కీలక నిర్ణయం తీసుకోనున్న ఇమ్రాన్ : 27 మంది భారతీయులకు విముక్తి

ఇటీవల జరిగిన పాక్ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన తెహ్రీక్-ఈ-ఇన్సాఫ్ చిన్న పార్టీల మద్దతును కూడగట్టుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఆగస్టు 11న ఇమ్రాన్‌ ప్రధానిగా ప్రమాణ స్వీకార కార్యక్రమం చాలా సాదాసీదాగా నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇమ్రాన్‌ ఖాన్‌ పాకిస్థాన్‌ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయకముందే భారత్‌ తో సత్సంబంధాలు కలిగి ఉండేందుకు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారని నివేదికలు చెబుతున్నాయి. ఇందులో భాగంగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజునే పాక్‌ జైళ్లలో మగ్గుతున్న 27మంది భారతీయులను విడుదల చేయాలని నిర్ణయించారట. ఇందుకు సంబంధించి పాకిస్థాన్‌, భారతదేశ అధికార వర్గాల మధ్య చర్చలు నడిచాయని, కొన్ని పత్రాలను సైతం సిద్ధం చేసినట్లు సమాచారం.

భారత్‌కు చెందిన 27మంది మత్స్యకారులను ఆగస్టు 12న కరాచీ జైలు నుంచి లాహోర్‌ కు తరలించనున్నారు. అనంతరం అక్కడి నుంచి వాఘా సరిహద్దుకు తీసుకొచ్చి, భారతీయ అధికారులకు అప్పగిస్తారు. ప్రయాణ సమయంలో బందీలుగా ఉన్న మత్స్యకారులకు అందించే ఆహారం.. వారిని ఎలా తీసుకురావాలి.. తదితర విషయాలను ఇరు దేశాల అధికారులు ఇప్పటికే చర్చించారట. అయితే, ఎవరెవరు జైలు నుంచి విడుదలవుతున్నారో వారి పేర్లను మాత్రం ప్రస్తుతానికి వెల్లడించలేదు. ఇదే నిజమైతే బీటలు వారిన భారత్‌-పాక్‌ మైత్రీ బంధం మెరుగుపడవచ్చని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy