కళ్లెదుటే అమ్మ, నాన్న మరణం : ఈ చిన్నారి బాధ ఎవ్వరికీ రావద్దు

babyచెప్పటానికి నోట మాట రాదు..విన్పించదు..తన కాళ్లపై తాను నడవలేదు. అలాంటి నాలుగేళ్ల చిన్నారికి ఎవరికీ రాని కష్టం వచ్చింది. తన కళ్లముందే తల్లిదండ్రులు చనిపోవడంతో తన బాధ ను చెప్పలేక తల్లడిల్లిపోయింది ఆ చిన్నారి. ఈ విషాద ఘటన తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం గుబ్బులవారి పాలెంలో చోటుచేసుకుంది. దివ్యాంగురాలైన నాలుగేళ్ల చిన్నారికి వైద్యం చేయించే స్తోమత లేక మనస్తాపంతో తల్లి భవాని కాల్వలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆమెను రక్షించే ప్రయత్నింలో దూకిన భర్త శ్రీనివాస్‌ సైతం ప్రాణాలు కోల్పోవడం ఆ చిన్నారి జీవితంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. వీరిద్దరి మృతదేహాలను సోమవారం (ఆగస్టు14) ఉదయం గ్రామస్థులు బయటకు తీశారు. చిన్నారి పుట్టుకతోనే మూగ, చెవిటి, నడవలేని పరిస్థితి. ఎంతో చక్కగా ఉన్న తమ పాపను చూసి ప్రతిసారీ ఆ తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనకు గురయ్యేవారు. ఆదివారం (ఆగస్టు13) రాత్రి ఈ ముగ్గురూ కలిసి బైక్ పై అమలాపురం బయలుదేరారు. అకస్మాత్తుగా.. డేగలవారిపాలెం దగ్గర బండి నుంచి దిగిన భవాని కాల్వలోకి దూకింది. కనురెప్ప పాటు వ్యవధిలోనే బిడ్డను అక్కడే వదిలేసి భర్త శ్రీనివాస్‌ కూడా ఆమెను రక్షించే ప్రయత్నంలో కేకలు వేసుకుంటూ కాల్వలోకి దూకేశాడు. కాల్వలో వూపిరాడక ఇద్దరూ చనిపోయారు. దివ్యాంగురాలైన ఈ పాపను చూసి కుటుంబ సభ్యులు తల్లడిల్లి పోతున్నారు. తన తల్లిదండ్రులు ఇక తిరిగిరారని తెలుసుకున్న ఆ చిన్నారి కన్నీరు మున్నీరవుతోంది. గుండెపగిలేలా ఏడుస్తూ.. తన బాధ ను ఎలా వ్యక్తం చేయాలో తెలియక తలను నేలకు బాదుకుంటూ ఆవేదనను తెలుపుతోంది. ఆ చిన్నారిని చూసిన వారు కన్నీటి పర్యంతమవుతున్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy