కార్మికుల పక్షపాతి…కాకా


అరవై ఐదేళ్ల రాజకీయ జీవితం,  దేశంలోనే  సీనియర్ నేత, ఉద్యమకారుడు.. తెలంగాణ రాజకీయాల్లో  తిరుగులేని  నాయకుడు,  దళిత నేత గడ్డం వెంకటస్వామి.  పేదల నాయకుడిగా  ఎదిగి …. కేంద్ర, రాష్ట్ర  రాజకీయాల్లో  తనదైన  ముద్ర వేశారు. కాకాగా  జనం పిలుచుకునే  జి. వెంకటస్వామి… 4వ వర్ధంతి  సందర్భంగా ఆయన్ను ఓసారి స్మరించుకుందాం.

జి. వెంకటస్వామి. తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమాల్లో ఆయనది కీలకపాత్ర. కేంద్రమంత్రిగా.. కార్మికుల పక్షపాతిగా ఎన్నో సేవలు చేశారు. అభిమానులు, అనుచరులు ఆయన్ను కాకాగా  పిలుచుకుంటారు. పేదలకు గూడు కోసం అలుపెరగని ఉద్యమం చేసిన కాకా.. గుడిసెల వెంకటస్వామిగా వారి గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయులుగా నిలిచిన గడ్డం వెంకటస్వామి.. 1929 అక్టోబర్ 5న హైదరాబాద్ లో పుట్టారు. గడ్డం పెంటమ్మ, మల్లయ్యకు మూడో సంతానం కాకా.

ఆర్థికంగా ఇబ్బందులున్నా పిల్లలకు మంచి చదువు చెప్పించాలనుకున్నారు కాకా తండ్రి మల్లయ్య. అందుకే ఆర్యసమాజ్ బడిలో, తర్వాత మొగల్ పురా వస్తానియా బడిలో చదివించారు. ఉర్దూ మీడియంలో మెట్రిక్ వరకు చదువు సాగింది. తండ్రి చనిపోవడంతో కుటుంబాన్ని నడిపించాల్సిన బాధ్యత వెంకటస్వామిపై పడింది. చదువు మానేసి భవన నిర్మాణ కూలీగా కొన్నాళ్లు పనిచేశారు. అదే సమయంలో హైదరాబాద్ సంస్థానంలో పరిస్థితులు ఆయన జీవితాన్ని ప్రభావితం చేశాయి. ఆర్యసమాజ్ లో రామానంద తీర్థ పరిచయం ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. ఆయన శిష్యుడిగా నిజాం వ్యతిరేక పోరాటంలో చురుగ్గా పాల్గొన్నారు. 20 ఏండ్లు నిండకుండానే  ఉద్యమం సాగించారు. నిజాం వ్యతిరేక పోరాటంలో జైలుకు వెళ్లారు కాకా. తర్వాత 1969 ఉద్యమ సమయంలో అరెస్టైన ఉద్యమ కారుల కోసం ముషీరాబాద్ జైలుకు పోయి.. అక్కడ పోలీసుల కాల్పుల్లో బుల్లెట్ దెబ్బలు తిన్నారు. మరణం అంచుల వరకూ పోయి బతికారు. తెలంగాణ వాదం కోసం ఇలాంటి పట్టుదలే ఆయన్ను తిరుగులేని నేతగా మార్చింది.

హైదరాబాద్ విలీనం తర్వాత.. భవన నిర్మాణ కూలీగా, సాధారణ ఉద్యమకారుడిగా మొదలైన ఆయన జీవితం… పేదలు, కార్మికుల నాయకుడి నుంచి.. ఎంపీగా, కేంద్ర మంత్రిగా జాతీయస్థాయికి చేరింది. మెట్రిక్ మాత్రమే చదివిన ఆయనకు జీవిత అనుభవమే అంతర్జాతీయ స్థాయిలో కార్మికుల తరపున ప్రసంగించే వరకూ తీసుకెళ్లింది. స్వాతంత్ర్య ఉద్యమం నుంచి తెలంగాణ సాధన ఉద్యమం దాకా అన్నింట్లోనూ పాల్గొన్న ఆయన.. దేశంలోనే సీనియర్ రాజకీయ నేతల్లో ఒకరిగా నిలిచారు.

అప్పట్లో హైదరాబాద్ లో బతకటానికి వచ్చిన పేదలు.. ఖాళీ జాగాల్లో గుడిసెలు వేసుకునేవారు. భూముల విలువ పెరగడంతో పేదలను వెళ్లగొట్టడం మొదలుపెట్టారు భూస్వాములు. గూండాలతో దౌర్జన్యంగా వెళ్లగొడుతున్న తీరు చూసి కదిలిపోయిన వెంకటస్వామి… 1949లో దేశంలోనే మొదటిసారిగా జాతీయ గుడిసెల సంఘం స్థాపించారు. ఈ పోరాటంతోనే హైదరాబాద్ నగరంలోనే దాదాపు 80వేల మందికి సొంత గూడు దక్కింది.

కాకా చేసిన బషీర్ బాగ్ గుడిసెల పోరాటం చరిత్రలో నిలిచిపోయింది. అక్కడ పేదల గుడిసెలను ఖాళీ చేయించేందుకు మున్సిపాల్టీ నోటీసులిచ్చింది. ఖాళీ చేయకపోవడంతో పోలీసులతో దాడి చేయించారు. దీనికి వ్యతిరేకంగా కాకా భారీ ర్యాలీ తీశారు. ఈ ర్యాలీలో లక్షల మంది పాల్గొనడం చూసి.. నాటి సీఎం నీలం సంజీవరెడ్డి ఆశ్చర్యపోయారు. దీంతో పేదలున్న స్థలాలను వారికే ఇప్పించారు. ఈ సంఘటనతో కాకాకు జనంలో ఉన్న బలం ప్రభుత్వానికి కూడా తెలిసొచ్చింది. భూస్వాముల చేతుల్లో ఉండిపోయిన భూముల్లో కొంతవరకైనా పేదల చేతికి రావడానికి 20 ఏళ్ల పాటు ఆయన సాగించిన ఉద్యమమే కారణమైంది. అందుకే పేదలకు కాకాగా మారారు. పేదల నాయకుడిగా జాతీయస్థాయికి ఎదిగారు.

దశాబ్దాల పాటు కార్మిక ఉద్యమంలో కాకాది కీలకపాత్ర. మొదట్లో హైదరాబాద్ రాష్ట్రంలో అసంఘటిత రంగంలో పనిచేస్తున్న భవన నిర్మాణ కూలీలు, రిక్షా కార్మికుల సమస్యలపై పోరాటం చేశారు కాకా. తర్వాత  కంపెనీల్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలపై పోరాటం చేశారు. హైదరాబాద్ స్టేట్ INTUC ప్రెసిడెంట్ అయిన తర్వాత పోరాటాలు మరింత ఉద్ధృతం చేశారు. ఒకే సమయంలో 101 పైగా సంఘాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా నాయకత్వం వహించారు. 1961లో INTUC రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాక.. కార్మిక సంక్షేమం కోసం సహకార సొసైటీలను ఏర్పాటు చేయించారు. తర్వాత అన్ని సొసైటీలు కలిపి రాష్ట్ర సహకార సమాఖ్య ఏర్పాటైంది. కార్మికులకు కనీస వేతనాలు, జీవన భద్రత కోసం పోరాడి విజయం సాధించారు కాకా.

కార్మిక ఉద్యమాలతో ఎదిగిన కాకా తర్వాత కాలంలో కేంద్రంలో కార్మిక మంత్రి అయ్యారు. నాయకుడిగా ఏ డిమాండ్లు చేశారో మంత్రిగానూ వాటిని నెరవేర్చేందుకు చివరి దాకా పని చేశారు. ఖాయిలా జాబితాలో ఉన్న సింగరేణికి 11వందల కోట్ల రూపాయల కేంద్ర సాయం ఇప్పించారు. ఖాయిలా లిస్టు నుండి తప్పించేలా చేశారు. అంతేకాదు బొగ్గు గని కార్మికులకు ప్రత్యేకంగా పీఎఫ్, గ్రాట్యూటీ, పెన్షన్ సౌకర్యం కల్పించారు.

మొదటిసారిగా ప్రైవేటు రంగంలో పెన్షన్ సౌకర్యం ఆలోచన చేసింది కాకానే. రిటైరయ్యాక ఒక్కసారిగా వచ్చే పీఎఫ్ డబ్బు ఖర్చైపోతే రోడ్డునపడుతున్న కార్మికులను చూసి కాకా కదిలిపోయారు. దీంతో ప్రభుత్వ ఉద్యోగుల్లాగే ప్రైవేటు కార్మికులకు పెన్షన్ ఉండాలని ఆలోచించారు. కాకా కృషితో పెన్షన్ ఫండ్ ఏర్పాటైంది. దీంతో కార్మికులు తాము దాచుకున్న సొమ్ము నుండే పెన్షన్ అందుకోవడం మొదలైంది. ఇది కోట్లాది మంది జీవితాలకు భద్రత కల్పించింది.

ఇక రామగుండం ఎరువుల కర్మాగారం పునరుద్ధరణ కోసం కాకా జీవితాంతం కృషి చేశారు. తాను ఎంపీగా ఉండి, తర్వాత తన కుమారుడు వివేకానంద్ ఎంపీ అయ్యాక కేంద్రంలో ప్రయత్నాలు చేశారు. 10 వేల కోట్ల రూపాయల బాకీలు మాఫీ చేయించారు. దీంతో ఎఫ్.సి.ఐ. పునరుద్ధరణకు ఉన్న సమస్యలు తీరిపోయాయి.

రాష్ట్రంలోనూ పౌరసరఫరాలు, కార్మిక మంత్రిగా పనిచేసిన కాకా ముక్కుసూటిగా పనిచేసే మంత్రిగా పేరుతెచ్చుకున్నారు. పేదల కోసం అన్నపూర్ణ క్యాంటీన్లు పెట్టించారు. రాష్ట్ర మంత్రిగా ఉండి కూడా జెనీవాలో జరిగిన అంతర్జాతీయ కార్మిక సదస్సులో దేశానికి ప్రతినిధిగా పాల్గొన్నారు. దశాబ్దాల కార్మిక పోరాటాలకు దక్కిన గౌరవం అది. రాజకీయంగా ఏ స్థాయిలో ఉన్నా జీవితాంతం కార్మికుల పక్షమే పనిచేశారు కాకా.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు తర్వాత 1957లో మొదటిసారి సిర్పూర్ నుండి అసెంబ్లీకి ఎన్నికయ్యారు కాకా తర్వాత 1967లో సిద్దిపేట నుండి ఎంపీగా పోటీచేసి భారీ మెజారిటీతో గెలిచారు. అలా రెండుసార్లు అసెంబ్లీకి, ఏడు సార్లు లోక్ సభకు ఎన్నికైన కాకా దేశంలోనే సీనియర్ నాయకుల్లో ఒకరిగా సుదీర్ఘ రాజకీయ జీవితం సాగించారు. 2009 నాటికి క్రియాశీల రాజకీయాల నుండి తప్పుకున్నారు కాకా. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ కూడా తెలంగాణ చూసేదాకా ప్రాణం వదలనని ప్రతిజ్ఞ చేశారు. చివరికి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాకే 2015 డిసెంబర్ 22న కన్నుమూశారు. అంబేద్కర్ ఆలోచనలను జీవితాంతం పాటించిన కాకా ఆయన పేరుతోనే అంబేద్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీని స్థాపించి మంచి ప్రమాణాలతో బడుగువర్గాల పిల్లలకు చదువులు అందేలా చూశారు. ప్రస్తుతం కాకా కుటుంబం కూడా ఆయన అడుగుజాడల్లో నడుస్తూ.. పేదల అభ్యున్నతికి కృషిచేస్తోంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy