
మాస్టర్ ప్లాన్ కు తగ్గట్టు పనులు జరగట్లేవని విమర్శ
ఏపీ రాజధాని నిర్మాణంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ప్రజాసంఘాల నాయకులు. సింగపూర్ అందించిన మాస్టర్ ప్లాన్ లో ఏం ఉందో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ప్రజా రాజధానిగా అమరావతిని ఏర్పాటు చేస్తామని చెబుతున్నా… అందుకు తగ్గట్టు క్షేత్రస్థాయిలో పనులు లేవని విమర్శిస్తున్నారు. సింగపూర్ అందించిన మాస్టర్ ప్లాన్ లో సమగ్ర రూపం లేదంటున్నారు ప్రజాసంఘాల నేతలు. రాజధాని నిర్మాణంపై ప్రభుత్వనికి చిత్తశుద్ది లేదంటున్నారు. క్యాపిటల్ సిటీ నిర్మాణంలో భవనాలకు కేటాయించిన స్థలం వివరాలు, రోడ్లు, మౌలిక సౌకర్యాల కల్పన వంటి విషయాలను చెప్పిన సింగపూర్ కమిటీ… రైతులకు సంబంధించిన అంశాలు ఎందుకు ప్రస్తవించ లేదని అంటున్నారు. క్యాపిటల్ సిటీ నిర్మాణంలో కారిడార్లు, పారిశ్రామిక వాడలు, నదులు, పర్యాటక కేంద్రాల గురించి వివరించిన కమిటీ… రాజధాని నిర్మాణం కోసం వ్యవసాయ భూములు త్యాగం చేసిన రైతుల సంక్షేమం, సహాయం వంటి అంశాలు లేకపోవడంతో రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వచ్చే నెల 6న రాజధాని నిర్మాణానికి భూమి పూజ చేసేందుకు ప్రభుత్వం రెడీ అవుతుంటే…ప్రజా సంఘాలు మాత్రం సింగపూర్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.