కార్మిక పక్షపాతి దూరమై ఏడాదయ్యింది

venkata-swamy- 475దళిత దిగ్గజం… కార్మిక పక్షపాతి.. కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కాకా కన్నుమూసి ఇవాల్టికి ఏడాదయ్యింది. రాజకీయాలు, ప్రజా సేవతో పాటు… ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో యాక్టివ్ గా పని చేసిన కాకా సేవలను.. రాష్ట్రం స్మరించుకుంటోంది. ఆయన మొదటి వర్థంతి సందర్భంగా.. అంజలి ఘటిస్తోంది.

బడుగుల అభ్యున్నతి కోసమే జీవితాన్ని అంకితం చేసిన  నాయకుడు.. అభిమానులు, అనుచరులు, అయినవాళ్లంతా కాకా అని ఆప్యాయంగా పిలుచుకునే మహనీయుడు వెంకటస్వామి. కాకా కన్నుమూసి ఇవాల్టితో ఏడాది పూర్తవుతోంది. చివరి క్షణం వరకూ బలహీన వర్గాల సంక్షమం కోసం పరితపించిన కాకా.. 2014లో డిసెంబర్ 22న చివరి శ్వాస విడిచారు.

1929 అక్టోబర్ 5న జన్మించిన కాకా.. కాంగ్రెస్ లో సాధారణ కార్యకర్త నుంచి అంచెలంచెలుగా ఎదిగారు. నిజాం వ్యతిరేక పోరాటంలో చురుగ్గా కదిలారు. అదే ఉత్సాహంతో… 1969 తెలంగాణ తొలి దశ ఉద్యమంలో ముందు నిలిచి.. ముషీరాబాద్ జైలు దగ్గర జరిగిన కాల్పుల్లో బుల్లెట్ దెబ్బ తిన్నారు. 2000 తర్వాత మలి దశ ఉద్యమంలోనూ ఉత్సాహంగా కదిలిన కాకా.. రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయాలు తీసుకునేందుకు కారణమయ్యారు. ఇక.. 1957లో ఎమ్మెల్యే అయిన కాకా.. అప్పటి నుంచి 2007 వరకు ఏ పదవిలో ఉన్నా… దళితుల సంక్షేమానికి పాటుపడ్డారు. 1973లో కేంద్ర కార్మిక, పునరావాస శాఖ మంత్రిగా.. రేషన్ షాపులు, చౌక ధరల సరఫరా స్కీమ్ ను దేశంలో మొదటిసారి ప్రవేశపెట్టారు. పీవీ హయాంలో కార్మిక మంత్రిగా పని చేసినపుడు.. పీఎఫ్ స్కీమ్ ప్రారంభించారు. పీవీ టైమ్ లోనే.. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా.. పంచాయతీ రాజ్ వ్యవస్థను పటిష్టంగా అమలు చేశారు. మరోవైపు.. ఇళ్లు లేని నిరుపేదల కోసం.. దేశ వ్యాప్తంగా గుడిసెలు వేయించి… గుడిసెల వెంకటస్వామిగా  గుర్తింపుతెచ్చుకున్నారు కాకా.  పీడిత వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన కాకాకు… తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అరుదైన గుర్తింపు దక్కింది. అక్టోబర్ 5న.. కాకా 86వ జయంతిని  ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. అదేరోజు ..కాకా నిలువెత్తు విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ఆవిష్కరించారు… ముఖ్యమంత్రి కేసీఆర్.  హైదరాబాద్ సాగర్ పార్క్ లో… కాకా వర్థంతి ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయి. ఉదయం  9.30కు కాకా విగ్రహానికి రాజకీయ, సామాజిక ప్రముఖులు పూల మాలలతో నివాళి అర్పించనున్నారు. పదిన్నరకు బాగ్ లింగంపల్లి లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ లా కాలేజ్ లో.. రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ పాట్నా హై కోర్ట్ ఎల్. నరసింహారెడ్డి.. కొత్త బ్లాక్ ప్రారంభించనున్నారు. ప్రభుత్వ పెద్దలు, కాంగ్రెస్ ముఖ్య నేతలు హాజరు కానున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కాకా అభిమానులు వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy