ఎస్పీ అయిన కండక్టర్ బిడ్డ.. ఐపీఎస్ శాలినీ అగ్నిహోత్రి సక్సెస్ స్టోరీ

ఓ పేదింటి ఆడబిడ్డ పెద్ద కొలువు చేస్తోంది. కష్టాలకు ఎదురీది.. పేదరికాన్ని జయించి … చదువులమ్మను ప్రసన్నం చేసుకుని… ఐపీఎస్ ఆఫీసర్ అయింది. సివిల్స్ గెల్చి దేశాన్ని తనవైపు తిప్పుకున్న.. హిమాచల్ ప్రదేశ్ ఐపీఎస్ ఆఫీసర్ శాలినీ అగ్నిహోత్రి జిల్లా ఎస్పీగా పదోన్నతి పొందారు.  తన తల్లి కోరిన కోరికను నిజం చేశారు.

1989 జనవరి 14న హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం ఉనా జిల్లా తాతల్ అనే ఊళ్లో పుట్టారు శాలినీ అగ్నిహోత్రి. తల్లిదండ్రులు శుభలత అగ్నిహోత్రి, రమేశ్. ఆమెకు ఓ అక్క, తమ్ముడు కూడా ఉన్నారు. చిన్నప్పుడు తన తల్లితో కలిసి బస్సులో వెళ్తున్నప్పుడు జరిగిన సంఘటన శాలినీ అగ్నిహోత్రి జీవితాన్నే మలుపు తిప్పింది. బస్సులో కాస్త అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని ఉద్దేశించి శాలినికి ఆమె తల్లి ఓ విషయం చెప్పింది. జిల్లా కలెక్టర్ స్థాయిలో ఉండిఉంటే ఈ పోకిరీని జైల్లో వేసేవాళ్లమని ఆమె తల్లి చెప్పడంతో..  ఆ మాటలు శాలిని మనసులో ముద్రపడిపోయాయి. ఎప్పటికైనా శాసించే స్థాయి అధికారి కావాలని శాలిని సంకల్పం ఏర్పర్చుకున్నారు.

శాలిని తండ్రి ఓ బస్సు కండక్టర్. తల్లి ఇంట్లోనే ఉండి బట్టలు కుడుతుండేది. వచ్చే డబ్బులతోనే పిల్లలను ఉన్నత చదువులు చదివించారు. ధర్మశాలలో స్కూలింగ్ పూర్తిచేశారు శాలినీ. టెంత్ లో 92.2 శాతం మార్కులు తెచ్చుకున్న శాలినీ.. ఇంటర్ లో కాస్త తక్కువగా.. 77శాతం ఉత్తీర్ణత శాతం సాధించారు. పాలంపూర్ లో అగ్రికల్చర్ బీఎస్సీ పూర్తిచేశారు. చదువు కొనసాగిస్తూనే సివిల్స్ దిశగా ప్రయత్నాలు చేశారు శాలినీ అగ్నిహోత్రి. యూపీఎస్సీ ఎగ్జామ్స్ రాస్తున్నట్టు ఆమె కుటుంబంలో కూడా ఎవరికీ తెలియదు. ఇంటర్నెట్ లో సబ్జెక్ట్ తెల్సుకోవడం.. కొత్త విషయాలు నేర్చుకోవడం, న్యూస్ పేపర్స్, మ్యాగజీన్స్, ఆర్టికల్స్ చదవడం.. అంశాలపట్ల పరిశోధనలు చేస్తుండేవారు.

అలా.. 2012లో సివిల్స్ లో 285వ ర్యాంక్ సంపాదించారు. పోలీసాఫీసర్ కావాలన్న ఆశయంతో… ముస్సోరీ ట్రైనింగ్ సెంటర్ లో శిక్షణ పొందారు.  హైదరాబాద్ లో 65వ ఐపీఎస్ బ్యాచ్ పాసింగ్ ఔట్ పరేడ్ లో పాల్గొన్నారు. 148 మంది ఐపీఎస్ లు ట్రైనింగ్ తీసుకున్న ఆ బ్యాచ్ లో ఆమే టాపర్. అలా ప్రధాని అందించిన బ్యాటన్ అందుకున్నారు. రాష్ట్రపతితో ప్రశంసలు పొందారు శాలినీ. బెస్ట్ ఫిమేల్ ఆల్ రౌండర్ ట్రెయినీ అధికారిగా అవార్డ్ దక్కించుకున్నారు.

అద్భుతమైన ప్రతిభ కారణంగా.. శాలినీ అగ్నిహోత్రికి సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ లోనే పనిచేసే అవకాశం దక్కింది. షిమ్లాలో అసిస్టెంట్ సూపరింటెండెంట్ పోలీస్ అధికారిగా బాధ్యతలు తీసుకున్నారు. 8ఏళ్ల వయసున్న కళ్లులేని చిన్నారిపై గ్యాంగ్ రేప్, షిమ్లాలో హత్య లాంటి.. సవాళ్లతో కూడుకున్న కేసులు ఎన్నింటినో దర్యాప్తుచేసి నిందితులకు శిక్షలు పడేట్టు చేశారు. నాలుగేళ్ల తర్వాత.. ఇపుడు లేటెస్ట్ గా కులు జిల్లా సూపరింటెండెంట్ పోలీస్ అధికారిగా పోస్టింగ్ పొందారు. అలా… జిల్లాస్థాయిలో అత్యున్నత అధికారి కావాలన్న తన కల నిజం చేసుకున్నారు శాలినీ అగ్నిహోత్రి. శాలిని అక్క డెంటల్ సర్జన్ గా.. ఆమె తమ్ముడు ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్ గా సేవలు అందిస్తున్నారు.

పేదరికం ఉన్నత లక్ష్యాన్ని సాధించేందుకు అడ్డుకాదని చెప్పేందుకు ఐపీఎస్ శాలినీ అగ్నిహోత్రి జీవితమే ఓ ఉదాహరణ. ఏబ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చామన్నది కాదు.. ఏ లక్ష్యం పెట్టుకున్నాం.. దాన్ని సాధించేందుకు ఎలాంటి మార్గంలో వెళ్తున్నామన్నదే ప్రధానం అంటున్నారు శాలినీ అగ్నిహోత్రి.

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy