కరేంగే యా మరేంగే.. క్విట్ ఇండియా@75

CpYiIsdVUAAhJpvస్వాతంత్రోద్యమంలో కీలక దశ.. క్విట్ ఇండియా ఉద్యమం. పరాయి బతుకుల నుంచి బయటపడటానికి ఇక చావో రేవో తేల్చుకోండి అంటూ  మహాత్ముడి ఇచ్చిన పిలుపుతో మొదలైన ఉద్యమమిది. స్వేచ్ఛావాయువులు కావాలంటే ఇక మనం దేహీ అంటూ మోకరిల్లాల్సిన అవసరం లేదంటూ.. మహోద్యమానికి శ్రీకారం చుట్టారు మహాత్ముడు. అలా మొదలైన ఉద్యమం బ్రిటీష్ బానిస సంకెళ్లను పూర్తిగా తెంచివేసి.. స్వాతంత్ర్య భానూదయాన్ని మనముంగిటకు తెచ్చింది.

మహాత్మాగాంధీ పిలుపుతో లక్షలాది మంది ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. ముంబైలో గాంధీజీ దీన్ని మొదలు పెట్టారు. 1942 ఆగస్టు 9న మొదలైంది. అంతకు ముందు రోజే ఆగస్ట్ 8న దీనిపై కాంగ్రెస్ తీర్మానం చేసింది. ముంబైలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ సమావేశంలో మహాత్మా గాంధీ చరిత్రాత్మక ‘క్విట్‌ ఇండియా’ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఆ రోజు బొంబాయిలోని గొవాలియా ట్యాంక్‌ మైదానంలో జరిగిన భారీ బహిరంగ సభలో బ్రిటీష్ వాళ్లు భారత్‌ విడిచిపోవాల్సిందేనంటూ మహాత్మా గాంధీ ‘క్విట్‌ ఇండియా’ ఉద్యమానికి పిలుపిచ్చారు. కరేంగే యా మరేంగే అంటూ ఆయన చేసిన ప్రసంగం ఎందరిలోనో నూతన స్ఫూర్తిని నింపింది. ఆయన ఇలా పిలుపునిచ్చారో లేదో బ్రిటీష్ సర్కార్ గుండెల్లో రైలు పరుగెట్టాయి. వెంటనే రంగంలోకి దిగింది. ఈ వార్త దేశమంతా పాకకు ముందే.. అరెస్టుల పర్వానికి తెరతీసింది. ఆగస్ట్ 9న గాంధీజీని అరెస్ట్ చేశారు. ‘భారత్‌ ఛోడో’ అంటూ బ్రిటీషు పాలకులపై విరుచుకుపడ్డారు. స్వతంత్ర సాధన కోసం అహింస వీడొద్దని వేడుకుంటూనే, ప్రాణాలొడ్డాల్సిన తరుణం వచ్చేసింది, ‘డూ ఆర్‌ డై’ అంటూ ప్రజలను ఉరకలెత్తించారు. ఈ గడ్డను వీడి పోకపోతే భారీ నిరసలనే ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించారు. నెహ్రూ, అబుల్‌ కలాం అజాద్‌, వల్లభాయ్‌ పటేల్‌ నేతలందరినీ నిర్బంధించింది. దీంతో పెద్ద ఎత్తున జనం ముందుకు వచ్చారు. వందేమాతరం.. జైహింద్.. భారత్ మాతాకీ జై అంటూ లక్షలాది మంది రోడ్లపైకి వచ్చేశారు. ఉక్కుపాదంతో ఉద్యమాన్ని అణచేయాలని చూసింది బ్రిటీష్ ప్రభుత్వం. సుమారు లక్షమందిని అరెస్ట్ చేసి జైళ్లలో పెట్టింది. జరిమానాలతో.. తీవ్రమైన శిక్షలతో నానారకాలుగా ఉద్యమకారులను భయపెట్టాలని చూసినా.. ఒక్కడుగు .. ఒక్కడుగు కూడా వెనక్కు వెయ్యలేదు. స్వాతంత్ర్యము కోరువారు .. వెరవరు వెరవరు.. అంటూ ముందుకు సాగారు. జైల్లోనే మహాత్ముని సతీమణి కస్తుర్బా గాంధీ మరణించారు. రెండేళ్లకు 1944లో అనారోగ్య కారణాలతో గాంధీజీని జైలు నుంచి విడుదల చేసిన ఆయన మరింత ఉత్సాహంతో ఉద్యమం చేశారు.

తెలుగు పల్లెలు కూడా భాగస్వామ్యం అయ్యాయి. తెలుగునాట హైదరాబాద్ సంస్థానంతో పాటు.. అటు మద్రాసు ప్రెసిడెన్సీలో భాగంగా ఉన్న ఆంధ్రరాష్ట్రమూ జోరుగా స్వాతంత్రోద్యమంలో పాల్గొంటున్నాయి. ఆ ఉద్ధృత పోరులో ఎందరో అమరులయ్యారు. గాంధీజీ స్ఫూర్తితో ప్రజలు చైతన్యవంతంగా ఉండేవారు. ఆంధ్రమహాసభ కూడా కాంగ్రెస్ కు మద్దతుగా ఉండేది. క్విట్ ఇండియా ఉద్యమంలో ఆంధ్రసభ కీలకంగా వ్యవహరించింది. దీంతో 1943లో క్విట్ ఇండియా ఉద్యమం ఊపందుకున్న సమయంలో  బ్రిటీషు ప్రభుత్వం ఈ సంస్థను నిషేధించింది. ఇలా దేశవ్యాప్తంగా ముక్త కంఠంతో బ్రిటీష్ ప్రభుత్వాన్ని ఎదిరించింది భారతజనం. ఈ ఉద్యమంతో బ్రిటీష్ ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. 200 ఏళ్ల పాలనకు చరమగీతం పాడిన ఉద్యమంగా దీన్ని చెప్పుకుంటారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy