ఐరన్ లేడి: ఇరోమ్ చానూ షర్మిల

irom_sharmila2యుద్ధం ఎన్నోరకాలు. కత్తి యుద్ధం నుంచి ఏరియల్ బాంబింగ్ వరకు ఎన్నిరకాలుగానైనా ఉంటుంది. కానీ, ఆయుధాల్లేకుండా చేసే యుద్ధమే అన్నింటిలోనూ డిఫికల్ట్. ఇదో మౌన పోరాటం. తిండి లేకుండా రోజుల తరబడి దీక్ష చేయడమంటే మామూలు విషయం కాదు. గాంధీజీ చూపించిన ఈ దారిలో నడవడమంటే అందరివల్లా కాదు….ఎంతో ధైర్యముండాలి. ఎంతో నిజాయితీ ఉండాలి. ఇరోమ్ చానూ షర్మిలకి ఇలాంటి ధైర్యముంది. నిజాయితీ ఉంది. అందుకనే అనుకున్న లక్ష్యం సాధించడానికి ఏకంగా పదహారేళ్ళు దీక్ష చేసింది. చరిత్రలో తనకో పేజీ క్రియేట్ చేసుకుంది ఐరన్ లేడీ షర్మిల.

చింపిరిజుట్టుతో హాస్పిటల్ బెడ్ మీద పడి ఉంటూ ఏళ్ళతరబడి దీక్ష చేస్తూనే ఉంది షర్మిల. 16 కేలండర్లు మారాయి.  ఇన్నేళ్ళూ పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదు. ఒక్క ముద్ద ముట్టలేదు. బలవంతంగా డాక్టర్లు ఎక్కిస్తున్న ఫ్లూయిడ్సే బతికిస్తున్నాయి. జస్ట్ బతకడానికే ఈ ఫ్లూయిడ్స్. జీవచ్ఛవంలా బతకడానికే. నిలబడడానికి కూడా బలం ఉండదు. నడవడానికీ ఎవరో ఒకరు చేయి అందించాల్సిందే. మణిపూర్ లో అమలుచేస్తున్న ఆర్మీ చట్టాన్ని ఎత్తేయాలనే డిమాండ్ తో షర్మిల మొదలుపెట్టిన ఈ దీక్షకు ఈ మంగళవారమే అంటే ఆగస్టు 9 నే ఆఖరిరోజు.

మణిపూర్ మణిదీపం..

దేశానికి తూర్పున ఉండే మణిపూర్ చాలా చిన్న రాష్ట్రం. జనాభా 30 లక్షల లోపే. పెద్దగా వార్తల్లోకి రాదు మణిపూర్. అలాంటిది, షర్మిల దీక్ష మణిపూర్ ను వార్తల్లోకే కాదు, వాస్తవంలోకి కూడా లాక్కొచ్చింది. భారత ప్రభుత్వం అక్కడ అమలు చేస్తున్న AFSPA చట్టానికి నిరసనగా షర్మిల చేపట్టిన దీక్ష ఒక్కసారిగా మణిపూర్ పై ఫోకస్ ను పెంచింది.

ఆర్మీకి ప్రత్యేక అధికారాల్ని ఇచ్చే ఈ చట్టాన్ని మణిపూర్ లో అమలుచేయకుండా ఆపేయాలన్నది షర్మిల ఆకాంక్ష. దీనికోసమే నిరాహారదీక్ష. తిండి తినకపోవడమే కాదు, మంచినీళ్ళు కూడా ముట్టనంది. ద్రౌపది శపథం పట్టినట్టు షర్మిల కూడా జుట్టు దువ్వనంది. అద్దంలో చూసుకోనంది. అక్షరాలా అన్నమాటకే కట్టుబడింది ఇన్నేళ్ళూ.

ఉన్నట్టుండి….అందరికీ షాక్ ఇచ్చింది షర్మిల. దీక్ష విరమిస్తున్నానని  ప్రకటించింది. పెళ్ళి చేసుకోబోతున్నానంది. పాలిటిక్స్ లోకి కూడా అడుగుపెడతానంది. ఆమె దీక్షకు హారతులు పట్టే మణిపూర్ ప్రజలు….విరమణ కబురు విని ఉలిక్కిపడ్డా….నెమ్మది నెమ్మదిగా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. తనకు తాను విధించుకున్న శిక్షను రద్దు చేసుకుంటున్నట్టు చెప్పడం విని హమ్మయ్య అనుకుంటున్నారు.

AFSPA చట్టాన్ని రద్దు చేయాలనే డిమాండ్ తో ఆమరణదీక్ష ఆరంభించింది షర్మిల.  ఈ చట్టం ఇచ్చిన అధికారాలతో ఆర్మీ జవాన్లు రెచ్చిపోతున్నారని షర్మిల నమ్మేది.  2000 సంవత్సరం నవంబర్ లో మాలోమ్ అనే ఊళ్ళో జవాన్ల కాల్పుల్లో 10 మంది చనిపోవడం షర్మిలను కదిలించేసింది. వీళ్ళంతా బస్ కోసం వెయిట్ చేస్తున్నారని, అంతా అమాయకులేనని అప్పట్లో వార్తలు వచ్చాయి. అంతే, ఇది తెలిశాక….షర్మిల అన్నం తినడం మానేసింది. మౌనంగా ఉంటూ….మాట్లాడడం కూడా మానేసింది. సైన్యానికి ఇలాంటి అధికారాలు ఇవ్వడమేంటని వాపోతూ…. కనిపించినవాళ్ళందరినీ వివరాలడిగేది. ఈ చట్టంమీద అప్పటికే మణిపూర్ లో ఆందోళనలు జరుగుతుండడంతో….షర్మిల ఆ ఉద్యమకారులతో  పరిచయాలు పెంచుకుంది. AFSPA అంతు చూస్తానంటూ  ఆమరణ నిరాహార దీక్ష చేయాలని డిసైడయింది.

2000 సంవత్సరంలో నవంబర్ 2. షర్మిల దీక్ష ప్రారంభించింది. తిండీ నీరు ముట్టకుండా నాలుగురోజులు దీక్ష చేసింది. ఐదోరోజున ఆమెను అరెస్టు చేసి….ఆస్పత్రిలో చేర్చారు. బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించారు. 16 రోజుల తరువాత ఆస్పత్రినుంచి డిస్ చార్జి చేశారు. కానీ, మళ్ళీ నిరాహార దీక్ష మొదలుపెట్టడంతో మర్నాడే అరెస్టు చేసి….ఆస్పత్రిలో చేర్చారు. అది మొదలు….2014 వరకు ఇంతే. దీక్షను ఆపడం, అరెస్టు చేయడం, కోర్టుకు తీసుకెళ్ళడం, ఆస్పత్రిలో చేర్చడం….ఇలాగే జరుగుతూ వచ్చింది.

నిరాహారదీక్ష చేయడమంటే ఆత్మహత్యకు ప్రయత్నించడంతో సమానం కనుక….ఈ తంతు ఇలా ఏళ్ళ తరబడీ జరుగుతూనే ఉంది. తనేమీ ఆత్మహత్యకు ప్రయత్నం చేయడంలేదని పదేపదే చెప్పేది షర్మిల. AFSPA చట్టం లాంటి దారుణమైన చట్టం అమల్లో ఉన్నచోట ఉండడంకన్నా చావే నయమనేది.

ఇంఫాల్ సిటీలోని జేఎన్ హాస్పిటల్ స్పెషల్ వార్డులో ఒక రూమ్ షర్మిలకు పర్మనెంట్ గా ఎలాట్ చేశారు. అక్కడే ఆమె పదహారేళ్ళ జీవితం గడిచింది. ఈ ఆస్పత్రిలో షర్మిలను చేర్చినట్టు, డిస్ చార్జి చేసినట్టు….ఉన్న రికార్డు ఇది. 2013 వరకు అడ్మిషన్లు మాత్రమే ఇందులో ఉన్నాయి. ఎప్పుడెప్పుడు చేర్చిందీ, ఎన్నాళ్ళు ఉన్నదీ ఈ రికార్డే చెప్తుంది. 2014 లో ఈ రికార్డు బయటికొచ్చింది.

జైలు కానీ జైలులో ఖైదీ కాని ఖైదీ. హాస్పిటలే ఆమెకు ఇల్లయిపోయింది….అప్పుడప్పుడు ఆస్పత్రి కారిడార్ దగ్గరకు వచ్చి….బయటికి చూస్తూ ఉండేది.

ఏడాదికి ఒకసారైనా ఆమెను బయటికి తీసుకొచ్చి శిబిరంలో కూర్చోబెట్టేవారు. చట్టం గురించి జనంలో అవగాహన కల్పించడానికి ఇలా చేసేవారు కానీ, షర్మిల జనం మధ్య ఉండడానికి అంత ఇష్టపడేది కాదు.

ఈ పదహారేళ్ళుగా షర్మిలకు ఫ్లూయిడ్స్ మాత్రమే ఇచ్చారు. ముక్కులోనుంచి ఉదరభాగం వరకు పైప్ పెట్టి….అందులోనుంచి జ్యూస్ లవీ పంపేవారు. లిక్విడ్ సెరెలాక్ , యాపీ జ్యూస్, హార్లిక్స్ ప్రతిరోజూ ఇచ్చేవారు. మొత్తం 1600 క్యాలరీలకు తగ్గకుండా ఇచ్చి, ఆమెను బతికించేవారు.

irom sharmila1దీక్షతో సెలబ్రిటీ…

ఈ డిఫరెంట్ దీక్షతో షర్మిల ఓ సెలెబ్రిటీ అయిపోయింది. ఎన్నో దేశాల జర్నలిస్టులు ఆమెను ఇంటర్వ్యూ చేశారు. షర్మిల గురించి, ఆమె దీక్ష గురించి రాయని పెద్ద పేపర్ కానీ, విజువల్స్ చూపించని పెద్ద చానల్ కానీ ప్రపంచంలో లేవంటే నమ్మాల్సిందే. నీరసం, నిస్సత్తువ కారణంగా షర్మిల మాట్లాడడానికి ఇబ్బందిపడేది. అయినా సరే, ఆమెను చూపిస్తే చాలనుకుంటూ ఇంటర్వ్యూలు తీసుకునేవారు.

‘చుట్టుపక్కలవాళ్ళంతా ఏదో ఒకటి తినడం చూస్తుంటే….ఎప్పుడూ నీకు తినాలనిపించలేదా?’ అని ఒకసారి ఓ జర్నలిస్టు అడిగితే, ‘ఎందుకు అనిపించదు, అనిపిస్తుంది. కానీ కోరికను బలవంతంగా అణిచేసుకుంటా’ అని జవాబిచ్చింది. తినగలిగి ఉండి కూడా తినకపోవడం అంటే ఎంత ఘోరంగా ఉంటుందో ఊహించుకోవల్సిందే.

తినాలనే కోరికనే కాదు….బయట తిరగాలని, టీవీ చూడాలని, ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలని….ఇలాంటివెన్నో కోరికల్ని అణిచేసుకుంది. జీవితంలో ఎంతో విలువైన యవ్వన దశను, కౌమార దశను త్యాగం చేసేసింది.

జంతర్ మంతర్ దగ్గర దీక్ష చేసినందుకు షర్మిలమీద పెట్టిన కేసును ఈ ఏడాది మార్చిలో ఎత్తేశారు. అప్పటినుంచి షర్మిల ఫ్రీ బర్డ్ అయింది. కొంత మార్పు అప్పటినుంచి మొదలైంది ఆమెలో.

దీక్షతోపాటు ఉద్యమం కూడా క్లోజ్?

ఈ పదహారేళ్ళ దీక్షకు ఫైనల్ డే ఈ ఆగస్టు 9. మరి, షర్మిల దీక్షలతో AFSPA చట్టం రద్దయిపోయిందా? అందుకనే దీక్ష మానేస్తుందా? నో….చట్టం అలాగే ఉంది. భవిష్యత్తులోనూ ఉంటుంది. మరి ఎందుకు దీక్ష ముగించబోతోంది? దీనికి కారణం ఎవరు?

44 ఏళ్ళ షర్మిల దీక్షను ఎందుకు ముగించబోతోందో ఎవరికీ వెంటనే తెలియలేదు. ఆమె చెప్పలేదు. ఎవరూ అడగలేదు కూడా. ఎందుకంటే, ఆమె దీక్ష చాలించాలని అందరూ ఎదురుచూస్తున్నారు కనుక.

కానీ, దీక్ష ఎండింగ్ ఎనౌన్స్ మెంట్ తో పాటు, ఆమె చెప్పిన రెండు విషయాలు వింటే….‘ఇందుకా! దీక్ష చాలిస్తోంది’ అనిపిస్తుంది. రాజకీయాల్లోకి దిగి, ఎలక్షన్లలో పోటీ చేస్తానన్నది వీటిలో మొదటిది. పెళ్ళి చేసుకుంటానన్నది రెండోది. ఈ రెండూ ఒకదానిమీద మరోటి ఆధారపడ్డాయని అనుకోవచ్చు. పెళ్ళి చేసుకోవాలనే ఆలోచన రావడమంటే….జీవితంమీద ఆశ కలిగినట్టే. ఆశ అనేది పుట్టిందంటే….దానికి అంతే ఉండదు. ఎలక్షన్లలో పోటీ ఏమిటి? వేరే దేశాలను కూడా ఆక్రమించేయాలన్న కోరిక కూడా వచ్చేస్తుంది.

షర్మిలలో బతకాలనే కోరిక రగిలించినవాడు డిస్మండ్ కోటినో. చాలాకాలంగా షర్మిలకు ఆత్మీయుడు. ఆమెకు మార్గదర్శిగా ఉన్నవాడు ప్రేమికుడు అయిపోయాడు. 53 ఏళ్ళ కోటినో ఇక్కడివాడు కాదు. పుట్టింది మన గోవాలోనే అయినా, మూలాలు బ్రిటన్ లో ఉన్నవాడు. అతనో రచయిత, హక్కులకోసం పోరాడే మనిషి. షర్మిలతో అతని అనుబంధం ఈనాటిది కాదు. పదేళ్ళ కిందటే ఆమెకు పరిచయమయ్యాడు….దోస్తయ్యాడు….మెంటరయ్యాడు. …ప్రియుడయ్యాడు. ఇన్ని అయ్యాక  పెళ్ళి ఒకటే కదా కావల్సింది. అందుకే, పెళ్ళి కూడా త్వరలోనే జరగబోతోంది.

షర్మిల దీక్ష మానేస్తుందని కానీ, పెళ్ళి చేసుకుంటుందని కానీ, మణిపూర్ లో ఎవరూ ఎప్పుడూ ఊహించనైనా లేదు. ఆమెలో మార్పు తెచ్చినవాడు కోటినో. పదేళ్ళుగా షర్మిలను మెల్లమెల్లగా మారుస్తూ వచ్చాడు. జీవితం ఇలా వృథా చేసుకోవడంకంటే,  వేరే పద్ధతులో పోరాడడం మేలని అదేపనిగా చెప్తూ వచ్చాడు. ఎప్పటికైనా మారుతుందనే ఆశతో అలా అలా కౌన్సిలింగ్ ఇస్తూనే ఉన్నాడు.

ఇన్నాళ్ళకు షర్మిలలో మార్పు వచ్చింది. తన డిమాండ్ ఎప్పటికీ నెరవేరదని తెలుసు. అయినా, పట్టుదల వీడకుండా ప్రయత్నం చేసింది. మరో దారి ఆమెకు తోచలేదు. కోటినో చెప్పిన రూట్ లో అయినా విజయం వస్తుందో, లేదో తెలియదు. అయినా అతని మాటలకు కన్విన్స్ అయింది. కోటినో మాటలకే కాదు, అతని మంచితనానికి కూడా ఫిదా అయింది. తన మొండితనాన్ని భరిస్తూ….విసుగు తెచ్చుకోకుండా….మెల్లమెల్లగా తనలో మార్పు తెచ్చిన కోటినోలో ఓ మంచి వ్యక్తిత్వాన్ని చూసింది.  మనసు కూడా ఇచ్చేసింది.

కోటినో హక్కుమనిషి కావడంవల్లనే ఉక్కుమహిళ  మనసు అర్థం చేసుకోగలిగాడు. ఎంతకీ పూర్తికాని దీక్ష చేస్తూ….తన హక్కుల్ని తనే హరించేసుకుంటున్న షర్మిలను చూసి జాలిపడ్డాడు. ఆమధ్య ఒక జర్నలిస్టుతో మాట్లాడుతూ, 30 ఏళ్ళ కిందటే షర్మిల కలిసి ఉంటే బాగుండేదన్నాడు. షర్మిలను ఒంటరి ఖైదీగా ఉంచి తప్పు చేశారన్నాడు. షర్మిల అంటే అంత ఇష్టపడ్డాడన్నమాట.

‘మహాత్మాగాంధీకి భార్య కస్తూరి బా ఎలాగో, షర్మిలకు నేనలా! గాంధీజీకి కస్తూరి బా ఎలా హెల్ప్ చేసిందో, నేను షర్మిలాకు అలా హెల్స్ చేస్తా. ఆమెతో కాపురం అంత ఈజీ కాదని తెలుసు. అయినా సరే, పెళ్ళికే నేను డిసైడయ్యా’ అని 2011లో తన బ్లాగులో రాసుకున్నాడు కోటినో.

షర్మిల కుటుంబ సభ్యులు మాత్రం షాక్ నుంచి ఇప్పటికీ కోలుకోలేదు. కోటినో కారణంగానే షర్మిల దీక్ష మానుకుందని వాళ్ళ ఉద్దేశం. షర్మిలను ఉద్దరించేవాడిలా కాకుండా, ఆమెను తప్పుదారి పట్టించినవాడిలా చూస్తున్నారు కోటినోను.  ‘దీక్ష విరమించేముందు మాతో కానీ, ఉద్యమకారులతో కాపీ షర్మిల మాట్లాడలేదు. కోటినో ఇన్ ఫ్లూయన్స్ ఆమెమీద చాలా ఉంది’ అన్నాడు షర్మిల అన్న ఇరోమ్ సింగాజిత్.

తనకేం కావాలో షర్మిలకు సరిగ్గా తెలియదని కుటుంబసభ్యులు అంటారు. షర్మిల డాక్టర్ కావాలనుకునేదట. చదువు మొదలుపెట్టాక, తనకంత తెలివితేటలు లేవని డాక్టరయ్యే ఉద్దేశమే మార్చుకుంది. ఇంటర్ తో చదువు ఆపేసింది. ‘చదవడం, రాయడం, మాట్లాడడం వచ్చాయి కదా. చాలు అనేది’ అని ఆమె అన్న చెప్తాడు.

దీక్ష చేయాలనే సంకల్పం, పట్టుదలే తప్ప షర్మిల వేరేమీ ఆలోచించలేదని అంటారు. AFSPA చట్టం ఎట్టిపరిస్థితుల్లోనూ రద్దుకాదని షర్మిలకు ఎంతమంది చెప్పినా వినలేదట.

ఏమిటీ AFSPA?

AFSPA చట్టం ఒక్క మణిపూర్ లోనే లేదు. మరికొన్ని రాష్ట్రాల్లోనూ ఉంది. ఈ చట్టం బోర్డర్ స్టేట్స్ లో ఉండాల్సిందేనా? మణిపూర్ లో ఆ చట్టం రద్దు చేయాలని షర్మిల డిమాండ్ చేయడానికి కారణమేంటి?మణిపూర్ లో మరెవరికైనా AFSPA చట్టంమీద అబ్జెక్షన్ ఉందా?

ఒకసారి మణిపూర్ రాష్ట్రం పరిస్థితుల గురించి తెలుసుకుంటే కానీ, AFSPA చట్టం అక్కడ ఎందుకు పెట్టారన్నదానిపై అవగాహన రాదు. నార్త్ ఈస్ట్ లో ఓ చిన్న స్టేట్ అయినా….దేశానికి బోర్డర్ లో ఉండడంతో మణిపూర్ విషయంలో కేంద్రప్రభుత్వం చాలా జాగ్రత్తగా ఉంటుంది. మణిపూర్ కి మియన్మార్ దేశంతో బోర్డర్ ఉంది.

మణిపూర్ రాష్ట్రం చూడ్డానికి చాలా బాగుంటుంది. పచ్చని కొండలమధ్య ఊళ్ళు, ఎక్కడ చూసినా సెలయేళ్ళు, పక్షిగూళ్ళలా ఇళ్ళు….టూరిస్టులకు కనువిందే అక్కడ. మణిపురీ డాన్స్ లాంటి కళలు, మార్షల్ ఆర్ట్స్ మణిపూర్ కు ప్రత్యేకతను తీసుకొచ్చాయి.

ఇంత అందమైన మణిపూర్ లో ప్రశాంతత ఉండదు. జాతులమధ్య పోరాటాలు రాష్ట్రాన్ని రోజూ వణికిస్తూనే ఉంటాయి. మణిపూర్ జనాభా 30 లక్షలలోపే అయినా….చాలా జాతులవాళ్ళు ఉంటారక్కడ. ఈ జాతుల్లో మీటీ, కూకీ, నాగా, పంగాల్ తెగలవాళ్ళు ఎక్కువగా కనిపిస్తారు. మీటీ తెగవాళ్ళ జనాభానే ఎక్కువైనా….అక్కడ నాగా జాతిదే డామినేషన్.

నాగాలకోసం వేరే రాష్ట్రం నాగాలాండ్ ఉన్నా….మణిపూర్ లో కూడా తమదే పైచేయి కావాలని కోరుకుంటారు నాగాలు. అనేక టెర్రరిస్టు సంస్థల ప్రయేయంతో అక్కడ జాతులమధ్య కొట్లాటలు మొదలై ….మిలిటెంట్ పోరాటాలవరకు వచ్చాయి. నాగాలమీద ఎక్కువగా పోరాడేది కూకీలు. ఈ జాతుల పోరాటాన్ని అణిచేయడానికే అక్కడ AFSPA చట్టం అమలుచేసి….మిలిటరీకి లెక్కలేనన్ని అధికారాలు ఇచ్చారు. ఒక మణిపురీ గ్రామం మీద నాగా టెర్రరిస్టుల దాడి సీన్లు చూడండి. ఇలాంటి దాడులు మణిపూర్ లో చాలా మామూలు విషయం.

జాతులమధ్య సాగుతున్న ఈ పోరాటాలకు 65 ఏళ్ళు. ఆ పోరాటాలతో ఆగకుండా దేశంమీదనే తిరగబడే పరిస్థితిలో ఉన్నాయి అక్కడి జాతులు. జనం. మనదేశం నుంచి వేరుపడడంకోసమే కొన్ని టెర్రరిస్టు సంస్థలు పనిచేస్తున్నాయి. 2005 నుంచి 2015 వరకు అంటే పదేళ్ళలో మణిపూర్ లో టెర్రరిస్టు చర్యలు, జాతుల పోరాటాల్లో 5,500 మంది చనిపోయారు. అందుకనే  AFSPA సైనిక చట్టం అక్కడ తప్పనిసరయింది. ఇలాంటి కాల్పుల సంఘటన జరిగినప్పుడు ఆర్మీ ఎంటరై అక్కడ పరిస్థితిని కంట్రోల్ చేస్తుంది. ఆర్మీకి అధికారాలు లేకపోతే, ఈ టెర్రరిస్టు గ్రూపులను అదుపు చేయడం వీలుకాదు. AFSPA చట్టం అక్కడ 1958 నుంచి అమల్లో ఉంది.

మణిపూర్ లోనే కాదు. నార్త్ ఈస్ట్ లోని మిగతా 6 స్టేట్స్ లో, కాశ్మీర్ లోకూడా అమల్లో ఉంది ఈ చట్టం. పంజాబ్ లో కూడా అమలుచేసేవారు కానీ, 14 ఏళ్ళపాటు మాత్రమే ఉంచి ఎత్తేశారు.

అయితే, మణిపూర్ లో ఈ చట్టం అమల్లో ఆర్మీ చాలా కఠినంగా వ్యవహరించిందని అక్కడి ప్రజాసంఘాలు ఆరోపిస్తాయి. దీనికి, 2000లో నవంబర్ 2 నాడు జరిగిన కాల్పుల సంఘటననే రుజువుగా చూపిస్తారు. అప్పటి ఆర్మీ కాల్పుల్లో 10 మంది చనిపోయారు. వీళ్ళలో 18 ఏళ్ళ టీనేజర్, 62 ఏళ్ళ వృద్ధురాలు కూడా ఉన్నారు. వీళ్ళంతా అమాయకులని, బస్ కోసం వెయిట్ చేస్తూ….కాల్పులకు బలయ్యారని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే, ఇందులో ఆర్మీ ప్రమేయం లేకపోవచ్చునని చెప్తారు. ఏదో టెర్రరిస్టు సంస్థ ఈ పని చేసి ఆర్మీ మీదకి నెట్టేసిందంటారు.  టెర్రరిస్టు ఆర్గనైజేషన్ల మారణకాండలు అనేకం ఆర్మీ ఎకౌంట్ లో పడిపోయాయి.

ఈ ప్రచారాన్నే బలంగా నమ్మింది షర్మిల. అదే దీక్షకు దారితీసింది. మణిపూర్ లో పరిస్థితులు షర్మిలకు తెలియనవి కావు. ఆర్మీ లేకపోతే అక్కడ నరమేధం జరుగుతుందని తెలుసు. జాతులమధ్య పోరాటం చివరకు అన్ని జాతుల నాశనానికి దారితీస్తుందని తెలుసు. అయినా, దీక్ష కంటిన్యూ చేసింది. ఆర్మీ ఉన్నా కూడా మరీ కఠినంగా ఉండకుండా చూడాలనే డిమాండ్ తో దీక్ష చేస్తే ఫలితం ఉండేదేమో. అసలు చట్టాన్నే రద్దు చేయాలనే డిమాండ్ పెట్టడంతో ఎవరూ ఆమెకు సాయం చేయలేకపోయారు. 2011 లో ‘సేవ్ షర్మిల సాలిడారిటీ కేంపైన్’ పేరుతో ఒక సంస్థ ప్రారంభమై షర్మిల దీక్ష విషయంలో రాజీ చేయడానికి ప్రయత్నాలు చేసింది కానీ….అవేవీ సక్సెస్ కాలేదు. ఎవరూ సాధించలేనిదాన్ని సాధించాడు కోటినో….అదీ ప్రేమతో.

అన్నీ తినగలుగుతుందా?

ఓకే….షర్మిల దీక్షకు ఎండ్ కార్డ్ పడబోతోంది. మరి, పదహారేళ్ళు పచ్చి మంచినీళ్ళు కూడా తాగని షర్మిల అందరిలాగానే మళ్ళీ అన్నీ తినగలుగుతుందా? ఆమె తరువాత AFSPA సైనిక చట్టంపై మరెవరైనా పోరాడతారా? మణిపూర్ లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి?

ఆత్మహత్యా ప్రయత్నం చేశావన్న అభియోగానికి ఇన్నేళ్ళ సమరంలో ఒక్కసారి కూడా షర్మిల ‘ఔను తప్పు చేశా’ అని ఒప్పుకోలేదు. ఇప్పుడు సడెన్ గా హంగర్ స్ట్రయిక్ ఆపేసి….ఇంతవరకు తను తప్పే చేసినట్టుగా ఒప్పకున్నట్టయిందని మణిపూర్ లో టాక్ నడుస్తోంది. ప్రభుత్వంతో ఎలాంటి ఒప్పందం లేకుండా ఎవరికీ చెప్పకుండా ఎలా దీక్ష ను నిలిపేస్తుందని షర్మిలను నిలదీస్తున్నవాళ్ళు కూడా ఉన్నారు.

అయితే, వీళ్ళెవరికీ ఆమెని నిలదీసే హక్కు లేనే లేదు. ఇన్నేళ్ళ పోరాటంలో ఆమెకు అండగా నిలబడ్డవాళ్ళు అతికొద్దిమందే. ఆమె పేరుతో డబ్బులు దండుకున్నవాళ్ళు ఎంతోమంది. అప్పుడప్పుడు కొన్ని ఆందోళనలు తప్ప….ఆమెకు తోడుగా నిలబడ్డవాళ్ళే లేరు. ఎందుకంటే వాళ్ళకు తెలుసు. ఎవరెన్ని చేసినా AFSPA చట్టాన్ని రద్దుచేయలేరని. ఒకవేళ రద్దు చేస్తే….మణిపూర్ లో అరాచకం రాజ్యమేలుతుందని కూడా వాళ్ళకు తెలుసు.

కోటినో చెప్పినా….మరెవరు చెప్పినా….నిరాహార దీక్ష వదిలిపెట్టేసి షర్మిల మంచిపని చేసినట్టే. ఇప్పటికైనా మామూలు మనిషిలా బతకొచ్చు. కానీ, మామూలు మనిషిలా షర్మిల కూడా అన్నీ తినడం సాధ్యమవుతుందా? ఎందుకంటే, ఆమె శరీరంలో అవయవాలు తిండి లేకుండా బతకడం అలవాటు చేసుకున్నాయి. ఇప్పటికిప్పుడు తింటే….అది జీర్ణమవుతుందా? చూడాలి.

ఆమె ఇంతకాలం ఫ్లూయిడ్స్ మీదనే బతికినా….బాడీ సిస్టమ్ దెబ్బతిని ఉండొచ్చునని, అల్సర్లలాంటివి వచ్చి ఉండొచ్చునని డాక్టర్ల అభిప్రాయం.

సరే, కొన్నాళ్ళకైనా అందరిలా తినగలుగుతుంది కానీ, ముదు ముందు ఏం చేయబోతుందన్నది తెలియడంలేదు. చట్టం రద్దు చేయాలని వేరే రకంగా ఉద్యమం మొదలుపెడుతుందా? లేకపోతే, ఏదో ఒక పార్టీలో చేరుతుందా? అనేది ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ అయితే, ఆమెకు ఎప్పుడో ఆఫర్ ఇచ్చింది. కానీ అప్పుడామె ఒప్పుకోలేదు. పరిప్థితులు మారాయి కనుక….షర్మిలకు ఆప్ మరోసారి ఆఫర్ ఇవ్వడం గ్యారంటీ.

మణిపూర్ లో పాగా వేయాలని ఎప్పటినుంచో ప్రయత్నం చేస్తున్న బీజేపీ కూడా షర్మిలను పార్టీలో చేర్చుకోడానికి ప్రయత్నం చేయొచ్చు. అవసరమైతే సీఎం పోస్టు కూడా ఆఫర్ చేయొచ్చు. ఇప్పటివరకు మణిపూర్ లో బీజేపీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఎప్పుడో 16 ఏళ్ళ కిందట అంటే 2000 లో జరిగిన ఎలక్షన్లలో 6 సీట్లు గెలిచింది. ప్రస్తుత అసెంబ్లీలో ఒక్కసీటు కూడా నెగ్గలేదు. 60 సీట్లున్న మణిపూర్ అసెంబ్లీలో ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఏకంగా 42 సీట్లున్నాయి. కాంగ్రెస్ కూడా షర్మిలకు వల వేయడం ఖాయం.

ఇంత డిమాండ్ ఉంటుందని ఊహించుకునే షర్మిల దీక్షకు బైబై చెప్తోందని కొందరి అంచనా. షర్మిలకున్న పేరు ప్రతిష్టలవల్ల ఎలక్షన్లలో గెలవడం లెక్కేకాదు. సీఎం అవుతుందా లేదా అనేదే చూడాలి. మణిపూర్ అసెంబ్లీకి ఎన్నికలు వచ్చే ఏడాది జరగబోతున్నాయి.

షర్మిల దీక్ష ఆగిపోవచ్చు కానీ, ఫెయిల్ కాలేదన్నది నిజం. ఆమె వల్లనే AFSPA చట్టం గురించి జనంలో అవగాహన వచ్చింది. పోరాట పటిమ వచ్చింది. ఇంతకాలం షర్మిల సాధిస్తుందిలే, మనమేమీ చేయనక్కర్లేదు అనుకున్నవాళ్ళంతా ఇప్పుడు రంగంలో దిగి….చట్టం రద్దు కోసం పోరాడే అవకాశాలున్నాయి. షర్మిల పొలిటికల్ ఎంట్రీ మణిపూర్ లో చాలా మార్పులే తేవచ్చు.

మళ్ళీ మనుషుల్లో పడడం షర్మిలకు అంత తేలికేమీ కాదు. ఏళ్ళ తరబడి ఏకాంతంగా గడపడంతో మళ్ళీ అందరిలో కలవడానికి కొంత టైమ్ పట్టొచ్చు. అలాగే, ఆరోగ్యం కుదుటపడడానికీ టైమ్ పట్టొచ్చు. ఆ తరువాతే పాలిటిక్స్. ఏ పార్టీలో చేరాలో, ఏ ఆఫర్ ను అందుకోవాలో డిసైడ్ చేసుకునేది షర్మిల మాత్రమే కాదు కదా! భర్త కాబోతున్న కోటినో ఏం చెప్తాడో మరి….షర్మిలను ప్రస్తుతం నడిపిస్తున్నది కోటినేనే కదా.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy