కష్ణా జలాల నీటి లెక్క తేలింది

Juralaకృష్ణానది నీటి పంపకాలపై క్లారిటీ వచ్చింది. ఇప్పటివరకూ ఏ రాష్ట్రం ఎంత వినియోగించుకుందీ, ఇంకా ఎంత నీరు లభ్యత ఉంది.,అనే విషయంలో రివర్ బోర్డు మీటింగ్ లో కొంతవరకూ లెక్కతేలింది. ప్రస్తుతం కృష్ణా ప్రాజెక్టుల్లో ఉన్న 30 టీఎంసీల్లో.. 20 టీఎంసీలు తెలంగాణకు, 10 టీఎంసీలు ఏపీ వాడుకునేలా ప్రాథమికంగా అవగాహన కుదిరింది. ఇప్పటివరకు ఏపీ ఎక్కువగా నీటిని వాడుకుంది. దీంతో ప్రస్తుతమున్న నీటిలో తెలంగాణకు ఎక్కువ వాటా దక్కనుంది. ఇప్పటివరకు జరిగిన నీటి వినియోగంపై రెండు రాష్ట్రాలు వాస్తవ లెక్కలను బోర్డుకు సబ్ మిట్ చేసిన తర్వాత నీటి పంపిణీపై బోర్డు తుది నిర్ణయం తీసుకోనుంది. హైదరాబాద్ లోని కేంద్ర జలసంఘం ఆఫీసులో కృష్ణానదీ యాజమాన్య బోర్డు భేటీ అయింది. ఈ సమావేశంలో  కృష్ణా జలాల వినియోగం, లభ్యత జలాల పంపిణీ, బోర్డు పరిధితో పాటు మరికొన్ని అంశాలపై డిస్కస్ చేశారు. భేటీకి రెండు రాష్ట్రాల నీటి పారుదల శాఖ అధికారులు అటెండ్ అయ్యారు. దాదాపు నాలుగు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో, ఏపీ అదనంగా 7 టీఎంసీల నీటిని వాడుకుందని బోర్డుకు తెలిపారు తెలంగాణ అధికారులు. కృష్ణాలో తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీల  కేటాయింపులు ఉన్నాయి. దీని ప్రకారం లభ్యత నీటిని 36.8.. 63.2 నిష్పత్తిలో పంచుకోవాలని తెలిపింది బోర్డు. ఇప్పటివరకు రెండు రాష్ట్రాలు కలిపి 152 టీఎంసీలు వినియోగించుకున్నాయి. తెలంగాణ 47, ఏపీ 105 టీఎంసీల నీటిని వాడుకున్నాయి. అయితే ఏపీ కేవలం శ్రీశైలం, సాగర్ ల కింది నీటి వినియోగ లెక్కలను మాత్రమే చెబుతోంది. బేసిన్ లోనే ఉన్న తుంగభద్ర  నీటి వినియోగాన్ని ఇందులో కలపడం లేదు. అది కూడా కలిపితే ఏపీ అదనంగా మరో 7 టీఎంసీలు వాడుకున్నట్లు తేలుతోంది. దీంతో ప్రస్తుతం లభ్యతగా ఉన్న 30 టీఎంసీల్లో 7 టీఎంసీలను తెలంగాణకు ఇవ్వాలి. ఇవి తీసేయగా మిగిలిన 23 టీఎంసీలను రెండు రాష్ట్రాలు పంచుకోవాలి.తెలంగాణకు దక్కే 20 టీఎంసీల్లో 3 టీఎంసీల వరకు ఆవిరి నష్టాలుంటాయని అంచనా. అవి తీసేస్తే నికరంగా దక్కేవి 17 టీఎంసీలు మాత్రమేనని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. ఈ 17 టీఎంసీల నీటిని జూలై దాకా హైదరాబాద్ కు 9 టీఎంసీలు, ఏఎంఆర్ పీకి 3టీఎంసీలు, సాగర్ ఎడమ కాల్వకు 5 టీఎంసీల చొప్పున వినియోగించుకుంటామని చెప్పారు తెలంగాణ ఇరిగేషన్ అధికారులు.

శ్రీశైలం డ్యామ్ భద్రతపైనా ఈ సమావేశంలో చర్చ జరిగింది. గతంలో కృష్ణాకు వరదలు వచ్చిన టైమ్ లో  డ్యామ్ దిగువన ఉన్న కొండ చరియలు కొట్టుకుపోయాయి. దీంతో డ్యామ్ కొంత పాడైంది. వరద ఉధృతికి తగినట్లుగా కొన్ని మార్పులు చేయాలని నిర్ణయించారు. దీనిపై స్పందించిన బోర్డు… భద్రతా చర్యలపై ఒకట్రెండు రోజుల్లో కేంద్ర జల సంఘానికి లేఖ రాస్తామని స్పష్టం చేసింది.

ఏపీ అభ్యంతరం చెబుతున్న పాలమూరు, డిండి ప్రాజెక్టులు కొత్తవి కావని, ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టినవేనని వివరించింది తెలంగాణ. అయితే ఈ అంశాలపై తర్వాత జరిగే సమావేశంలో చర్చిద్దామన్నారు బోర్డు అధికారులు. దీనికి రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. ఇక బోర్డు నిర్వహణ కోసం రూ.11.4 కోట్లు కేటాయించాలని రెండు రాష్ట్రాలను కోరింది కృష్ణానది యాజమాన్య బోర్డు.

 

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy