కుంజా బొజ్జి.. నిఖార్సైన కమ్యూనిస్టు

kunja-bojjiహ్యాట్రిక్ ఎమ్మేల్యేగా గెలిచినా… సాధారణ జీవితన్నే ఎంచుకున్నారాయన. కోట్లు సంపాదించే అవకాశం వున్నా… నయా పైసా ఆశించని ప్రజానాయకుడు. చిటికేస్తే ప్రాణాలిచ్చే కార్యకర్తలున్న పదవి ఆశించని నేత. సంపాదన మాట దేవుడెరుగు… వచ్చిన జీతంలోంచి అరవైశాతం మొత్తాన్ని పార్టీ ఫండ్ గా ఇచ్చిన గొప్ప మనిషి. 92 ఏళ్ళ వయస్సులోనూ తన పని తాను చేసుకుంటూ… బీదరికంతో బతుకీడుస్తున్న నిఖార్సయిన ఖమ్మం జిల్లా కమ్యూనిస్టు యోధుడిపై స్పెషల్ స్టోరీ.

ఇక్కడ కనిపిస్తున్న ఈ వ్యక్తి పేరు కుంజా బొజ్జి. పాతతరం కమ్యునిస్టు యోధుడు…హ్యాట్రిక్ ఎమ్మెల్యే. ఈయన సొంతూరు ఖమ్మం జిల్లాలోని వీఆర్ పురం మండలం రామవరం పంచాయితీలోని అడవి వెంకన్నగూడెం. ఇతనికి ఆరుగురు కొడుకులు, ముగ్గురు కుమార్తెలు. 1952 లో ఉమ్మడి కమ్యునిస్టు పార్టీలో సభ్యత్వం తీసుకున్నారు. సిధ్దాంతమే ఊపిరిగా… అగ్ర నాయకులతో కలిసి… వెట్టి చాకిరి కూలి రేట్లు పెంచాలంటూ పోరాటాలు చేశాడు. ప్రజాబలం ఉన్న నాయకుడిగా ఎదిగాడు.

1985 లో భద్రాచలం అసెంబ్లీ నియోజక వర్గం నుంచి సీపీఎం పార్టీ తరుపున ఎన్నికల బరిలో నిలిచి… కాంగ్రెస్ పై తొలిసారి విజయం సాధించారు బొజ్జి.  తరువాత వరుసగా 1989, 1994 ఎన్నికల్లోనూ మిత్ర పక్షాల అభ్యర్ధిగా పోటి చేసి గెలుపొందారు. MLA గా ఎన్నికైన సమయంలో రూ. రెండు వేల జీతం వచ్చేది.  అందులోనే రాష్ట్ర పార్టీకి రూ. 1000, 200 రూపాయలు జిల్లా పార్టీకి ఫండ్ గా ఇచ్చి మిగతా డబ్బును కుటుంబ అవసరాలకు వాడుకునేవారు. ఆనాడు ప్రభుత్వం MLA లకు ఇళ్ల నిర్మాణం కోసం స్ధలం కేటాయించగా పార్టీ నిర్ణయం మేరకు వచ్చిన స్థలాన్ని తిరస్కరించారు.

ఇంతటి ఘన చరిత్ర ఉన్న ఈ మాజీ MLA ప్రస్థుతం ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. తినడానికి తిండి కూడా దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. అడ్డదారిలో వెళ్తే కోట్లు సంపాదించేవాడిననీ.. కానీ.. విలువలకు కట్టుబడి బతికిన గాంధీ, అల్లూరి, పుచ్చలపల్లి సుందరయ్య లాంటి మహనీయులే తనకు ఆదర్శమంటున్నారు.

పిల్లలు కూడా వ్యవసాయ వృత్తిలోనే ఉండడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని చెబుతోంది ఆయన భార్య. తన భర్త పేరు… ఎన్నో శిలాఫలకాల పై ఉన్నా తినేందుకు కుండలో బియ్యం మాత్రం లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కుంజా బొజ్జి తన మొత్తం జీవితాన్ని ప్రజా సేవకే అంకితం చేశారు. తనకంటూ ఓ ఇంటిని కూడా నిర్మించుకోకుండా అనాధలా మిగిలారు. ప్రస్తుతం ఉంటున్న వీఆర్ పురం మండలం ముంపు మండలం కావడంతో ఆంధ్రప్రదేశ్ లో కలిసింది. దీంతో భవిష్యత్తులో బొజ్జికి ఉన్న పూరి గుడిసె కూడా మిగిలేలా కనిపించడం లేదంటున్నారు స్థానికులు. ప్రభుత్వమే ఆయన్ను ఆదుకోవాలని కోరుతున్నారు. అగ్ర నాయకులతో కలిసి ప్రజా హక్కులను సాధించుకోవడంలో సఫలం అయిన బొజ్జి… తన వ్యక్తిగత జీవితంలో మాత్రం ఇబ్బందులు పడుతున్నారు. ఎన్ని సమస్యలు వచ్చినా.. సిద్ధాంతాలకు కట్టుబడి బతికానన్న సంతృప్తి తనకు ఉందని అంటున్నారు. ప్రజాసేవే ఊపిరిగా గడిపిన వ్యక్తికి.. ప్రభుత్వం, అధికారులు అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy