ఎవరీ శశికళ : ఆయా నుంచి ఎదిగింది – అత్యాశతో పడింది!

jaya-sasikalaకలెక్టర్ ఇంట్లో ఆయాగా పని చేసిన శశికళ తమిళనాడు రాజకీయాలను శాసించే  స్థాయికి ఎదిగింది. జయతో పరిచయం ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. 1957లో తిరుతిరైపూండిలో బలమైన దేవర్ సామజిక వర్గానికి చెందిన వివేకానందన్, కృష్ణవేణి దంపతులకు ఆమె జన్మించారు. ఆమెకు నలుగురు సోదరులు, ఒక సోదరి ఉన్నారు. పదో తరగతి వరకు చదువుకున్న శశికళ 1973లో అప్పటి పౌరసంబంధాల అధికారి నటరాజన్ ను డీఎంకే చీఫ్ కరుణానిధి సమక్షంలో పెళ్లాడారు. పెళ్లి తర్వాత ఖాళీగా ఉండడం ఇష్టం లేక వీడియో షాప్ నడిపేవారు.

అమ్మకు ఆప్తురాలు :

కలెక్టర్ ఇంట్లో ఆయాగా పనిచేసిన శశికళ వీడియో షాపు ఏర్పాటు చేసింది. జయతో పరిచయం ఆమె జీవితాన్ని మార్చివేసింది. కొంతకాలంపాటు జయకు దూరమైనా తిరిగి ఆమె అదే స్థానంలో తిరిగి వచ్చారు. జయకు కుటుంబ సభ్యుల కంటే శశికళ అత్యంత ఆప్తురాలైంది. జయ అంటే శశికళ, శశికళ అంటే జయ అనే అభిప్రాయాన్ని కల్గించేలా వ్యవహరించారు. జయ కుటుంబ సభ్యులు, బంధువులు ఆమెకు దూరమయ్యారు. శశికళ కుటుంబసభ్యులు, బంధువులు జయకు దగ్గరయ్యారు. పెద్ద వాళ్ళతో పరిచయాలు పెంచుకోవాలనే ఆసక్తి శశికళను జయకు మరింత దగ్గరగా చేసింది. మరో వైపు జయ ఇబ్బందుల్లో ఉన్న కాలంలో ఆమెను ఓదార్చిన సానుభూతి కూడా శశికళను జయతోపాటే ఉంచుకొనేలా చేసింది.

కలెక్టర్ ఇంట్లో ఆయా :

శశికళ భర్త నటరాజన్ కలెక్టర్ చంద్రలేఖ దగ్గర పార్ట్ టైమ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ గా పనిచేసేవారు. ఆ సమయంలో శశికళ కెసెట్ లెండింగ్ లైబ్రరీ వల్ల పెద్దగా ఉపయోగం ఉండదని, వీడియో కవరేజీ షాపు ఏర్పాటు చేయాలని కలెక్టర్ నటరాజన్ కు సలహా ఇచ్చారు. ఈ సలహాతో శశికళతో వీడియో కవరేజీ షాపు ఏర్పాటు చేయించాడు నటరాజన్. అప్పుడే చంద్రలేఖకు బిడ్డ పుట్టింది. చంద్రలేఖ బిడ్డ ఆలనాపాలనా చూసేందుకు ఆమె ఆయాగా వెళ్ళారు. శశికళకు పిల్లలు లేరు. ఇది కూడా చంద్రలేఖ దగ్గర ఆయాగా పనిచేసేందుకు కారణమైందనే అభిప్రాయం ఉంది.

రాజకీయాలంటే పిచ్చి :

MGR బతికున్న సమయంలో జయలలిత అన్నాడిఎంకె ప్రచార కార్యదర్శిగా పని చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆమె పర్యటించేవారు. తన ప్రసంగాలను రికార్డు చేసి ఇచ్చేందుకు ఓ వ్యక్తి జయకు అవసరమైంది.చంద్రలేఖ ద్వారా జయలలితకు శశికళ పరిచయమైంది. ఈ సందర్భంగా వీరిద్దరికీ పరిచయం పెరిగింది. ఎంజీఆర్ బతికున్న కాలంలోనే జయను పార్టీ నుంచి బయటకు పంపేందుకు చేసే కుట్రలపై శశికళ ఓదార్చేదని చెబుతుంటారు. 1991లో జయలలిత తొలిసారి ముఖ్యమంత్రి కావడంతో శశికళ వెలుగులోకి వచ్చారు. జయతో శశికళకు సంబంధం మరింతగా పెరిగిపోయింది.

తన స్వార్థానికి జయ బలయ్యారు :

పరిచయమైన తర్వాత జయ వెన్నంటే ఉంది శశికళ. అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న, జయతోనే నడిచారు. కష్టాల్లో, సుఖాల్లో జయకు అండగా ఉన్నారు. శశికళ అన్న కొడుకు సుధాకరన్ ను జయ దత్తత తీసుకుంది. 1996లో ఘనంగా వివాహం చేసింది. ఈ పెళ్లితో ఆదాయానికి మించిన ఆస్తుల కేసు ఎదుర్కొంది. జయతో పాటు శశికళ ఈ కేసులో అరెస్టయ్యారు. డిఎంకే పెట్టిన ప్రతి కేసులో జయతో పాటు శశికళ పేరును చేర్చారు. 1996 ఎన్నికల్లో జయలలిత ఓటమికి శశికళ కారణమని, ఆమెతో సంబంధాలు చెడిపోయాయని జయ కూడా చెప్పడం విశేషం.

పన్నీర్ పేరు చెప్పిందే శశి అంటారు :
2001 ఎన్నికల్లో అన్నాడీఎంకే అధికారంలోకి వచ్చింది. అయితే కేసుల కారణంగా ఆమె సీఎం పీఠాన్ని అధిష్టించలేకపోయారు. ఈ సమయంలో పన్నీరు సెల్వం ను ముఖ్యమంత్రిని చేయాలని శశికళ సలహా ఇచ్చారని పార్టీలో ప్రచారం. జయను అమ్మగా పిలుచుకొంటే శశికళను చిన్నమ్మగా పిలిచేవారు. కార్యకర్తలు, మంత్రులు కూడా అమెను అదే గౌరవంతో చూసేవారు.

జయనే గెంటేసినా.. మళ్లీ వచ్చింది :

2011లో జయలలిత అధికారంలోకి వచ్చిన తర్వాత శశికళ కుటుంబసభ్యులు పోయెస్ గార్డెన్ కు వచ్చేవారు. పోయెస్ గార్డెన్ వ్యవహారాల్లో శశికళ బంధువుల జోక్యం పెరిగిపోవటంతో.. శశికళతో సహా అందర్నీ పార్టీ నుంచి బయటకు పంపించేశారు జయ. తనపై అన్యాయంగా కుట్ర పన్నుతున్నారని పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని జయ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఐదు నెలలు తిరక్కుండానే శశికళ రాతపూర్వక క్షమాపణ చెప్పడంతో మళ్ళీ ఇద్దరూ ఒక్కటయ్యారు. అప్పటి నుంచి అన్నాడీఎంకే పార్టీలో, ప్రభుత్వంలో తన వ్యతిరేకులను మెల్లగా తప్పిస్తూ.. అనుచరులకు చోటు కల్పిస్తూ శశికళ పావులు కదిపింది.

కుటుంబాన్నే దూరం పెట్టిన శశికళ :

శశికళ కుటుంబసభ్యులు పోయెస్ గార్డెన్ నుంచి ఒక్కొక్కరుగా దూరమయ్యారు. శశికళ భర్త నటరాజన్ ను దూరంగా ఉంచారు. ఆయనపై కేసులు పెట్టారు. పార్టీ కోశాధికారి, ఎంపీ దినకర్ పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. దత్తపుత్రుడు సుధాకరన్ పై కేసు నమోదైంది. ఒక్కొక్కరుగా జయ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోవాల్సి వచ్చింది. అయినా శశికళ మాత్రం జయను వదిలి వెళ్ళలేదు.

ఒకే ఒక్క అడుగు దూరంలో పాతాళానికి పడింది :

జయలలిత మరణం తర్వాత శశికళ ముఖ్యమంత్రి అవుతారని అందరూ అనుకున్నారు. అయితే పన్నీర్ సెల్వం సీఎంగా కావడం తర్వాత  కొద్ది రోజులకే పన్నీర్ రాజీనామా చేయడం జరిగింది. శశికళను పార్టీ  ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్న చిన్నమ్మకు సెల్వం ఎదురు తిరగడంతో కథ మొదటి కొచ్చింది. జయ అక్రమాస్తుల కేసులో శశికళ కూడా ఉండటం.. సుప్రీం దోషిగా తీర్పునివ్వడంతో చిన్నమ్మ సీఎం కల కల్ల అయ్యింది. తన అత్యాశ, డబ్బుపై వ్యామోహమే చిరకాల కలకు దూరం చేసింది. పదేళ్ల వరకు ఎన్నికల్లో పోటీకి అనర్హురాలు కావటంతో శశికళ సీఎం అవ్వటం కలే అంటున్నారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy