కశ్మీర్ లో టెర్రర్ అరాచకం.. ముగ్గురు పోలీసుల కిడ్నాప్, కాల్చివేత

జమ్ము : జమ్ము కశ్మీర్ ఉగ్రవాదులు పేట్రేగిపోతున్నారు. సౌత్ కశ్మీర్ లోని జమ్ము జిల్లా షోపియాన్ లో ముగ్గురు పోలీసులను టెర్రరిస్టులు ఈ ఉదయం(సెప్టెంబర్ 21) కాల్చి చంపేశారు. ఈ ఉదయం కాప్రాన్ గ్రామంలోని నలుగురు పోలీసుల ఇళ్లలోకి చొరబడిన టెర్రరిస్టులు…. వారిని ఆయుధాలతో బెదిరించి.. ఇళ్లనుంచి బయటకు ఈడ్చుకెళ్లిపోయారు. వారిని వెతుక్కుంటూ వెళ్లిన గ్రామస్తులు.. బుల్లెట్లు దిగిన ముగ్గురు పోలీసుల మృతదేహాలను గుర్తించారు. మరో పోలీసును గ్రామస్తులు అంతకుముందే.. విడిపించడంతో అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. ముగ్గురు పోలీసుల కాల్చివేత సంఘటన స్థానికంగా అలజడి రేపుతోంది.

ఇటీవల కాలంలో.. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. సరిహద్దు వెంట గస్తీ కాస్తున్న ఓ హెడ్ కానిస్టేబుల్ బుధవారం మిస్సింగ్ అయ్యాడు. గురువారం అతడి బాడీ దొరికింది. అతడి తలలో బుల్లెట్ల వర్షం కురిపించారు టెర్రరిస్టులు. మరో చోట ఓ జవాన్ ను గొంతు కోసి చంపేశారు. శుక్రవారం ఇలా ముగ్గురు పోలీసులను కిరాతకంగా చంపేశారు ఉగ్రవాదులు.

హిజ్బుల్ ముజాహిదీన్ ఇటీవలే కశ్మీర్ పోలీసులను ఓ వీడియోలో హెచ్చరించింది. “మీ ఉద్యోగాలకు రాజీనామా అయినా చేయండి.. లేకపోతే చనిపోవడానికి సిద్ధంగా ఉండండి” అని ఆ వీడియోలో వార్నింగ్ ఇచ్చింది. ఈ వీడియో రిలీజైనప్పటినుంచి.. పలు గ్రామాల్లో పోలీస్ కుటుంబాల్లో భయం పెరిగిపోయింది. సెక్యూరిటీ పెంచేందుకు కేంద్ర హోంశాఖ సిద్ధమవుతున్న సమయంలోనే ముగ్గురు పోలీసుల కుటుంబాల్లో విషాదం నింపారు ఉగ్రవాదులు.

ఈ సంఘటనపై మాజీ సీఎం, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ ఘాటుగా స్పందించారు. కేంద్రం తన స్ట్రాటజీ అమలులో ఘోరంగా ఫెయిలైందన్నారు. మూడు పోలీసు కుటుంబాలు విషాదంలో మునిగాయన్నారు. చర్చలు మాత్రమే ఈ సమస్యను పరిష్కరించగలవని మెహబూబా చెప్పారు.

టెర్రరిస్టులు ఏమీ చేయలేకపోతున్నామన్న ఒత్తిడిలో ఉన్నారని.. అందుకే ఘాతుకాలకు తెగబడి అలజడి రేపేందుకు ప్రయత్నిస్తున్నారని కేంద్ర హోంశాఖ ప్రతినిధి ఒకరు చెప్పారు. ఈ మధ్య రాజకీయ నిరసనలు, రాళ్లదాడులు తగ్గాయన్నారు. అందుకే పోలీసు కుటుంబాల ఇళ్లపై దాడులు చేస్తున్నారని.. తగిన రీతిలో హోంశాఖ రిప్లై ఇస్తుందని ఆయన చెప్పారు.

అక్టోబర్, నవంబర్ నెలలలో లోకల్ బాడీ ఎన్నికలకు సిద్ధమవుతున్న కశ్మీర్ లో అశాంతి సృష్టించాలన్నదే ఉగ్రవాదుల లక్ష్యంగా కనబడుతోంది. ఈ ఎన్నికలకు పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు దూరంగా ఉండాలని నిర్ణయించాయి. ఇప్పుడు అభ్యర్థులకు సెక్యూరిటీ పెద్ద ప్రశ్నగా మారింది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy