ఎంసెట్ లీకేజ్ కేసు : ఒక్కో పేపర్ రూ.35లక్షలు.. ఐఏఎస్ పిల్లలు కూడా కొన్నారా?

EMCETరెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఎంసెట్‌ (మెడికల్‌) ప్రశ్నపత్రం లీకేజీ కేసు అనేక మలుపులు తిరుగుతున్నాయి. ఇన్నాళ్లు లీకేజీకి పాల్పడ్డ నిందితులతోపాటు బ్రోకర్లను కటకటాల్లోకి నెట్టిన సీఐడీ.. ఇప్పుడు ప్రముఖ కార్పొరేట్‌ కాలేజీ శ్రీచైతన్య డీన్‌ ఓలేటి వాసుబాబును అరెస్ట్‌ చేయడంతో డొంకంతా కదిలింది.

వాసుబాబుకు సహకరిస్తూ విద్యార్థులను క్యాంపులకు తరలించిన ఏజెంట్‌ కమ్మ వెంకట శివ నారాయణ రావును అరెస్ట్‌ చేశారు. దిల్‌సుఖ్‌నగర్‌ శ్రీచైతన్య బ్రాంచ్‌తోపాటు మరో ఆరు కేంద్రాల్లోని కాలేజీలకు ఓలేటి వాసుబాబు(ఏ–89) డీన్‌గా వ్యవహరిస్తున్నాడు. గుంటూరుకు చెందిన శివ నారాయణ రావు(ఏ 90).. శ్రీచైతన్య, నారాయణ కాలేజీల్లో విద్యార్థులను చేర్పించే ఏజెంట్‌. వీరిద్దరూ ఎంసెట్‌ ప్రశ్నపత్రం లీకేజీలో కీలకంగా వ్యవహరించిన డాక్టర్‌ ధనుంజయ్‌ థాకీర్, డాక్టర్‌ సందీప్‌కుమార్‌తో డీల్‌ కుదుర్చుకున్నారు. కాలేజీల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిండ్రులకు మెడికల్‌ సీట్లు ఇప్పిస్తామని చెప్పి ముందుగానే ప్రశ్నపత్రం ఇచ్చేందుకు అగ్రిమెంట్‌ చేసుకున్నారు. భువనేశ్వర్‌ కేంద్రంగా నడిచిన ప్రిపరేషన్‌ క్యాంపునకు ఆరుగురు విద్యార్థులను పంపారు. ఒక్కో విద్యార్థి నుంచి రూ.35 లక్షలు వసూలు చేసినట్లు గుర్తించారు సీఐడీ అధికారులు.

శివ నారాయణ, వాసుబాబు తీసుకువెళ్లిన విద్యార్థుల్లో కొందరు ప్రభుత్వాధికారుల పిల్లలుండటం సీఐడీ అధికారులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇద్దరు ఐఏఎస్‌ అధికారుల పిల్లలతోపాటు ఆరుగురు ప్రభుత్వాధికారుల పిల్లలు కూడా లీకైన ప్రశ్నపత్రంపై శిక్షణ కోసం కటక్‌ క్యాంపునకు వెళ్లినట్లు తెలుస్తోంది. దీనిపై సీఐడీ అధికారులు స్పందించడం లేదు. శ్రీచైతన్య కాకుండా మరో ప్రముఖ కాలేజీ విద్యార్థులను సైతం వాసుబాబు కటక్‌లో శిక్షణకు తరలించినట్టు గుర్తించింది సీఐడీ అధికారులు. మరో 12 మంది విద్యార్థుల తల్లిదండ్రులతో ఆయన ఫోన్‌ ద్వారా పదే పదే టచ్‌లో ఉన్నట్టు తేలింది. ఈ మేరకు సీఐడీ ఆధారాలు సేకరించింది. త్వరలోనే వారిని కూడా అరెస్ట్‌ చేసే ప్రయత్నం చేస్తున్నారు సీఐడీ అధికారులు. తమ కాలేజీకి పేరు తీసుకువచ్చేందుకే ఈ స్కాంలో పాలు పంచుకున్నట్టు డీన్‌ వాసుబాబు తన వాంగ్మూలంలో ఒప్పుకున్నాడని స్పష్టం చేసింది సీఐడీ. తల్లిదండ్రులను ఒప్పించి క్యాంపునకు పంపినట్టు ఆయన తెలిపాడు. తాను పంపిన ఆరుగురు విద్యార్థుల్లో ముగ్గురికి మంచి ర్యాంకులు వచ్చాయని, దీంతో వారి నుంచి మరింత డబ్బు వసూలు చేసేందుకు కూడా ఒప్పందం కుదిరినట్లు విచారణలో తేలింది.

సరిగ్గా రెండేళ్ల క్రితం ఎంసెట్‌ లీకేజీపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఢిల్లీ ప్రింటింగ్‌ ప్రెస్‌ నుంచి లీక్‌ చేసినవారితోపాటు ఇతర నిందితులు అరెస్ట్‌ చేస్తూ వచ్చింది. మొదటి రెండు నెలల్లోనే 22 మంది కీలక నిందితులను అరెస్ట్‌ చేసిన సీఐడీ ఆ తర్వాతి రెండు నెలల్లోనే 64 మంది బ్రోకర్లను జైలుకు పంపించింది. ఆ తర్వాత కేసు దర్యాప్తు నెమ్మదించింది. మొదట్లోనే శ్రీచైతన్య, మరో కార్పొరేట్‌ కాలేజీకి లింకుందని తెలిసినా ఎందుకు పట్టించుకోలేదన్న దానిపై ఇప్పుడు ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. ఇదే కేసులో అక్రమాలకు పాల్పడ్డ ఓ డీఎస్పీతోపాటు మరో ఇన్‌స్పెక్టర్, ఇతర సిబ్బందిని సీఐడీ అధికారులు సస్పెండ్‌ చేశారు.

గతేడాది ఆగస్టులో శ్రీచైతన్య డీన్‌ ఓలేటి వాసుబాబును ఓ సీనియర్‌ అధికారి విచారణకు పిలిచి పంపించి వేసినట్టు ఇప్పుడు బయటపడింది. వాంగ్మూలం ఎందుకు రికార్డు చేయలేదు? సీఐడీ అదనపు డీజీపీకి తెలియకుండా నిందితుల జాబితా నుంచి పేరు ఎందుకు తొలగించారు? అన్న ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది. ఆరోపణల జాబితాలో ఉన్న మరో కాలేజీ హైదరాబాద్‌ కీలక బ్రాంచ్‌ ప్రిన్సిపల్‌ను సైతం దర్యాప్తు అధికారి ఓ హోటల్‌కు పిలిపించి వదిలేయడంపైనా అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఇద్దరి సెల్‌ఫోన్‌ డేటాను పరిశీలిస్తే సంబంధిత ఉన్నతాధికారితోపాటు మరో ఇద్దరు పోలీసు అధికారుల వ్యవహారం బయటపడుతుందని చెపుతున్నారు సీఐడీ వర్గాలు. 
ఎంసెట్‌ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన నాటినుంచి ఎనిమిది మంది దర్యాప్తు అధికారులు మారడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసుకు దేశవ్యాప్తంగా లింకులుండటంతో ఒక సీనియర్‌ అధికారిని దర్యాప్తు అధికారిగా నియమించి బృందాలను ఏర్పాటు చేసి అరెస్టులు కొనసాగించారు. అయితే ఇదే క్రమంలో ఒకరి తర్వాత ఒకరు దర్యాప్తు అధికారి మారిపోవడం, సస్పెన్షన్‌కు గురవడంతో అనుమానాలు తీవ్రమయ్యాయి. పలువురు ఉన్నతాధికారులు, రాజకీయ ఒత్తిళ్ల వల్లే తాను స్వచ్ఛందంగా దర్యాప్తు నుంచి తప్పుకున్నట్టు గతంలో కేసును దర్యాప్తు చేసిన అధికారి ఒకరు తెలిపారు.

ఎంసెట్‌ లీకేజీ కేసులో అరెస్టయిన శ్రీచైతన్య కాలేజీ డీన్‌ ఓలేటి వాసుబాబును సస్పెండ్‌ చేస్తున్నట్టు శ్రీచైతన్య యాజమాన్యం ప్రకటించింది. ఈ పరిణామంతో తమకేమీ సంబంధం లేదని, 32 ఏళ్ల ప్రస్థానంలో ఎప్పుడూ చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడలేదని నోట్ రిలీజ్ చేసింది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy