
కోరియా జిల్లాలో సాజా పహాడ్ గుట్టపై ఉండే ఓ కుగ్రామం.. ఇప్పటికీ ఆ పల్లెకు విద్యుత్తు సౌకర్యం లేదు.. రహదారీ లేదు. నీటి కోసం పడరాని పాట్లు పడే ప్రజలు. రెండు చిన్న బావుల ద్వారా ఎలాగోలా గొంతులు తడుపుకొంటున్నా.. పశువుల పెంపకానికి, ఇతర అవసరాలకు నీళ్లు కావాలంటే వారికి తలకు మించిన భారమైంది. ప్రభుత్వాలు, అధికారులు పట్టించుకోలేదు. ఆనాడు 15 ఏళ్ల శ్యామ్‌లాల్ మనసు తల్లడిల్లిపోయింది. తోటివాళ్లకు మేలు చేయాలన్న దృఢ సంకల్ఫంతో పక్కనే ఉన్న అటవీప్రాంతంలో ఓ స్థలాన్ని ఎంచుకుని చెరువు తవ్వడం ప్రారంభించాడు. అప్పట్లో అది చూసి గ్రామస్థులు నవ్వుకునేవారు.. నిరుత్సాహంగా మాట్లాడేవారు. అయినా శ్యామ్‌లాల్ ఆగిపోలేదు. అలా రెండున్నర దశాబ్దాలకు పైగా తవ్వుతూ వచ్చాడు. అతని కృషికి అద్భుత ఫలితం లభించింది. ఇప్పుడు అక్కడో చెరువు తయారైంది.. నీటితో కళకళలాడుతోంది.
నాడు నవ్విన వ్యక్తులే నేడు శ్యామ్‌లాల్(42)ను వేనోళ్ల కొనియాడుతున్నారు. ఆదర్శప్రాయుడుగా.. రక్షకుడుగా భావిస్తున్నారు. ‘‘ఆ చెరువును ఇప్పుడు గ్రామస్థులమంతా వాడుకుంటున్నాం. శ్యామ్‌లాల్‌కు రుణపడి ఉంటాం..’’ అని 27 ఏళ్లుగా ఇదంతా గమనిస్తున్న రామ్‌శరణ్ బర్గార్(70) అనే పెద్దాయన తెలిపారు. కాగా శ్యామ్‌లాల్ ఘనతను తెలుసుకున్న ఎమ్మెల్యే (మహేందర్‌గఢ్) శ్యామ్బిహరీ జైశ్వాల్ ఆ గ్రామాన్ని సందర్శించారు. అతన్ని అభినందించి రూ. 10 వేలు బహూకరించారు. ‘‘ఆనాటి నుంచీ చెరువు తవ్వడంలో.. అటు అధికారులు, ఇటు గ్రామస్థులు గానీ నాకెవ్వరూ సహాయం చేయలేదు. నేను సాయానికి ఎదురుచూడనూ లేదు. గ్రామస్థుల సంక్షేమం.. మూగజీవాలకు తాగునీరు.. ఇదే సంకల్పంతో చెరువు తవ్వాను. ఇప్పుడు నాకు గర్వంగా ఉంది.’’ అన్నారు శ్యామ్‌లాల్.