ఒక్క సినిమా.. వంద గొడవలు : ఏంటీ పద్మావతి చరిత్ర.. ఎందుకీ వివాదం

padmavathiబాలీవుడ్ సినిమా పద్మావతి వివాదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. డిసెంబర్ 1న సినిమాను విడుదల చేస్తామంటూ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ ప్రకటించారు. సినిమా ‘సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌’ (CBFC)కు వెళ్లింది. అయితే సెన్సార్ నుంచి క్లియరెన్స్ రాకుండా వెనక్కి వచ్చింది పద్మావతి సినిమా.

పద్మావతి సినిమా షూటింగ్ ప్రారంభం నుంచి వివాదం కొనసాగుతూనే ఉంది. చరిత్రను వక్రీకరిస్తూ తమ ఆత్మగౌరవానికి భంగం కలిగించేలా ఈ సినిమాను తీస్తున్నారంటూ రాజస్థాన్‌తో పాటు వివిధ రాష్ర్టాలకు చెందిన క్షత్రియ, రాజ్‌పుత్ సంఘాలు ఆందోళన బాట పట్టాయి. డిసెంబర్ 1న విడుదల కానున్న ఈ చిత్రాన్ని అడ్డుకుని తీరుతామని శపథాలు చేస్తున్నారు. ఈ వివాదానికి రాజకీయ జోక్యం తోడవడంతో భవిష్యత్తు పరిణామాలు ఎలా ఉంటాయోనని ట్రేడ్ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. అంతేకాదు ఇందులో పద్మావతిగా యాక్ట్ చేస్తున్న నటి దీపిక పదుకునే కు బెదిరింపులు వస్తున్నాయి. ముక్కు కోస్తామని.. ఆమెను చంపితే రూ.5కోట్లు ఇస్తామంటూ హెచ్చరిస్తున్నారు.

పద్మావతి చరిత్ర ఏంటీ ?

రాణి పద్మిని దక్షిణ మధ్య రాజస్థాన్ చిత్తోర్‌ఘడ్‌కు చెందిన రాజ్‌పుత్ మహారాణి. ఆమె భర్త రావల్త్రన్‌సింగ్. 1303లో అప్పటి ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ చిత్తోర్‌ఘడ్ కోటపై దండెత్తుతాడు. రాణి పద్మావతి అద్భుత సౌందర్యం గురించి తెలుసుకుని పరవశుడై అల్లావుద్దీన్ ఖిల్జీ చిత్తోర్‌ఘడ్ కోటపై దండయాత్ర చేశారని పద్మావత్ పద్యంలో తెలిపారు. అల్లావుద్దీన్ ఖిల్జీ దండయాత్రను తిప్పికొట్టడానికి తుది వరకు పోరాడిన రాణి పద్మావతి బలమైన ఢిల్లీసుల్తాన్ సేనలను ఎదిరించలేక అస్త్రసన్యాసం చేస్తుంది. అల్లావుద్దీన్ ఖిల్జీకి చిక్కకుండా తన సహచర మహిళలందరితో కలిసి ఆత్మార్పణ చేసుకుందనేది పద్మావత్ పద్య సారాంశం.

రాణి పద్మిని నిజ వృత్తాంతంపై చరిత్రలో భిన్న కథనాలు కూడా ఉన్నాయి. ఆమె సింఘాల్ (ఇప్పటి శ్రీలంక) రాజ్యానికి చెందిన వనిత అని, అపురూప సౌందర్యవతి అని చరిత్ర చెబుతోంది. ఓ పావురం ద్వారా పద్మావతి అందచందాలను తెలుసుకున్న చిత్తోర్‌ఘడ్ మహారాజు రావల్త్రన్‌సింగ్.. సింఘాల్ దేశానికి వెళ్లి ఆమెను స్వయంవరంలో గెలుచుకున్నాడనేది మరో చారిత్రక కథనం.

రాణి పద్మావతి, అల్లావుద్దీన్ ఖిల్జీకి సంబంధం గురించిన ప్రామాణికమైన సమాచారమేదీ చరిత్రలో లేదు. అల్లావుద్దీన్ ఖిల్జీ చిత్తోర్‌ఘడ్ కోటను 1303లో ఆక్రమించుకున్నట్లుగా చరిత్ర చెబుతున్నది. అయితే సూఫీ కవి మాలిక్ మహ్మద్ పద్యంలో 14వ శతాబ్దంలో చిత్తోర్‌ఘడ్‌పై దండయాత్ర జరిగినట్లుగా తెలుస్తోంది. దీంతో మాలిక్ మహ్మద్ కేవలం ఊహాజనితంగా పద్మావతి అందచందాలను అభివర్ణిస్తూ పద్యాన్ని లిఖించాడని, ఆయన వర్ణనలకు చారిత్రక ఆధారాలు లేవని చెబుతారు. మరికొందరు చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం తన సామ్రాజ్య విస్తరణలో భాగంగానే అల్లావుద్దీన్ ఖిల్జీ చిత్తోర్‌ఘడ్ కోటపై దండయాత్ర చేశారని, రాణిపద్మావతిపై వ్యామోహంతో కాదని అంటారు. అసలు రాణి పద్మావతి చరిత్రకు సంబంధించిన ప్రామాణికమైన సమాచారమేది లేదని, ఇప్పటివరకు కల్పితగాథలే ప్రచారంలో ఉన్నాయని నవీన చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. అయితే రాజపుత్రులు మాత్రం ధైర్యసాహసాలకు, స్వాభిమానానికి ప్రతీకగా రాణిపద్మావతిని అభివర్ణిస్తారు.

వివాదం ఇక్కడే మొదలు :

ఈ సినిమాలో చరిత్రను వక్రీకరించి రాణి పద్మావతి-అల్లావుద్దీన్‌ఖిల్జీ మధ్య ప్రణయ సన్నివేశాల్ని సృష్టించారని రాజ్‌పుత్ సంఘాల ప్రధాన ఆరోపణ. ఈ ఏడాది జనవరిలో రాజస్థాన్‌లోని జైపూర్‌లో జైఘడ్ కోటలో పద్మావతి షూటింగ్ ను రాజ్‌పుత్ కమ్యూనిటీకి చెందిన కర్నీసేన సభ్యులు అడ్డుకున్నారు. సినిమా సెట్టింగ్ లు ధ్వంసం చేశారు. దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీపై భౌతికంగా దాడిచేశారు. దీంతో ఈ సినిమా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

2016 జూలైలో పద్మావతి షూటింగ్ ప్రారంభం అయ్యింది. 200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోంది. సంజయ్ లీలాబన్సాలీ నిర్మిస్తున్నారు. పద్మావతిగా టైటిల్ రోల్‌ను దీపికా పదుకునే నటిస్తుంటే.. ఢిల్లీసుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్రలో రణవీర్‌సింగ్, పద్మావతి భర్త రావల్త్రన్‌ సింగ్‌గా షాహిద్‌కపూర్ నటిస్తున్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy