ఎక్కడి ఆస్తులు అక్కడివే

222విభజనకు ముందున్న ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్యామండలి ఆస్తుల్లో స్థిర, చరాస్తులు ఏ ప్రాంతంలో ఉంటే అవి ఆ రాష్ట్రానికే దక్కుతాయని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను ఆదేశించింది కేంద్ర హోం శాఖ. నగదు నిల్వలు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, బ్యాంకు ఖాతాల్లోని నిల్వలను మాత్రం జనాభా ప్రాతిపదికన పంచుకోవాలని పేర్కొంది. ఉన్నత విద్యామండలి వివాదంపై కేంద్ర హోం శాఖ అదనపు కార్యదర్శి జైదీప్‌ గోవింద్‌ ఈ మేరకు తుది ఆదేశాలు జారీ చేశారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు బుధవారం వాటిని పంపించారు. వాస్తవానికి ఏపీ ఉన్నత విద్యా మండలి కేసులో 2016 మార్చి 18న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. మండలి ఆస్తులను ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు జనాభా ప్రాతిపదికన 58:42 నిష్పత్తిలో పంచుకోవాలని ఆ తీర్పులో తెలిపింది. ఒకవేళ రెండు రాష్ట్రాలూ అందుకు ఒప్పుకోక పోయినా… ఒక అగ్రిమెంట్ కు రాలేకపోయినా కేంద్ర ప్రభుత్వం జోక్యం కోరవచ్చని, అలా కోరిన రెండు నెలల్లోపు కేంద్రం ఒక కమిటీని ఏర్పాటు చేసి సమస్య పరిష్కరించాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి విజ్ఞాపన రావటంతో కేంద్ర ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించేందుకు హోం శాఖ అదనపు కార్యదర్శి (ఎల్‌డబ్ల్యుఈ) అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేసింది. రెండు రాష్ట్రాల నుంచీ ఇద్దరు చొప్పున సభ్యులను నియమించింది. కమిటీ తొలి భేటీ 2016 సెప్టెంబరు23న జరిగింది. సమస్యపై చర్చలు కొనసాగిస్తామని  రెండు రాష్ట్రాలు గతంలో తెలిపాయి. హైదరాబాద్‌లో అక్టోబరు 18నచర్చలు జరిగాయి. అయితే పరిష్కారం కుదరలేదు. ఆస్తుల విభజనపై ఏపీ ప్రభుత్వం తమకు ఒక ప్రతిపాదన పంపిందని… అది ఆమోదయోగ్యంగా లేకపోవడంతో వారం రోజుల్లోపే సమాధానం ఇచ్చామని నవంబరు 1న తెలంగాణ ప్రకటించింది. ఈ క్రమంలోనే ఈ ఏడాది జనవరి 13నకేంద్రం వేసిన కమిటీ మరోసారి సమావేశమైంది.ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సమస్య పరిష్కరించుకునేందుకు తగినంత సమయం ఇచ్చినప్పటికీ వారు పరిష్కరించుకోలేకపోయినందున చివరగా లిఖితపూర్వక వాదనలను పది రోజుల్లో తెలియజేయాలని నాడు కమిటీ సూచించింది. ఆ మేరకు బుధవారం (19.04.2017) తుది ఆదేశాలు జారీ చేసింది.

ఆస్తులు: విభజన చట్టంలోని సెక్షన్ 48 (1), సెక్షన్ 48 (4) ప్రకారం అన్ని స్థిర, చరాస్తులను ప్రాంతీయత ఆధారంగా పంచుకోవాలి.

నగదు నిల్వలు: సెక్షన్ 49 ప్రకారం.. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, బ్యాంకు నిల్వలను.. జనాభా ప్రాతిపదికన 58.32: 41.68 నిష్పత్తిలో పంచుకోవాలి.

ఉద్యోగులు: ప్రస్తుతం తెలంగాణ ఉన్నత విద్యా మండలిలో పనిచేస్తున్న ఉద్యోగులంతా దానికే చెందుతారు. రెండు రాష్ట్రాలకు వేర్వేరు ఉన్నత విద్యామండళ్లు ఏర్పడిన క్రమంలో ఏపీ ఉన్నత విద్యా మండలిపై పనిభారం తగ్గుతుంది. ఒకవేళ గతంలోని ఏపీ ఉన్నత విద్యా మండలి దగ్గర ఎవరైనా ఎక్కువ ఉన్నట్లైతే మిగులు ఉద్యోగులుగా ప్రకటించాలి. సీనియారిటీ ప్రాతిపదికన పరిష్కరించాలి.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy