల్ ఎలా ఉండాలి? మెర్సిడెస్ బెంజ్ కారో, బీఎండబ్ల్యూ కారో ఉండాలి కదా? ముంబాయి సిటీలో బాంద్రాలోనో, జుహూలోనో పేద్ద బంగళా ఉండాలి కదా? మరి నానా పటేకర్ కి ఏ కారుందో తెలుసా? బంగళా ఎక్కడుందో తెలుసా?

నానా పాటేకర్ కి బెంజ్ లేదు, బీఎండబ్ల్యూ లేదు. అసలు సొంత కారే లేదు. సినిమా కంపెనీలవాళ్ళు కారు పంపిస్తే దాన్లోనే షూటింగ్ కి వెళ్తాడు. సొంత పనులకోసం ఆటోరిక్షాల్లో తిరుగుతుంటాడు. ‘చిన్న కారయినా కొనుక్కోవచ్చు కదా’ అంటే నవ్వేస్తాడంతే.

మరి నానాకి బంగళా ఉన్నది బాంద్రాలోనా? జుహూలోనా? అక్కడెక్కడా లేదు. ముంబాయి శివార్లలో ఉంది కానీ అది బంగళా కాదు. సింగిల్ బెడ్ రూమ్ అపార్ట్ మెంట్. 750 SFT లో ఉన్న చిన్న అపార్ట్ మెంట్. ఎప్పటినుంచో ఇదే అపార్టుమెంట్ లో ఉంటున్నాడు.

మరి సంపాదించినదంతా ఏం చేస్తాడు? ఒకప్పుడైతే….తన చుట్టాల్లో బీదవాళ్ళకి  చదువుకి సాయం చేసేవాడు. సినిమాల్లో చేరాక, జూనియర్ ఆర్టిస్టులు, చిన్న టెక్నీషియన్లకు డబ్బు సాయం చేసేవాడు. నామ్ ఫౌండేషన్ పెట్టాక సంపాదనలోఎక్కువ మొత్తం ఆ సంస్థకే ఇచ్చేస్తున్నాడు. అవసరాలకు మాత్రం కొద్దిగా ఉంచుకుంటాడంతే. ‘ఎక్కువ అవసరాలు ఉంటే ఎక్కువ డబ్బు కావాలి. నా అవసరాలు కొన్నే ఉంటాయి. అందుకే, తక్కువ డబ్బుతోనే మేనేజ్ చేస్తున్నా’ అంటాడు నానా.

nanaదేవుడి గురించి పెద్దగా ఆలోచించడు. వినాయకచవితికి మాత్రం ఇంట్లో పెద్ద ఎత్తున పూజ చేస్తాడు. ఎందుకని అడిగితే, ‘మా అమ్మ కోసం. నాన్న వారసత్వంగా వచ్చింది, చేస్తున్నాను’. అంటాడు.

వినాయక పూజ తప్ప వారసత్వంగా మరేమీ రాలేదు.  ఒకప్పుడు వాళ్ళ కుటుంబానిది అప్పర్ మిడిల్ క్లాస్. నానా తండ్రి వ్యాపారంలో నష్టపోవడంతో రోజు గడవని స్థితికి వచ్చేసింది. అందుకే, 13 ఏటనుంచే పనులు చేసి కుటుంబానికి సాయపడాల్సి వచ్చింది నానాకి. ఐదో క్లాసు వరకే చదువుకున్నాడు. ‘మరాఠీ, హిందీ బాగా వచ్చు కానీ, ఇంగ్లీష్ రాదు నాకు. చదువుకోలేదుగా!’ అంటాడు నానా.

ఈ బ్యాక్ గ్రౌండే నానాకి బాగా ఉపయోగపడింది. తినడానికి లేనివాళ్ళను చూస్తే సాయపడే తత్వం అలవడింది. ఒకప్పుడు రోజుకి 60 సిగరెట్లు కాల్చిన నానా గురించి ఎవరో కామెంట్ చేశారు. ‘డబ్బు అలా వేస్ట్ చేస్తావు ఎందుకు?’ అని. అంతే, అప్పటినుంచి సిగరెట్లు మానేశాడు.

ఈజ్ ఉన్న యాక్టర్…

నానా పెర్సనల్ లైఫ్ ఎంత డిఫరెంట్ గా ఉంటుందో, సినిమా లైఫ్ కూడా అంతే డిఫరెంట్. ఏ కేరెక్టరైనా సరే, ఈజ్ తో చేసేస్తాడు. సెట్ లో నానా ఉంటే మిగతా ఆర్టిస్టులు భయపడతారు….డామినేట్ చేసేస్తాడని. అయినా, అందరితో ఫ్రెండ్లీగా ఉంటూ షూటింగ్ ని సరదాగా ఎంజాయ్ చేస్తాడు.

‘సలాం బాంబే’తో నానాకి మంచి బ్రేక్ వచ్చింది. బాబా కేరెక్టర్ తో బాలీవుడ్ ఇండస్ట్రీని ఎట్రాక్ట్ చేశాడు నానా.

‘క్రాంతి వీర్’ కూడా మంచి పేరు తెచ్చింది నానా పటేకర్ కి.  దీనిలో ఉరి వేసే సీన్ లో చెప్పిన డైలాగ్ చాలా పాపులర్. ఆగకుండా 3 నిమిషాలకు పైగా చెప్పాడీ డైలాగ్.

‘ఖామోషీ’లో నానా పటేకర్ కి వచ్చిన కేరెక్టర్ ఎవరికో కానీ వచ్చేది కాదు. మాటరాని తండ్రిగా ఇందులో నానా యాక్టింగ్ కు కంట తడిపెట్టనివారు ఉండరు.

అందరిలాంటి ఆర్టిస్టు కాడు. అయినా, జనంతో ఈజీగా కనెక్టయిపోతాడు. వ్యక్తిగా కూడా అంతే. మిగతా సెలబ్రిటీలకి కూడా ‘నేనిలా ఎందుకు లేను’ అని ఆలోచించేలా ఉంటాడు. అందుకే, మహారాష్ట్ర గ్రామాల్లో నానా పటేకర్ చేస్తున్న పనులు బాలీవుడ్ లో కొందరినైనా కదిలించాయి. ఇలా పెద్ద మనసుతో ఆలోచిస్తున్నవారిలో అమీర్ ఖాన్, అక్షయకుమార్ కూడా ఉన్నారు.

అమీరాఖాన్ కూడా విదర్భ ప్రాంతంలో రెండు గ్రామాలు దత్తత తీసుకున్నాడు. అలాగే, అక్షయ్ కుమార్ కూడా నీటి సదుపాయం కోసం 50 లక్షలు విరాళమిచ్చాడు.

తను దత్తత తీసుకున్న రెండు ఊళ్ళలో నామ్ ఫౌండేషన్ ద్వారా  పనులు చేయించడమే కాదు. పనులు ఎలా జరుగుతున్నదీ తెలుసుకోడానికి కూడా ఎప్పటికప్పుడు ఆ ఊళ్ళకు వెళ్తుంటాడు. ఇవన్నీ చేస్తున్నాడుకదా, పాలిటిక్స్ లో ఇంట్రెస్ట్ ఉందేమోనని చాలామంది అనుకున్నమాట నిజం. బీజేపీ అయితే, పార్టీలోకి లాక్కోవడానికి చాలానే ట్రయ్ చేసింది. అయినా సరే, పాలిటిక్స్ వద్దు పొమ్మన్నాడు.

కోపం ఎక్కువ నానా పటేకర్ కి. కానీ, కోపాన్ని కసిగా మార్చుకుని చేయాలనుకున్నది చేసుకుంటూ పోతుంటాడు. ఇలాంటి కసి ఎంతమందికి ఉంటే అంత మంచిదేమో.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy