ఎన్నికల నాటికి ఇంటింటికి మంచి నీరు : కేసీఆర్

cmkcr2204వచ్చే ఎన్నికల నాటికి ఇంటింటికి నల్లా ద్వారా మంచినీళ్లివ్వకుంటే ఓట్లు అడగబోమన్న మాటకు కట్టుబడి ఉన్నామన్నారు సీఎం కేసీఆర్. ఎన్నికల కంటే నాలుగైదు నెలల ముందే మిషన్ భగీరథను పూర్తి చేసి ప్రతీ ఇంటికి మంచినీటి సరఫరా చేయనున్నట్లు చెప్పారు. ఇప్పటికే మెయిన్ గ్రిడ్ పనులు 95 శాతం పూర్తయ్యాయని, మొత్తం ప్రాజెక్టు 75శాతం కంప్లీట్ అయిందన్నారు.

మిషన్ భగీరథ పనులపై ఆదివారం (ఏప్రిల్-22) ప్రగతి భవన్ లో సమీక్ష చేశారు సీఎం. జిల్లాలు, సెగ్మెంట్ల వారీగా పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇన్ టేక్ వెల్స్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, పైపులైన్లు, పంపుసెట్ల పనులు దాదాపు పూర్తి అయ్యాయన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికే ఇంటింటికి నల్లా ద్వారా నీళ్లిస్తున్నట్లు చెప్పారు. వచ్చే నెల చివరి నాటికి ప్రతీ గ్రామానికి వాటర్ బల్క్ సప్లై చేయాలని అధికారులను ఆదేశించారు. బల్క్ సప్లయి చేసేప్పుడు వచ్చే సమస్యలను జూన్ 10 నాటికి పరిష్కరించాలన్నారు. గడువు పెట్టుకొని గ్రామాల్లో దసరా నాటికి అంతర్గత పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు ముఖ్యమంత్రి.

డిసెంబర్ నెలాఖరు నాటికి వందకు వంద శాతం మిషన్ భగీరథ ప్రాజెక్టు పూర్తై, అన్ని గ్రామాల్లోని అన్ని ఇండ్లకు స్వచ్ఛమైన మంచినీరు చేరాలన్నారు సీఎం. నల్గొండ జిల్లాలోని మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాల్లో ఫ్లోరైడ్ సమస్య ఉందని.. ఆ నియోజకవర్గాలకు ముందుగా నీరివ్వాలని అధికారులకు సూచించారు. ఏజన్సీ ప్రాంతాలు, పల్లెలు ఎక్కువగా ఉండే ఆదిలాబాద్, ఆసిఫాబాద్, భూపాలపల్లి, మహబూబాబాద్ లాంటి జిల్లాలకోసం ప్రత్యేక ప్రణాళికతో పనిచేయాలన్నారు సీఎం. చెంచుగూడాలు, అటవీ ఆవాస ప్రాంతాలకు కూడా మంచినీరు అందివ్వాలన్నారు.

మిషన్ భగీరథ కార్యక్రమం అసాధారణమైందన్నారు ముఖ్యమంత్రి. ఇప్పుడు యావత్ దేశం ఈ కార్యక్రమంపై ఆసక్తి కనబరుస్తుందన్నారు. చాలా రాష్ట్రాలు మన పథకాన్ని అధ్యయనం చేసి, తమ రాష్ట్రాల్లో అమలు చేయడానికి రెడీ అవుతున్నాయన్నారు. అయితే మన దగ్గర మిషన్ భగీరథ ప్రాజెక్టు పూర్తి చేయడంతో పాటు దాన్ని ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించడం చాలా ముఖ్యమన్నారు సీఎం. ప్రాజెక్టును నిర్వహించడానికి అవసరమైన కార్యాచరణను రూపొందించాలని అధికారులకు సూచించారు సీఎం కేసీఆర్.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy