ఐపీఎల్ 10 ఫైన‌ల్స్‌: మ‌రాఠా వార్‌లో ముంబైదే టైటిల్‌

mumbaiహైద‌రాబాద్ రాజీవ్ గాంధీ ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ స్టేడియం వేదిక‌గా జ‌రిగిన ఐపీఎల్ ఫైన‌ల్ పోరులో విజ‌యం ముంబై ఇండియ‌న్స్‌ను వ‌రించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టు అతి క‌ష్టం మీద 130 ప‌రుగులు చేసింది. అనంత‌రం 130 ప‌రుగుల టార్గెట్‌తో బ్యాటింగ్‌కు దిగిన స్మిత్ సేన ఆదిలో త‌డ‌బ‌డ్డా ఆ త‌ర్వాత పుంజుకుంది. జ‌ట్టు 17 ప‌రుగుల వ‌ద్ద ఓపెన‌ర్ రాహుల్ త్రిపాఠీ 3 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు. ఆ వెంట‌నే జ‌ట్టు స్కోరు 23 వ‌ద్ద మ‌రో ఓపెన‌ర్ అజింక్యా ర‌హానే ఇచ్చిన సునాయాస‌మైన క్యాచ్‌ను కృణాల్ పాండ్యా జార‌విడిచాడు. అస‌లే త‌క్కువ స్కోరు డిఫెండ్ చేస్తున్న ముంబై ఇండియ‌న్స్‌కు కృణాల్ పాండ్యా క్యాచ్ జార‌విడ‌చ‌డం రుచించ‌లేదు. దీంతో ప‌వ‌ర్ ప్లే ముగిసే స‌మ‌యానికి పూణే స్కోరు 38 ప‌రుగుల‌కు చేరుకుంది. అనంత‌రం బ్యాట్‌కు ప‌ని చెప్పాడు ర‌హానే. వీలు చిక్కిన‌ప్పుడ‌ల్లా బంతిని బౌండ‌రీకి త‌ర‌లిస్తూ స్కోరు బోర్డు వేగాన్ని పెంచాడు. ఈ క్ర‌మంలోనే ర‌హానే 44 ప‌రుగుల వ‌ద్ద జాన్స‌న్ బౌలింగ్‌లో పొలార్డ్ అద్భుత‌మైన‌ క్యాచ్ ప‌ట్ట‌డంతో పెవీలియ‌న్ చేరాడు.

త‌ర్వాత క్రీజులోకి వ‌చ్చిన ధోనీ ఆచితూచి ఆడాడు. 15 ఓవ‌ర్ల‌కు పూణే జ‌ట్టు స్కోరు 83 ప‌రుగుల‌కు చేరుకుంది.చివ‌రి 5 ఓవ‌ర్ల‌లో 47 ప‌రుగులు చేయాల్సి ఉంది. 16వ ఓవ‌ర్లో కృణాల్ పాండ్యా వేసిన ఓవ‌ర్లో బంతిని బౌండ‌రీకి త‌ర‌లించాడు ధోనీ. 24 బంతుల త‌ర్వాత తొలి బౌండ‌రీ పూణే సాధించింది. అదే ఓవ‌ర్లో స్మిత్ ఓ భారీ సిక్స్ కొట్ట‌డంతో మొత్తం 14 ప‌రుగులు వ‌చ్చాయి. ఆ త‌ర్వాత బుమ్రా వేసిన ఓవ‌ర్లో ధోనీ ఔట్ అవ‌డంతో మ్యాచ్‌పై ప‌ట్టు బిగించిన‌ట్లు క‌నిపించింది. బుమ్రా కేవ‌లం 2 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చి క‌ట్ట‌డి చేశాడు. ఇన్నింగ్స్ 18 వ ఓవ‌ర్లో మ‌లింగా బౌలింగ్‌లో ఓ బౌండ‌రీ సాధించింది. 19వ ఓవ‌ర్లో బుమ్రా వేసిన ఓవ‌ర్లో స్మిత్ ఓ సిక్స్ కొట్టాడు. చివ‌రి ఆరు బంతుల‌కు 11 ప‌రుగులు కావాల్సిన త‌రుణంలో జాన్సన్ వేసిన తొలి బంతిని బౌండ‌రీకి త‌ర‌లించాడు తివారి. త‌ర్వాత బంతికే తివారీ పొలార్డ్‌కు క్యాచ్ ఇచ్చి ఔట‌వ‌డంతో ప్రేక్ష‌కుల్లో న‌రాలు తెగే ఉత్కంఠ నెల‌కొంది. త‌ర్వాతి బంతికి స్మిత్ భారీ సిక్స్‌కు ప్ర‌య‌త్నించి బౌండ‌రీ వ‌ద్ద రాయుడుకు చిక్కాడు. ఇక చివ‌రి బంతికి 4 ప‌రుగులు కావాల్సి ఉండ‌గా డేనియ‌ల్ క్రిస్టియ‌న్ 2 ప‌రుగులు చేయ‌డం మూడో ప‌రుగుకు ప్ర‌య‌త్నించ‌గా సుంద‌ర్ ర‌నౌట్ అయ్యాడు. దీంతో ముంబై ఒక్క ప‌రుగు తేడాతో విజ‌యం న‌మోదు చేసింది

అంత‌కు ముందు బ్యాటింగ్‌కు దిగిన ముంబై జ‌ట్టును పూణే బౌల‌ర్ ఉన‌ద్క‌త్ ఆదిలోనే దెబ్బ తీశాడు. ఫామ్‌లో ఉన్న పార్థివ్ ప‌టేల్‌ను 4 ప‌రుగుల‌కే పెవీలియ‌న్‌కు పంప‌గా అదే ఓవ‌ర్లో మ‌రో ఓపెన‌ర్ సిమ్మ‌న్స్‌ను అద్భ‌త‌మైన క్యాచ్‌తో ఔట్ చేశాడు ఉన‌ద్క‌త్‌. హైద‌రాబాద్‌కు లోక‌ల్ బాయ్ అయిన అంబ‌టి రాయుడు కూడా 12 ప‌రుగులు చేసి ర‌నౌట్ అయ్యాడు. ఇక స్కోరును ముందుకు తీసుకెళ్లే బాధ్య‌త రోహిత్ శ‌ర్మ‌, కృణాల్ పాండ్యాలు తీసుకున్నారు. ఈ క్ర‌మంలోనే రోహిత్ శ‌ర్మ (24)ను స్పిన్న‌ర్ జంపా బోల్తా కొట్టించాడు. పొలార్డ్ కూడా ఇలా వ‌చ్చి అలా వెళ్ల‌డంతో భారీ స్కోరు సాధించ‌డంపై ముంబై ఇండియ‌న్స్ ఆశ‌లు వ‌దులుకుంది. జ‌ట్టు స్కోరు ఆ మాత్ర‌మైన వ‌చ్చిందంటే అది కృణాల్ పాండ్యా చ‌లువే. 38 బంతులు ఎదుర్కొన్న పాండ్యా 47 ప‌రుగులు చేశాడు. ఇందులో 3 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి. దీంతో ముంబై జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 129 ప‌రుగులు చేసింది.

పూణే బౌల‌ర్ల‌లో ఉన‌ద్క‌త్‌, జంపా, డేనియ‌ల్ క్రిస్టియ‌న్‌లు చెరో 2 వికెట్లు తీశారు. టోర్న‌మెంట్ మొత్తంలో పూణే జ‌ట్టు ముంబైతో నాలుగు మ్యాచులు ఆడ‌గా మూడింటిలో విజ‌యం సాధించి కీల‌క ఫైన‌ల్ మ్యాచ్‌లో చేతులెత్తేసింది.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy