ఐపీఎల్ : సింహాల‌ను చీల్చి చెండాడిన వార్న‌ర్

telబౌలింగ్‌లో గుజ‌రాత్ ల‌య‌న్స్‌ను  స‌న్‌రైజ‌ర్స్ ఆట‌గాడు ర‌షీద్ ఖాన్ దెబ్బ‌తీస్తే.. బ్యాటింగ్‌లో వార్న‌ర్‌, హెన్రిక్స్ చీల్చిచెండాడారు. ఫ‌లితంగా గుజ‌రాత్ ల‌యన్స్ విధించిన 136 ప‌రుగుల టార్గెట్‌ను ఆడుతూ పాడుతూ చేధించి 9 వికెట్ల తేడాతో విక్ట‌రీ న‌మోదు చేసింది స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు. తొలి బంతి నుంచే విజృభించారు ఓపెనర్లు ధ‌వన్‌, వార్న‌ర్ . గుజ‌రాత్ బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించారు. బౌలింగ్ మార్పులు చేసిన‌ప్ప‌టికీ పెద్ద‌గా ఫ‌లితం రాబ‌ట్ట‌లేక‌పోయాడు గుజ‌రాత్ ల‌య‌న్స్ కెప్టెన్ సురేష్ రైనా. శిఖ‌ర్ ధ‌వ‌న్ త్వ‌ర‌గానే ఔటైనా… ఆ త‌ర్వాత వ‌చ్చిన హెన్రిక్స్ కెప్టెన్ వార్న‌ర్‌కు చ‌క్క‌టి స‌హ‌కారం అందించాడు. బ్యాడ్ బాల్స్‌ను బౌండ‌రీకి త‌ర‌లిస్తూ ఇద్ద‌రూ చ‌క్క‌టి షాట్ల‌తో ఆక‌ట్టుకున్నారు.  ఈ క్ర‌మంలోనే డేవిడ్ వార్న‌ర్ హాఫ్ సెంచ‌రీ కంప్లీట్ చేసుకున్నాడు. ఆ త‌ర్వాత హెన్రిక్స్ కూడా 38 బంతుల్లో అర్థ‌సెంచ‌రీ పూర్తి చేశాడు. చివ‌రిగా సిక్స్‌తో స్టైల్‌గా ఆట‌ను ముగించేశాడు వార్న‌ర్‌. కేవ‌లం 45 బంతులు ఎదుర్కొన్న వార్న‌ర్ 76 ప‌రుగుల‌తో నాటౌట్‌గా నిలిచాడు. ఇందులో 4 భారీ సిక్స‌ర్లు ఉన్నాయి.

అంత‌కుముందు టాస్ గెలిచి ప్ర‌త్య‌ర్థి జ‌ట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించింది స‌న్‌రైజ‌ర్స్  హైద‌రాబాద్ జ‌ట్టు. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో గుజ‌రాత్ ల‌యన్స్ 7 వికెట్లు కోల్పోయి 135 ప‌రుగులు చేసింది. గుజ‌రాత్ ల‌య‌న్స్ త‌ర‌పున జేస‌న్ రాయ్ అద్భుత‌మైన శుభారంభాన్ని ఇచ్చాడు. ఛాన్స్ దొరికిన‌ప్పుడ‌ల్లా బంతిని బౌండ‌రీకి త‌ర‌లిస్తూ వార్న‌ర్ సేన‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించాడు. ఐదో ఓవ‌ర్లో స‌న్‌రైజ‌ర్స్ హీరో రషీద్ ఖాన్ వేసిన తొలి ఓవ‌ర్లో బ్రెండ‌న్ మెక‌ల్ల‌మ్‌ను ఎల్బీడ‌బ్ల్యూ చేసి పెవీలియ‌న్‌కు పంపాడు. మెక్‌కల్ల‌మ్ కేవ‌లం 5 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. మ‌రోవైపు జేస‌న్ రాయ్ బ్యాట్‌తో చెల‌రేగిపోతున్న స‌మ‌యంలో భువ‌నేశ్వ‌ర్ కుమార్ బ్రేక్ వేశాడు. భువీ వేసిన బంతిని ఆడిన రాయ్ శిఖ‌ర్ ధ‌వ‌న్ అద్భుత‌మైన క్యాచ్ ప‌ట్ట‌డంతో 31 ప‌రుగులు చేసి వెనుదిరిగాడు. కోల్‌క‌తాపై చెల‌రేగిపోయిన ఆరోన్ ఫించ్ ఈ రోజు మ్యాచ్‌లో ర‌శీద్ దెబ్బ‌కు 3 ప‌రుగులు మాత్ర‌మే చేసి వెనుదిరిగాడు. ఆ వెంట‌నే కెప్టెన్ రైనాను కూడా 5 ప‌రుగుల‌కే వెన‌క్కు పంపాడు ర‌షీద్‌ఖాన్. ఆ త‌ర్వాత బ్యాటింగ్‌కు దిగిన దినేష్ కార్తీక్‌, డ్వేన్ స్మిత్‌లు స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లే బాధ్య‌త‌ను త‌మ భుజాల‌పై వేసుకున్నారు. స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో భువ‌నేశ్వ‌ర్ బౌలింగ్‌లో భారీ సిక్స్‌కోసం ప్ర‌య‌త్నించి స్మిత్ బౌండ‌రీ వ‌ద్ద స‌బ్స్‌టిట్యూట్ శంక‌ర్ చేతికి చిక్కాడు. 27 బంతుల్లో స్మిత్ 37 ప‌రుగులు చేశాడు. స్మిత్ ఔట‌యిన కొద్దిసేప‌టికే దినేష్ కార్తీక్ (30)ఆశిష్ నెహ్రా బౌలింగ్‌లో కీప‌ర్ న‌మాన్ ఓజాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇదే క్ర‌మంలో లేనిప‌రుగు కోసం ప్ర‌య‌త్నించి కుల్‌క‌ర్ణి ర‌నౌట్ అయ్యాడు. ఆ త‌ర్వాత వ‌చ్చిన వారు పెద్ద‌గా ప‌రుగులు రాబ‌ట్టడంలో విఫ‌ల‌మ‌వ‌డంతో 135 ప‌రుగుల‌తోనే గుజ‌రాత్ ల‌య‌న్స్ తృప్తి చెందాల్సి వ‌చ్చింది.

త‌న త‌దుపరి మ్యాచ్‌ను హైద‌రాబాద్ స‌న్‌రైజ‌ర్స్ జ‌ట్టు ఏప్రిల్ 12న ముంబై ఇండియ‌న్స్‌తో వాంఖాడే స్టేడియంలో త‌ల‌ప‌డ‌నుంది.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy