కవిరాజు వాజ్ పేయి

వాజ్ పేయి దేశంలోనే సీనియర్ రాజకీయ నేత. అంతకుమించిన సాహితీవేత్త. ఆయన కవిత్వం గంగా ప్రవాహం. ఉన్నత శిఖరాలపై ఉండి కూడా నేల అంచులకు కాళ్లు ఆనుకొనే ఉండాలంటారు. అందుకే ఆయన మితవాదులు, అతివాదులందరికీ నచ్చిన నేత అయ్యారు. మానవ సంబంధాలకు విలువనివ్వాలని చెప్పే వాజ్ పేయి తన సాహిత్యంలోనూ వాటికే ప్రాధాన్యం ఇచ్చారు. ప్రధానమంత్రిగా ఉండి సాహితీవేత్తలుగా పేరుతెచ్చుకున్నవారు పీవీనరసింహారావు, వాజ్ పేయి.
హే ప్రభూ, నాకు ఇంత ఎత్తును ఎప్పుడూ ఇవ్వకు / ఇతరులను గుండెకు హత్తుకోలేనంతగా / అంత కఠినమైన గుండెను / ఎప్పుడూ నాకివ్వకు -వాజ్ పేయి (1992 ఏప్రిల్ 24న వాజ్ పేయికి పద్మవిభూషణ్ పురస్కారం వచ్చినప్పుడు టీవీ ఇంటర్వ్యూలో చదివిన కవిత ఇది.)

మనుషుల స్థాయి పెరిగేకొద్ది తనవారికి, పరివారానికి దూరం అవుతారు. జీవితంలో ఇంకా ఎత్తుకు ఎదగాలని కోరుకుంటారు. కానీ కాళ్లకింది నేలను తాకడం లేదనే విషయాన్ని మర్చిపోతారు. అందుకే ఇతరులను గుండెలకు హత్తుకోలేనంత ఎత్తు తనకు వద్దనే భావాన్ని చెప్పారు వాజ్ పేయి. వాజ్ పేయి మాట్లాడినా, రాసినా కవిత్వం పరవళ్లు తొక్కుతుంది. రాజకీయ చతురత, ఓర్పు, నేర్పు, ఒడుపు అన్నింటినీ అక్షరాల్లోకి నింపి తన జీవితానుభవంలో ముంచి మనకు అందించారు.
వాజ్ పేయి కవిత్వంలో ఎక్కువగా మనుషులు, వ్యక్తిత్వాలు, కబీర్ తత్వాలు పరుచుకుని ఉంటాయి. నాలుగు వాక్యాలు చదివగానే ఇదేదో మన జీవితం లాగే ఉందే అనిపిస్తుంది. దేశం స్థితిగతులు, రాజకీయాలపైనా వాజ్ పేయి కవిత్వం రాశారు. ఎత్తయిన పర్వతాలపై / చెట్లు ఎదగవు / గడ్డిపరక కూడా పరుచుకోదు / గాలిగోపురంలా ఒంటరిగా / తనవాళ్లకు దూరంగా / శూన్యంలో ఏకాకిగా మిగిలిపోవడం / పర్వతాల గొప్పదనం కాదు / అది కేవలం నిస్సహాయత.

ఈ తరానికి సరిగ్గా సరిపోయే కవిత్వం ఇది. వాజ్ పేయికి హిందీ, ఇంగ్లీషులో మంచి పాండిత్యం ఉంది. తాను నమ్మిన ధర్మంలోనూ మంచిచెడులపై సూటిగా, ఘాటుగా కవిత్వం రాశారు. ఎవరిది తప్పు / ఎవరిది ఒప్పు / ఎవరు పాండవులు / ఎవరు కౌరవులు / ఇరువైపులా శకుని మాయాజాలం ఉంది / ధర్మరాజు కూడా జూదమోహాన్ని వదులుకోలేదు. మహాభారతాన్ని ఇప్పటి సమాజానికి అన్వయించి చెప్పిన కవిత్వం ఇది. ఇప్పుడు కృష్ణుడు లేని మహాభారతం కావాలి / ధర్మనీతి లేని రాజ్యంలో రాజు ఎవడైతేనేం / కన్నీళ్లు పెట్టాల్సింది నిరుపేద నిర్భాగ్యులే. భారతభాగవతాలు మన జీవితాల్లో భాగం. వాటిని ఇప్పటి పరిస్థితులకు అన్వయించి కవితం రాశారు వాజ్ పేయి. జీవితం గురించి గురించి ఇలా రాశారు. శాంతిలేని సంతోషం / వంధ్యత్వంతో సమానం / స్వప్నాలతో స్నేహం / శృతి తప్పిన సంగీతం. మానవ సంబంధాలు, రాజకీయాలపై ఒక నాయకుడిగా, కవిగా ఆయన రాసిన భావాలు అద్భుతం అనిపిస్తాయి. లాభనష్టాల ఒడిదుడుకులలో / జీవనసరళి వ్యాపారమైంది / అమ్ముడుపోయేవాని ధర నిర్ణీతమైంది / అమ్ముడుపోనివాడు / పనికిరాని వాడయ్యాడు.

కాలం కంటే ముందుగానే మనిషి చాలా వేగంగా మారిపోతున్న తీరును, బంధాలు మారుతున్న తీరును, అవి రాజకీయాలు అయినా, మానవ సంబంధాలు అయినా ఎలా ఉన్నాయో చెప్పారు వాజ్ పేయి. వాజ్ పేయి రాజకీయ నాయకుడు కాకపోయి ఉంటే విశ్వకవి రవీంద్రుడిలాగ సాహిత్యరంగంలో ఎదిగేవారని అంటారు సాహితీవేత్తలు. వాజ్ పేయి రాజనీతివేత్త మాత్రమే కాదు అంతకుమించిన సామాజిక పరిశీలకుడు. మనసు ఓడిపోతే / మైదానాన్ని గెలవలేడు / మైదానాన్ని గెలిచినంత మాత్రాన / మనసు గెలుచుకోలేడు. ఇది వాజ్ పేయి కవిత్వ తీవ్రత. ఇది ఈ తరానికి ఆయన ఇచ్చిన సందేశం.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy