కులం పేరుతో తిడితే జైలు

racismజాతివిద్వేషులకు, కుల అహంకారులకు ముకుతాడు వేసే పనిలో పడింది కేంద్రం. కఠిన చట్టాల రూపకల్పనకు రెడీ అవుతోంది. కేంద్రం తీసుకొచ్చే చట్టంతో ఇకపై ఏ కులాన్ని, జాతిని అవహేళన చేసినా.. మూడేళ్లు జైలు తప్పదంటున్నారు న్యాయ నిపుణులు. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలను ఉద్దేశించి ఈ చట్టాన్ని తీసుకొస్తున్నారు. నార్త్ ఈస్ట్ టుడే కథనం ప్రకారం.. 2014 జనవరిలో ఢిల్లీలో నిడో టానియా అనే అరుణాచల్ ప్రదేశ్ యువకుడిని జాత్యాహంకారంతో చంపేశారు. దీంతో అప్పటి యూపీఏ ప్రభుత్వం ఎం.కె.బెజ్‌బారువా కమిటీని వేసింది. కమిటీ సిఫార్సుల అమల్లో భాగంగానే కులం, జాతి పరంగా కించపరచడాన్ని మూడేళ్ల జైలుశిక్ష వేయదగ్గ తీవ్ర నేరంగా పరిగణిస్తూ ఐపీసీలో మార్పులు చేస్తున్నారు. జాతిపరమైన దాడులకు పాల్పడితే ఐదేళ్ల శిక్ష వేయనున్నారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ఆ ప్రతిపాదనల ప్రకారం ఐపీసీలో 153(సి), 509(ఎ) అని రెండు సెక్షన్లు చేరుస్తున్నారు. 509(ఎ) సెక్షన్‌ అత్యంత కీలకమైనది. దాని ప్రకారం…. జన్మస్థలం, జాతి సంబంధ ముఖ కవళికలు, ప్రవర్తన, అనుసరించే సంప్రదాయాలు, వేషధారణ ఆధారంగా…. ఒక జాతి వ్యక్తిని అవమానపరిచే ఉద్దేశంతో…. ఏ పదం మాట్లాడినా, ఏ శబ్దం చేసినా, సైగ చేసినా, అవమానించే పదాన్ని లేదా శబ్దాన్ని సూచించే ఏదైనా వస్తువును చూపించినా… దాన్ని బాధితుడు విన్నపుడు…. చూసినపుడు… అవమానించిన వ్యక్తి శిక్షార్హుడవుతారు. మూడేళ్ల వరకు జైలుశిక్ష, జరిమానా లేదా రెండూ వేయొచ్చు.

153(సి) ప్రకారం… పైన చెప్పిన అంశాల ఆధారంగా జాతి విద్వేషాలను ప్రోత్సహించినా, హింసాత్మక దాడుల్లో పాల్గొన్నా ఐదేళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. ఒక జాతికి చెందిన వ్యక్తి గౌరవానికి గానీ, కొద్దిమంది వ్యక్తుల గౌరవానికి గానీ భంగం కలిగించే ప్రవర్తనలన్నీ 153(సి) నిబంధన కిందకు వస్తాయి. ఎం.కె.బెజ్‌బారువా కమిటీ సిఫారసులను ఆమోదించిన కేంద్రం… దీనిపై అభిప్రాయాలు తెలపాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. ఈ మేరకు ఇండియన పీనల్‌ కోడ్‌(ఐపీసీ)లోని సెక్షన 509 తర్వాత 509(ఎ)ను కొత్తగా చేర్చనుంది. రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయాలు తెలపగానే వచ్చే సమావేశాల్లో కొత్త చట్టాన్ని ప్రతిపాదించనున్నారు.

ఈ సెక్షన్లలో ముఖ్యంగా జాతి గురించి చెప్పినా… కులానికి కూడా వర్తిస్తాయి. తెలుగురాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాలను, కొన్ని కులాలను కించపరిచే విధంగా సామెతలు ఉన్నాయి. సినిమాలలో కూడా ఆయా ప్రాంతాలు, కులాలపై వ్యంగ్యమైన వ్యాఖ్యలు ఉన్నాయి. ఇకపై ఇలాంటి సామెతలు, సినిమాలకు కత్తెరపడనుంది. ఫిర్యాదు చేస్తే కఠిన శిక్షలు తప్పవు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy