ఒక చక్రవర్తి గుడ్ బై..!

3331జపాన్ చక్రవర్తి అఖిహితో ఇవాళ ఓ బాంబు పేల్చారు……సింహాసనం దిగిపోతానని అంటున్నారు. కానీ….ఎందుకు ? ఎలా?  పదవి వదిలేస్తానని చక్రవర్తి అనడానికే వీల్లేదు. జపాన్ దీనికి ఒప్పుకుంటుందో లేదో ? అసలు, చక్రవర్తి ఎందుకు దిగిపోతానంటున్నారు?

జపాన్ చక్రవర్తి అకిహితోకు 83 ఏళ్ళు. ఆరోగ్యం కూడా బాగుండడంలేదు. ముసలితనం, అనారోగ్యం కారణంగా తన బాధ్యతలను సరిగా నెరవేర్చలేకపోతున్నానని డిసైడయ్యారు. సోమవారం దేశప్రజలకు ఈ విషయమే చెప్పారు. టీవీ చానెల్ ద్వారా జనానికి తన మనసులోని మాట బయటపెట్టారు. ‘నా ఆరోగ్యం రోజురోజుకీ దిగజారుతోంది. దేశాధినేతగా నా బాధ్యతలు సరిగా నెరవేర్చలేకపోతున్నానేమో అనే సందేహం కలుగుతోంది.’ అని ఈ స్పీచ్ లో చెప్పారు. అంటే సింహాసనం వదిలేయడానికి పర్మిషన్ ఇవ్వాలని ఇన్ డైరెక్టుగా జపాన్ ప్రజలను, ప్రజాప్రతినిధులను అడిగినట్టే లెక్క.

భోగభాగ్యాల్ని,  వైభోగాన్ని వదిలేసుకోడానికి చక్రవర్తి రెడీ అయ్యారంటే….మామూలు విషయం కాదుకదా!

అఖిహితో దిగాలనుకుంటున్నా జపాన్ రాజ్యంగం ఒప్పకోదు. అలా, ఎప్పుడుపడితే అప్పుడు సింహాసనం వదిలేయడానికి వీల్లేదు. దీనికి జపాన్ పార్లమెంట్ ‘డయట్’ఒప్పుకోవాలి. రాజ్యాంగాన్ని సవరిస్తేనే ఇది సాధ్యం. అయితే, చక్రవర్తి అకిహితో ఉద్దేశాన్ని అర్థం చేసుకున్నామని, సీరియస్ గా పరిశీలిస్తామని జపాన్ ప్రధానమంత్రి షింజో అబే చెప్పారు.

జపాన్ చక్రవర్తి టీవీలో స్పీచ్ ఇవ్వడం ఇది రెండోసారి మాత్రమే. దీనితో జపాన్ లోని అన్ని సిటీల్లో పెద్ద పెద్ద స్క్రీన్ ల మీద ఈ స్పీచ్ చూపించారు. వీధుల్లో జనం ఆగి మరీ దాన్ని చూశారు. జపాన్ కి అకిహితో 125 వ చక్రవర్తి. 14 శతాబ్దాలుగా ఇదే వంశం జపాన్ ని ఏలుతోంది. నిజానికి చక్రవర్తికి పనులేమీ ఉండవు. ప్రధానిని నియమిస్తూ ఒక ప్రకటన చేయడం, పెద్ద దేశాల చీఫ్ లు వచ్చినప్పుడు డిన్నర్ ఇవ్వడం….ఇలాంటివి ఉంటాయంతే. ఇవి కూడా చేయలేకపోతున్నానంటారు అకిహితో.

ఒకవేళ పార్లమెంట్ ‘డయట్’ ఒప్పుకుని అకిహితో దిగిపోతే….ఆయన పెద్దకొడుకు నరుహితో చక్రవర్తి అవుతారు.

జపాన్ లో అంతా మోడర్న్ గానే ఉంటాయి. బులెట్ ట్రయిన్లు, ఫాస్ట్ కార్లు….అన్నీ మోడర్నే. కానీ రాచరిక వ్యవస్థ మాత్రం పాతది. ఈ వ్యవస్థను, చక్రవర్తిని జపాన్ ప్రజలు ఎంతగానో ఇష్టపడతారు. అందుకే, ఎలాంటి మార్పులకు అంత తేలిగ్గా ఒప్పుకోరు. అకిహితో గుడ్ బై చెప్తాననడం కూడా అలాంటిదే.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy