ఎఫ్సీఐ: నెరవేరిన పదహారేళ్ల కల

kakaఎన్నో ఏళ్ల  కల నెరవేరబోతోంది. నష్టాల ఊబిలో కూరుకుపోయి.. పదహారేళ్లుగా మూతపడ్డ  రామగుండం ఎరువుల కర్మాగారం.. తిరిగి తెరుచుకుంటోంది. రోడ్డు పడ్డ కార్మికుల కల నెరవేబోతోంది. రీ ఓపెనింగ్  వెనుక … మాజీ కేంద్ర మంత్రి వెంకటస్వామి, పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ కృషి ఎంతో ఉంది. వాళ్లు చేసిన  పోరాటాలతోనే.. FCI  రీఓపెన్ అవుతోందని  కార్మికులు, రైతులు, ఉద్యోగులు  అంటున్నారు. ఆగస్టు 7న ప్రధాని మోడీ  చేతుల మీదుగా ప్రారంభం కానున్న.. రామగుండం ఎరువుల కర్మాగారం పునరుద్ధరణకు  సిద్ధమైంది .

ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. దీన్ని 1970 అక్టోబర్ 2న.. కరీంనగర్ జిల్లా రామగుండంలో ఏర్పాటు చేశారు. 1980 నవంబర్ 1న కమర్షియల్ గా.. నత్రజని ఎరువులను ఉత్పత్తి చేయటం ప్రారంభించింది. కానీ విద్యుత్ అంతరాయం, అధిక శాతం బూడిద కలిగిన బొగ్గు సరఫరా, మెషిన్లు సరిగా పనిచేయకపోవటం, సకాలంలో కేంద్రం ఆర్థిక వనరులు సమకూర్చకపోవటం వంటి కారణాలతో నష్టాల్లోకి వెళ్లింది. దీంతో అప్పటి కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం.. నూతన ఆర్థిక, పారిశ్రామిక విధానాల సాకుతో రామగుండం ఎరువుల కర్మాగారాన్ని.. మార్చి 31, 1999న అర్ధాంతరంగా మూసేసింది. దక్షిణ భారతదేశంలోని ఏకైక ఎరువుల కార్మాగారాన్ని మూసివేసి..బలవంతపు వాలంటరీ రిటైర్ మెంట్ స్కీంతో ఉద్యోగులను ఫ్యాక్టరీ నుంచి గెంటేశారు.

రామగుండం FCI మూతపడటంతో 1,070 మంది పర్మినెంట్ ఉద్యోగులు, 2వేల మందికి పైగా కాంట్రాక్టు కార్మికుల జీవితాలు రోడ్డునపడ్డాయి. ఆ సమయంలో 2004 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా.. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి కాకా వెంకటస్వామి..రామగుండం FCIని తిరిగి ప్రారంభిస్తానని కార్మికులకు హామీఇచ్చారు. ఆ దిశగా ప్రయత్నాలు చేశారు. అంతకుముందు 1989లో పెద్దపల్లి ఎంపీగా ఉన్న సమయంలోనే.. కంపెనీ మూసివేయాలన్న కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతిపాదనలను అడ్డుకున్నారు కాకా వెంకటస్వామి. ఫ్యాక్టరీ మూసివేస్తే కార్మికులు రోడ్డున పడుతారని..వారి జీవితాలతో ఆడుకోవద్దని కేంద్రంలోని సొంత పార్టీతో కొట్లాడారు. అప్పటి కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి రామ్ లఖన్ యాదవ్ ను FCIకి తీసుకొచ్చి..కార్మికులతో మాట్లాడించారు. NTPC నుంచి ప్యాక్టరీకి నిధులు ఇప్పించి కార్మికులకు జీతాలు చెల్లించేలా చేశారు.

2009లో పెద్దపల్లి ఎంపీగా వివేక్ పోటీచేస్తున్న సమయంలో.. ఉద్యోగులు,కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు.. రామగుండం ప్రాంత నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేందుకు.. తన తండ్రి ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు.. ఎరువుల కర్మాగారాన్ని తిరిగి ప్రారంభించేలా కృషిచేస్తానని హామీ ఇచ్చారు. ఎంపీగా గెలిచిన వెంటనే FCI పునరుద్ధరణకు కృషిచేశారు. అప్పటి కేంద్ర ఎరువులు రసాయనాలశాఖ మంత్రిని, జాయింట్ సెక్రటరీని ఎన్నోసార్లు కలిశారు. కార్మికులను, ఉద్యోగులను ఢిల్లీ తీసుకువెళ్లి కేంద్రం పెద్దలతో మాట్లాడించారు. 2012లో తన తండ్రి వెంకటస్వామితో కలిసి.. అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీతో.. రీఓపెనింగ్ పై చర్చించారు.

ఎంపీగా పలుమార్లు అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్, యూపీఏ చైర్ పర్సన్ సోనియాతో సమాశమై ప్యాక్టరీ రీ ఓపెన్ వల్ల వచ్చే ఉపయోగాలను వివరించారు వివేక్. గతంలో బొగ్గు ఆధారంగా నడవటం వల్ల ప్యాక్టరీ నష్టాల్లోకి వెళ్లినందున.. గ్యాస్ తో నడిచేలా ప్రతిపాదనలు సిద్ధంచేశారు. గ్యాస్ ఆధారిత ఎరువుల కర్మాగారానికి యూపీఏ-2తో పచ్చజెండా ఊపించారు. వివేక్ సూచనలతో కేంద్రప్రభుత్వం యూరియా ఉత్పత్తి కోసం.. NEW INVESTMENT POLICY – 2012, NO.12012/39/2011-FPP ఆర్డర్ జారీ చేసింది. మూతపడిన ఎరువుల కర్మాగారాన్ని పునరుద్ధరించేందుకు వివేక్ చేసిన కృషిని మరువలేమంటున్నారు.. ఫర్టిలైజర్ కంపెనీ కార్మికులు, ఉద్యోగులు.

అప్పటి కేంద్ర పెట్రోలియంశాఖ మంత్రి జైపాల్ రెడ్డిని కలిసి.. కేజీ బేసిన్ నుంచి.. రామగుండం ఎరువుల కర్మాగారానికి గ్యాస్ సరఫరా చేయాలని కోరారు వివేక్. మంత్రి ఆదేశాలతో సర్వే పూర్తయింది. 27 జూన్ 2013న జరిగిన ఫైనల్ హియరింగ్ లో కేంద్ర ప్రభుత్వం సమర్పించిన అప్రూవల్ ఆధారంగా.. FCI లిమిటెడ్ ను “సిక్” కంపెనీ జాబితా నుండి డి-రిజిష్టర్ చేశారు. దీంతో B.I.F.R జాబితాలో నుంచి రామగుండం FCI ని తొలగించి.. 10,200 కోట్ల అప్పును మాఫీ చేయించారు వివేక్.

ఎరువుల ఉత్పత్తి.. ప్రభుత్వ రంగ సంస్థల ఆధ్వర్యంలోనే నిర్వహించాలన్న వివేక్ సూచనలతో.. కేంద్ర ప్రభుత్వం నామినేషన్ పద్ధతిలో ఈక్విటీలు కేటాయించింది. మొత్తం 63శాతం ప్రభుత్వ రంగ సంస్థల భాగస్వామ్యంతో.. మిగిలిన 37 శాతాన్ని పబ్లిక్ సంస్థల పెట్టుబడితో.. ప్రస్తుతం రామగుండం ఎరవుల కర్మాగారాన్ని ప్రారంభిస్తున్నారు. తమ ఫ్యాక్టరీ తిరిగి ప్రారంభమౌతుందంటే.. అది వివేక్ చేసిన కృషేనని.. ఆయన చొరవ తీసుకోకుంటే.. ప్యాక్టరీ తిరిగి ప్రారంభమ్యేది కాదని.. FCI కార్మికులు, ఉద్యోగులు అంటున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని, తన తండ్రి కోరికను నెరవేర్చి.. కార్మికుల జీవితాలను కాపాడిన వివేక్ కు తాము జీవితాంతం రుణపడి ఉంటామని అంటున్నారు.

ప్రస్తుతం 5వేల కోట్లతో మొదటివిడత పనులు శరవేగంగా నడుస్తున్నాయి. పాత ప్యాక్టరీని పూర్తిగా డిస్ మెటల్ చేశారు. కేవలం యూరియా టవర్, చిమ్నీ, భారీ గోదామును మాత్రమే ఉంచారు. ఫ్యాక్టరీ ఆవరణలోని చెట్లను తీసేసి మైదానంలా మార్చారు. పాత బిల్డింగులకు మరమ్మతులు చేస్తున్నారు. ఆగస్టు 7న రామగుండం ఎన్టీపీసీ లో ప్రధాని మోడీ.. తెలంగాణ సూపర్ పవర్ థర్మల్ ప్రాజెక్టుతో పాటు.. రామగుండం FCIకి శంకుస్థాపన చేయనున్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy