ఎన్నికల  ప్రచారానికి రెడీ అయిన బీజేపీ…రేపు పాలమూరుకి అమిత్ షా

రాష్ట్రంలో  ఎన్నికల  ప్రచారానికి  బీజేపీ రెడీ  అవుతోంది. రేపు  ఆపార్టీ  జాతీయ అధ్యక్షుడు  అమిత్ షా  పాలమూరు రాబోతున్నారు.  ఇక్కడి నుంచి  ఎన్నికల ప్రచారాన్ని  ప్రారంభించేందుకు  ఇప్పటికే  అన్ని ఏర్పాట్లు  పూర్తిచేసింది  బీజేపీ.  ఎన్నికల ప్రచారంలో  ప్రధాని మోడీ  కూడా  పాల్గొంటారని  చెబుతున్నారు  లీడర్లు.

దక్షిణాదిపై బీజేపీ నజర్ పెట్టింది. కర్ణాటక లాగే…రాష్ట్రంలోనూ సత్తా చాటాలని కమలం నేతలు భావిస్తున్నారు. తెలంగాణలోని 119స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టేందుకు ప్లాన్ చేస్తోంది బీజేపీ. రేపు పాలమూరు వేదికగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించేందుకు ప్లాన్ చేశారు నేతలు.  బీజేపీ ఛీప్ అమిత్ షా ఇందుకోసం మహబూబ్ నగర్ వస్తున్నారు. రేపు MVS ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో నిర్వహించే తొలిసభతో ఎన్నికల శంఖారావం పూరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

50వేల మంది కార్యకర్తలు సభకు వచ్చేలా ప్లాన్ చేశారు లీడర్లు. బీజేపీకి పాలమూరు జిల్లాకు ఉన్న ఉద్యమ అనుంబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఎన్నికల సభను ప్లాన్ చేశారు. ఉద్యమ సందర్భంలో తెలంగాణ పోరు యాత్ర… గతంలో జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల కోసం ఎడ్లబండ్ల యాత్రలు, పాదయాత్రలు నిర్వహించారు. దీనికి తోడు పాలమూరు జిల్లాలో బీజేపీకి మంచి పట్టుంది. మక్తల్, నారాయణపేట, కల్వకుర్తి, మహబూబ్ నగర్, షాద్ నగర్,  నియోజకవర్గాల్లో బలమైన కేడర్ ఉంది.

2012 ఎన్నికల్లో బీజేపీ తరపున యెన్నం శ్రీనివాస్ రెడ్డి విజయం సాధించారు. 2014 లో కల్వకుర్తి నుంచి ఆచారీ 150 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2004 ఎన్నికల్లో మక్తల్ నుంచి నాగూరావ్ నామాజీ 2వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆలంపూర్ నియోజకవర్గం నుంచి రావుల రవీంద్రనాథ్ రెడ్డి 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. బూత్ స్థాయి కార్యకర్తలు బలంగా ఉన్న మహబూబ్ నగర్ జిల్లాల్లోని 7 నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఇవ్వాలని బీజేపీ భావిస్తోంది. జాతీయ స్థాయి నేతలతో ప్రచారం ముమ్మరం చేసి… ఎన్నికల్లో విజయం సాధించాలని చూస్తోంది.

వారం రోజులుగా బీజేపీ రాష్ట్ర నేతలంతా మహబూబ్ నగర్ లోనే మకాం వేశారు. సీనియర్ నేతలు లక్ష్మణ్, కిషన్ రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు, ఎంపీ బండారు దత్తాత్రేయ… పాలమూరు సభ ఏర్పాట్లను పరిశీలించారు. నియోజకవర్గాల్లో సన్నాహాక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సభ ద్వారా టీఆర్ఎస్ కి ప్రత్యామ్నాయ పార్టీ బీజేపీయే అనే ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు.

అమిత్ షా పర్యటనతో బీజేపీ మరింత పుంజుకుంటుదని భావిస్తున్నారు నేతలు. గతంలో పొత్తుల వల్ల పాలమూరు జిల్లాలో నష్టపోయిన స్థానాల్లో సొంతంగా తమ అభ్యర్థులను బరిలోకి దించే అవకాశముంది. కొద్దిలో చేజారిన నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తామంటున్నారు లీడర్లు. ఇప్పటికే సభ వేదికను, గ్రౌండ్ ను సిద్దం చేసారు. మరోవైపు షా రాక కోసం పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు తీసుకున్నారు.

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy