కన్నడ తీర్పు: ఎన్నికల్లో వికసించిన కమలం

bjpకర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కమలం వికసించింది. కర్ణాటక చరిత్రలో రెండో అతిపెద్ద విజయాన్ని ఆ పార్టీ సాధించింది. బీజేపీ 104 , కాంగ్రెస్ 78 , జేడీఎస్ కూటమి 37 స్థానాలను దక్కించుకున్నాయి. హంగ్ పరిస్థితులు ఏర్పడటంతో.. గవర్నర్ నిర్ణయంపై ఆసక్తి ఏర్పడింది.

ఎగ్జిట్ పోల్స్ అంచనాలను కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిజం చేశాయి. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీని ఏ పార్టీ సాధించలేకపోయింది. కర్ణాటక అసెంబ్లీలో 224 స్థానాలుంటే.. 222 సీట్లకు ఎన్నికలు జరిగాయి. కౌటింగ్ మొదటినుంచే ఫలితాలు పార్టీల మధ్య దోబూచులాడాయి. మధ్యలో బీజేపీ ఆధిపత్యం చూపించినా చివరకు 104 సీట్లతో సరిపెట్టకుంది. 78 నియోజకవర్గాలను కాంగ్రెస్ గెల్చుకుంది. 37 స్థానాల్లో జనతాదళ్ సెక్యులర్, దాని మిత్ర పక్షం బీఎస్పీ ఒక స్థానంలో గెలిచాయి. కర్ణాటక ప్రజ్ఞావంత జనతా పార్టీ, ఇండిపెండెంట్ అభ్యర్థి ఒక్కో స్థానంలో గెలుపొందారు.

2013 అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే… కాంగ్రెస్ 44 సీట్లను కోల్పోయింది. అప్పుడు కేవలం నలభై సీట్లనే దక్కించుకున్న బీజేపీ.. ఈసారి మరో 64 స్థానాల్లో కాషాయ జెండా ఎగరేసింది. జేడీఎస్ రెండు సీట్లను కోల్పోయింది. గెలిచిన సీట్లు తక్కువైనా… బీజేపీ కంటే కాంగ్రెస్ పార్టీయే ఎక్కువ ఓట్లను సంపాదించింది. మొత్తం ఓట్లలో కాంగ్రెస్ ఓట్ షేర్ 38 శాతం కాగా…. బీజేపీ ఓట్ షేర్ 36.2 శాతం మాత్రమే. జేడీఎస్ కూటమికి 18.4 శాతం ఓట్లు పడ్డాయి. కాంగ్రెస్ ఓడిపోయిన ఎక్కువ సీట్లలో ఓట్లలో తేడా ఐదు వేల లోపే ఉంది.

రెండు స్థానాల్లో పోటీ చేసిన సీఎం సిద్ధరామయ్య చాముండేశ్వరి నియోజకవర్గంలో జేడీఎస్ అభ్యర్తి జీటీ దేవెగౌడ చేతిలో ఓడిపోయారు. బాదామిలో శ్రీరాములుపై విజయం సాధించారు. షికారిపుర స్థానం నుంచి బీజేపీ సీఎం అభ్యర్తి యెడ్యూరప్ప గెలుపు బావుటా ఎగరేశారు. రామనగర నియోజకవర్గంలో జేడీఎస్ నేత కుమారస్వామి గెలిచారు. హైలె నరస పూర్ నుంచి హెచ్ డీ రేవణ్ణ విక్టరీ కొట్టారు. హుబ్లీ-ధార్వాడ్ సెంట్రల్ నుంచి.. మాజీ సీఎం, బీజేపీ అభ్యర్థి జగదీశ్ షెట్టార్ గెలుపొందారు. బళ్లారిలో గోలి సోమశేఖర్ రెడ్డి గెలిచారు.  బాదామిలో ఓడిపోయిన శ్రీరాములు మొళకాల్మూరు నుంచి గెలిచారు. బాగేపల్లిలో సినీనటుడు సాయికుమార్ మూడోసారి ఓడిపోయారు. సొరబలో బీజేపీ అభ్యర్థి కుమార్ బంగారప్ప… కాంగ్రెస్ అభ్యర్థి, సోదరుడు మధు బంగారప్పపై జయకేతనం ఎగరేశారు. తుమ్కూరు జిల్లా కొరటగెరెలో పీసీసీ చీఫ్ పరమేశ్వర గెలిచారు. కర్ణాటకలో అభివృద్ది అజెండాను మెచ్చి.. బీజేపీకి మెజారిటీ కట్టబెట్టిన ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. కష్టపడిన బీజేపీ కార్యకర్తలకు, మద్దతుదారులకు సెల్యూట్ చేస్తున్నానని ట్వీట్ చేశారు.

రాజేశ్వరి నగర్ లో ఓటర్ ఐడీ కార్డుల వివాదం వల్ల పోలింగ్ జరగలేదు. బీజేపీ ఎమ్మెల్యే బీఎన్ విజయ్ కుమార్ మృతి వల్ల… జయనగర్ ఎన్నిక వాయిదా పడింది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy