ఎర్రమంజిల్‌లో కొత్త అసెంబ్లీ భవనం

Assembly-tsతెలంగాణ రాష్ట్ర శాసనసభ, శాసనమండలికి కొత్త భవన సముదాయాన్ని నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. నూతన భవనాల నిర్మాణానికి ఎర్రమంజిల్‌లోని జలసౌధ, రహదారులు-భవనాలశాఖ కార్యాలయాలున్న ప్రాంగణాన్ని ఎంపిక చేసినట్లు తెలిసింది.రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో.. సచివాలయం, అసెంబ్లీలకు నూతన భవనాలను నిర్మించాలని ప్రభుత్వం గతంలోనే నిర్ణయం తీసుకుంది. సనత్‌నగర్‌లోని ఛాతీ ఆసుపత్రి ప్రాంగణంలో అసెంబ్లీనీ, మానసిక వికలాంగుల ఆసుపత్రి ప్రాంగణంలో సచివాలయాన్ని ప్రభుత్వం నిర్మించాలనుకొంది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవడంతో ప్రభుత్వం తాత్కాలికంగా తమ నిర్ణయాన్ని వాయిదా వేసుకొంది. ప్రస్తుతం సెక్రటేరియట్‌లోని వాస్తుదోషాలను సరిదిద్దుతూ, ఇక్కడే సచివాలయాన్ని నిర్మించాలన్న అభిప్రాయానికి వచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ప్రస్తుత ప్రాంగణంలోని భవనాలన్నింటినీ కూల్చివేసి వాటి స్థానంలో నూతన నిర్మాణం చేపట్టాలని, ఇందుకు సంబంధించిన నమూనాల రూపకల్పన బాధ్యతను ముంబైకి చెందిన వాస్తుశిల్పి హఫీజ్‌కు అప్పగించింది. దీంతో సచివాలయ భవనం వ్యవహారం కొలిక్కి రావడంతో శాసనసభ భవనంపై ప్రభుత్వం దృష్టి సారించింది.ఈ నేపథ్యంలోనే ఎర్రమంజిల్‌లో అసెంబ్లీ భవన నిర్మాణం అన్నివిధాలా అనుకూలమన్న అభిప్రాయానికి ప్రభుత్వం వచ్చింది. ప్రస్తుతం ఇక్కడున్న నీటిపారుదలశాఖ భవనం ‘జలసౌధ’, రహదారులు-భవనాలశాఖ పాత భవనాలను కూల్చివేయాలని ఆలోచిస్తున్నారు. ఆర్‌అండ్‌బీ నూతన భవనం పరిసరాల్లో కొంత ఖాళీ స్థలం ఉంది. వీటన్నింటినీ సమీకరిస్తే పది ఎకరాలకుపైగా స్థలం వస్తుందని అధికారులు లెక్కతేల్చారు. ఇందులోనే తెలంగాణ శాసనసభకు నూతన భవనాన్ని నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. శాసనసభకు నూతన భవనాన్ని సమకూర్చిన తర్వాత… ప్రస్తుత భవనాన్ని తెలంగాణ చారిత్రక నేపథ్యం ప్రస్ఫుటించే మ్యూజియంగా లేదా నిజాం సర్కారు ఆనవాళ్లను చాటిచెప్పే ప్రదర్శనశాలగా మార్చాలని ప్రభత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అదే సందర్భంలో అసెంబ్లీ భవనాలు ‘హెరిటేజ్‌ భవనాల’ జాబితాలో ఉండటంతో వాటిని పరిరక్షించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy