కాళన్న దూరమై 15 ఏళ్లు

kalojiఅన్యాయానిదే అధికారమైతే ప్రశ్నించే గొంతుదే గొడవ.. ఆధిపత్యానిదే నిర్బంధమైతే ఎదురించే కలానిదే తిరుగుబాటు.. ధిక్కారమే ఉద్యమమైనప్పుడు ప్రతిధ్వనించే నినాదమే కాళోజీ.. ఫిరంగిలాంటి మాటలు.. నిప్పుకణికల్లాంటి కవితలతో కవిత్వాన్ని కాలాతీతం చేసిన అక్షరం కాళన్న.. ఇవాళ కాళన్న వర్ధంతి…

చివరి శ్వాస వరకు జనం కోసమే ఉద్యమించిన కవిసింహం కాళోజీ అసలు పేరు రఘువీర్  నారాయణ్  లక్ష్మీకాంత్  శ్రీనివాసరావు రాం రాజా కాళోజి. 1914 సెప్టెంబర్  9న కర్ణాటకలోని బీజాపూర్  జిల్లా రట్టేహళిలో పుట్టారు.కాళన్న పుట్టిన తరువాత ఆయన కుటుంబం వరంగల్ జిల్లా మడికొండకు వలసొచ్చింది. ప్రాథమిక విద్య తరువాత హైదరాబాద్ పాతబస్తీ చౌమహల్లా స్కూల్ లో కొన్ని రోజులు చదివి హనుమకొండ కాలేజియేట్ హైస్కూల్ లో మెట్రిక్యులేషన్ పూర్తి చేశాడు..1939లో హైకోర్టు అనుబంధ లా కాలేజీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందాడు..1940లో రుక్మిణిబాయిని పెళ్లి చేసుకున్నాడు.

పోరుగల్లు ఓరుగల్లులో ప్రజల పక్షాన నిలబడి కాళోజి ఎన్నో  పోరాటాలు చేశాడు..తెలంగాణలోని ప్రతీగ్రామంలో గ్రంథాలయం ఉండాలని కాళన్న కోరుకున్నాడు. అందుకే 1930 నుంచే గ్రంథాలయోద్యమంలో పాల్గొన్నాడు. ఆర్యసమాజ్,వందేమాతరం ఉద్యమం,హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్,ఆంద్ర మహాసభ కార్యకలాపాల్లో కీలకంగా పనిచేశాడు.. మాడపాటి హనుమంతరావు,సురవరం ప్రతాపరెడ్డి, జమలాపురం కేశవరావు, బూర్గుల రామకృష్ణారావు, పివి నరసింహారావుతో కలిసి కాళోజీ అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు..నిజాం నిరంకుశత్వాన్ని ఎదురించి విద్యార్థిగా ఉన్నప్పుడే వరంగల్ లో గణేష్ ఉత్సవాలు నిర్వహించాడు..తెలంగాణలో అక్షర జ్యోతిని వ్యాపింపచేయాలన్న తపనతో ఆంధ్రాసారస్వత పరిషత్తును స్థాపనలో ముఖ్యపాత్ర పోషంచాడు..రజాకార్ల దౌర్జన్యాన్ని ప్రతిఘటిస్తూ 1945 లో పరిషత్తు ద్వితీయ మహాసభలను నిర్వహించాడు..వరంగల్ కోటలో జాతీయ పతాకాన్ని ఎగరేసేందుకు ప్రయత్నించారన్న కారణంతో నగర బహిష్కరణకు గురయ్యాడు..

అన్న షాద్ రామేశ్వర్  ప్రోత్సాహంతో తెలంగాణ యాసలో ఎన్నో కవితలు రాశాడు..అయితే కవిత్వం రాసుకోవడానికి కాళోజి దగ్గర నోట్ బుక్ కానీ, కాగితాలు,కలం ఉండేవి కావు.ఆశువుగా కవితలు చెప్పేవాడు..వాటి విలువ తెలిసిన కాళోజీ అనుచరులు దొరికినవాటిని కాగితం మీద రాసి పెట్టారు.. నిద్రపోయినప్పుడు తప్పా మిగతా సమయమంతా కాళోజీ మాటలప్రవాహమే…ఉద్యమగీతమే.

కాళోజి మొదట్లో విశాలాంధ్రను సమర్థించారు..అయితే తన అభిప్రాయం తప్పని త్వరగానే తెలుసుకున్నాడు..అందుకే ఉమ్మడి రాష్ర్టంలో తెలంగాణకు న్యాయం జరుగదని తెలంగాణ విముక్తి కోసం గళమెత్తాడు..1969 ఉద్యమానికి మద్దతుగా ప్రతీ రోజూ కవిత్వాన్ని రాశాడు.ఎవరునుకున్నారు ఇట్లుఅవునని..ఆంధ్రా తెలంగాణలకు సఖ్యత చెడుతుందని..అన్యత ఏర్పుడుతుందని..కడుపులో చిచ్చుపెట్టి కళ్లు తుడవవస్తరని ఎవరనుకున్నారని కాళన్న ప్రశ్నించాడు

తెలంగాణ వేరైతే..దేశానికి ఆపత్తా? తెలంగాణ వేరైతే కిలోగ్రాము మారుతుందా? తెలంగాణ వేరైతే తెలివి తగ్గిపొతుందా? అని ఆవేశంగా ప్రశ్నించాలన్నా..నమ్ముకొని పెత్తనము ఇస్తే నమ్మకము పోగొట్టుకొంటివి..పదవి అధికారముల బూని.. పదిలముగ తల బోడి జేస్తివి అని నిలదీయాలన్న అది ఒక్క కాళోజీకే సాధ్యం.

దేశభక్తి,వర్గపోరాటం,అన్యాయం,సామాజిక అంతరాలు…కనిపించే ప్రతీ వస్తువు..ప్రతీ చర్య కాళోజికి కవితా వస్తువే.. అన్యాయాన్నెదిరించడం నా జన్మహక్కు.. అన్యాయాన్నెదిరిస్తే నా గొడవకు సంతృప్తి..అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి..ప్రాప్తి…అన్యాయాన్ని ఎదురించినోడే నాకు ఆరాధ్యుడని చెప్పుకున్న కవిసింహం..బడి పలుకుల భాష వద్దూ పలుకు బడుల భాష  కావాలని కోరుకున్న అసలు సిసలు భాషావేత్త కాళోజీ.

కాళోజి రచనల్లో ప్రసిద్ధి పొందింది నా గొడవ. ఈ పుస్తకం ఏడు సంపుటాలుగా వెలువడింది…తెలంగాణ గోసను ప్రత్యక్షంగా  చూసి కన్నీరు పెట్టిన కాళోజి ఆ దుఃఖాన్ని తన అక్షరాల్లో నింపాడు…అన్యాయాన్ని ఎదిరించడమే తన జీవితాదర్శంగా ప్రకటించడం మాత్రమే కాదు, ఏడు దశాబ్దాలకు పైగా ఆచరించి చూపించాడు కాళోజీ..ప్రజా పోరాటాల్లో ప్రత్యక్షంగా పాల్గొని.. జైలు జీవితాన్ని సైతం అనుభవించిన పోరాట ధీరుడు…దౌర్జన్యానికి ప్రతిరూపమయిన నిజాం రాజరిక పాలన నాటి నుంచి పార్లమెంటరీ ప్రజాస్వామిక పాలన దాకా ఆరు దశాబ్దాల పాటు తిరుగుబాటును కొనసాగిస్తూ…..నిరంతరం పోరాడారు..సమాజానికి హితం బోధించలేని దేదీ సాహిత్యం కాదు. కవిత్వం అసలే కాదు. కాళోజీకి ఈ విషయంలో నిర్దిష్టమైన అవగాహన ఉంది. అందుకే ఆయన ఆధునిక కవి, సార్వకాలిక కవి అయ్యాడు..

తెలంగాణ విముక్తికోసం పరితపించిన అసలు సిసలు తెలంగాణవాది కాళోజి 2002 నవంబర్ 13 న చనిపోయారు..కడసారి కాళన్నను చూడడానికి వేలాదిమంది వరంగల్ కు తరలివచ్చారు..చివరి శ్వాస దాకా నాలుగున్నర కోట్ల  ప్రజల కొట్లాటను తన రచనల్లో వినిపించిన తెలంగాణ ఆణిముత్యం.అందుకే కావచ్చు ఆంధ్రప్రదేశ్ ఆధిపత్య భావజాలం కాళన్నను దూరం పెట్టింది..ఆయన కాలం కవులైన విశ్వనాథ సత్యనారాయణ, దేవుల పల్లి కృష్ణశాస్త్రి, రాయప్రోలు సుబ్బారావులకిచ్చిన గౌరవం కాళోజికి దక్కలేదు..సాహిత్య చరిత్రలో కాళన్నకు సముచిత స్థానం ఇవ్వలేదు..కాళోజి  గొప్పతనాన్ని తెలుసుకున్న భారతప్రభుత్వం పద్మవిభూషణ్ బిరుదుతో సత్కరించింది

కాళోజీ ఏనాడు కవిత్వం కోసం కవిత్వం రాయలేదు…అన్యాయాన్ని ప్రతిఘటించాలన్న తీవ్ర సంఘర్షణకు ప్రతిక్రియగా దూసుకొచ్చిన వాక్కే కాళోజీ కవిత్వమయింది.. కాళోజి ప్రతిభను ఆలస్యంగా గుర్తించిన  భారత ప్రభుత్వం అయనను పద్మవిభూషణ్  బిరుదుతో సత్కరించింది. ఏ విశేషణాలూ ఏ బిరుదులూ ఏ హోదాలూ ఏ వర్గీకరణలూ అవసరం లేని ఇరవయ్యో శతాబ్ది తెలంగాణ మహోన్నత వ్యక్తిత్వం కాళోజీ ది …ప్రజాకవి అనుకున్నా, రచయిత అన్నా, వక్త అని మెచ్చుకున్నా…పౌరహక్కులకోసం అవిశ్రాంతంగా పనిచేసినవాడని చెప్పుకున్నా….తెలంగాణ వాదని గర్వపడ్డా… ఇవన్నీ ఎవరికి వారు ఆయన గొప్పదనాన్ని చెప్పడానికి చేసిన విఫల ప్రయత్నాలే…అంతేకాని కాళోజీ వ్యక్తిత్వాన్ని సంపూర్ణంగా ఆవిష్కరించేవి కావు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy