కాంగ్రెస్ ఓడినా బీజేపీకి గట్టిపోటీ

cong-bjpగుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించినట్టుగానే బీజేపీ విజయం సాధించింది. అయితే ఎగ్జిట్ పోల్స్ ను అందుకోవడంలో పార్టీ విఫలమైంది. గత ఎన్నికలతో పోలిస్తే 16 సీట్లు కోల్పోయింది. ఇక ఓడినా కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పై చేయి సాధించింది.

గుజరాత్ అసెంబ్లీపై మరోసారి బీజేపీ జెండా ఎగిరింది. వరుసగా ఆరోసారి అధికారం కైవసం చేసుకుంది బీజేపీ. మొత్తం 99 నియోజకవర్గాల్లో కమలదళం విజయం సాధించింది. ఆ పార్టీకి 49.9శాతం ఓట్లు వచ్చాయి. 2012 ఎన్నికలతో పోలిస్తే ఆ పార్టీ 16 సీట్లు కోల్పోయింది. దక్షిణ గుజరాత్ లో స్థిరంగా పట్టు నిలుపుకున్న బీజేపీ అక్కడ 22 సీట్లు గెలిచింది. సౌరాష్ట్ర ప్రాంతంలో మాత్రం దారుణంగా దెబ్బతింది. అక్కడ 23 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది. గత ఎన్నికలతో పోలిస్తే సౌరాష్ట్రలో 13 సీట్లు ఓడింది బీజేపీ. సెంట్రల్ గుజరాత్ లో 27 సీట్లు గెలిచిన బీజేపీ ఒక సీటును కోల్పోయింది. ఉత్తర గుజరాత్ లోనూ 2 స్థానాలు కోల్పోయి 27కు పరిమితమైంది. పట్టణ ప్రాంతాల్లో ఉన్న పట్టును నిలపుకుంది బీజేపీ. పట్టణ ప్రాంతాల్లో ఉన్న 50 సీట్లలో 43 బీజేపీనే గెలిచింది. ఇక ప్రధాని మోడీ సొంతూరు వడ్ నగర్ ఉన్న నియోజకవర్గంలో బీజేపీ ఓడిపోయింది.

మరోవైపు ప్రతిపక్ష కాంగ్రెస్ 80 సీట్లు గెలిచింది. గత 4 ఎన్నికల్లో ఆ పార్టీ ఎన్నడూ 70కి మించి సీట్లు గెలవలేదు. ఈసారి సంఖ్యను గణనీయంగా మెరుగుపరుచుకున్న కాంగ్రెస్ గ్రామీణ ప్రాంతాల్లో సత్తా చాటింది. 127 గ్రామీణ నియోజకవర్గాల్లో 70కి పైగా స్థానాలను గెలుచుకుంది. 2012 ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్ 19 సీట్లు ఎక్కువగా గెలిచింది. కాంగ్రెస్ కు 43.3శాతం ఓట్ షేర్ వచ్చింది. సౌరాష్ట్ర ప్రాంతంలో కాంగ్రెస్ దూసుకుపోయింది. అక్కడ గత ఎన్నికల కంటే 15 సీట్లు అధికంగా గెలిచిన కాంగ్రెస్ మొత్తం 32 నియోజకవర్గాల్లో విజయం సాధించింది. దక్షిణ గుజరాత్ లో 6, మధ్య గుజరాత్ లో 20, ఉత్తర గుజరాత్ లో 22 చోట్ల కాంగ్రెస్ గెలిచింది.

మొత్తంగా ఎగ్జిట్ పోల్స్ సర్వేలు పూర్తిగా నిజం కాకపోయినా… ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీ స్థానాలను  అందుకోవడంలో బీజేపీ సక్సెస్ అయింది. చాలా కృషి చేసిన కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ కు 12 సీట్ల దూరంలో ఆగిపోయింది. ముగ్గురు ఇండిపెండెంట్లు గెలవగా… వారంతా కాంగ్రెస్ మద్దతుతో గెలిచనవారే. దళిత నేత జిగ్నేష్ మేవానీ, OBC నాయకుడు అల్పేష్ ఠాకూర్ లు విజయం సాధించారు.

రెండు పార్టీలు మంచి ప్రదర్శన ఇచ్చినా… కీలక నేతలు చాలామంది ఓడిపోయారు. ఆరుగురు మంత్రులు ఓడారు. కాంగ్రెస్ శక్తిసిన్హ్ గోహిల్ లాంటి సీనియర్ నేతలు కూడా ఓటమి పాలయ్యారు. ప్రజా తీర్పును అంగీకరిస్తున్నామన్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. కొత్త ప్రభుత్వాలకు కంగ్రాట్స్ చెప్పారు. తనపట్ల గుజరాత్, హిమాచల్ ప్రజలు చూపిన ప్రేమాభిమానాలకు థ్యాంక్స్ చెప్పారు. కాంగ్రెస్ కార్యకర్తలు తనను గర్వపడేలా చేశారని ట్వీట్ చేశారు రాహుల్.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy