‘ ఏకీకృత ‘ కు గెజిట్‌ నోటిఫికేషన్‌

gazetteఏకీకృత సర్వీసు నిబంధనలకు సంబంధించి గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. తెలుగు రాష్ట్రాల్లో ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు రూల్స్‌ ఫైలుపై రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ గురువారం సంతకం చేసిన వెంటనే ఒక్క రోజులోనే గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. విద్యా శాఖలో గెజిటెడ్‌ పోస్టులైన ఎంఈవో, హైస్కూల్‌ ప్రధాన ఉపాధ్యాయుడు, డైట్‌ సీనియర్‌ లెక్చరర్‌, డైట్‌ లెక్చరర్‌ పోస్టులను లోకల్‌ కేడర్‌గా వ్యవస్థీకృతం చేస్తూ నోటిఫికేషన్‌ జారీ చేసింది కేంద్రం. జిల్లా, మండల పరిషత్‌ పాఠశాలల్లోని నాన్‌ గెజిటెడ్‌ కేటగిరీ ఉపాధ్యాయ పోస్టులన్నిటినీ లోకల్‌ కేడర్‌గా వ్యవస్థీకృతం చేసినట్లు పేర్కొంది. ఈ ఉత్తర్వులు 1998 నవంబరు ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చినట్లు ఉత్తర్వుల్లో పొందుపర్చింది. గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసిన నేపథ్యంలో ఇక కొత్త సర్వీసు నిబంధనల రూపకల్పనపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.

దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం : వెంకయ్య

ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు రూల్స్‌కు రాష్ట్రపతి ఆమోదం చారిత్రక ఘటన అని కేంద్ర మంత్రి వెంకయ్య వ్యాఖ్యానించారు. తెలంగాణ, ఏపీలో టీచర్ల దీర్ఘకాలిక సమస్యలకు ఇది పరిష్కారమని అన్నారు. రెండు రాష్ట్రాల ఉపాధ్యాయులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఉపాధ్యాయుల 20 ఏళ్ల నిరీక్షణకు తెర దించుతామంటూ ఎన్నికలలో చేసిన వాగ్దానాన్ని ఎన్డీయే నెరవేర్చిందన్నారు వెంకయ్య.

కడియంకు అభినందన

ఏకీకృత సర్వీసు నిబంధనలకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేయటంతో రెండు దశాబ్దాల టీచర్ల ఎదురుచూపులకు పుల్‌స్టాప్‌ పడినట్లయిందన్నారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు పూల రవీందర్‌, జనార్దన్‌ రెడ్డి, సుధాకర్‌ రెడ్డి, ఉపాధ్యాయ సంఘాల నేతలు శుక్రవారం సచివాలయంలోని మంత్రి చాంబర్‌లో కడియంను కలిసి అభినందించారు. విద్యాశాఖ మంత్రిగా పలుమార్లు కేంద్రంతో చర్చించానన్నారు కడియం. ఇది కేవలం తెలంగాణ రాష్ట్రం డిమాండ్‌ కాదని, ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావుతో కలిసి కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, వెంకయ్యనాయుడులను కలిసి వీలైనంత త్వరగా ఆమోదించేందుకు సహకరించాలని కోరినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌, కేంద్ర మంత్రి వెంకయ్య చొరవతో 20 ఏళ్ల ఉమ్మడి పోరాటానికి ముగింపు లభించిందన్నారు శ్రీహరి.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy