కెమెరామెన్ అచ్యుతానంద సాహుతో దూరదర్శన్.. బ్యాక్ గ్రౌండ్ స్టోరీ

“అచ్యుత నంద సాహు..  మాజీ సైనికుడు..  ఓ కెమెరామన్…  ఓ సోదరుడు.. ఓ స్నేహితుడు..”

చత్తీస్ గఢ్ దంతె వాడ జిల్లాలో మావోయిస్టుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన దూరదర్శన్ కెమెరామన్ సాహు గురించి అడిగినప్పుడు అతడి సన్నిహితులు చెబుతున్న మాటలివి. కెమెరామన్ జాబ్ అవసరమా నీకు.. అంటే… నాకు డబ్బులతో పనిలేదు… చేసే పనిని, ఉద్యోగాన్నే ఇష్టపడతా అని చెప్పేవాడు అని గుర్తుచేసుకుంటున్నారు స్నేహితులు.

అచ్యుతానంద సాహు ఓ సీనియర్ వీడియో జర్నలిస్ట్. ఒడిశాలోని బోలంగిర్ జిల్లా ఘుసురముందా ఆయన సొంత గ్రామం. అచ్యుతానందన్ మొదట ఆర్మీలో పనిచేసి వాలంటరీగా రిటైర్ అయ్యారు. ఆ తర్వాత.. బిజూ పట్నాయక్ ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఒడిశాలో చేరాడు. టెలివిజన్ నెట్ వర్క్, ఫిలిం ప్రొడక్షన్ యాక్టివిటీస్ లో వెల్ ట్రెయిన్డ్ అండ్ టెక్నికల్ మ్యాన్ పవర్ ను తయారు చేసే ఈ సంస్థలో శిక్షణ పొందాడు. 2013లో దూరదర్శన్ లో చేరి ఢిల్లీకి వెళ్లాడు. అప్పటినుంచి… ఇప్పటివరకు దేశ, విదేశాల్లో ఎన్నో లైవ్ ఈవెంట్లు కవర్ చేశాడు.

చత్తీస్ గఢ్ లో ఎలక్షన్ కవరేజ్ కోసం దూరదర్శన్ ఓ టీమ్ ను ఏర్పాటుచేసింది. కెమెరామన్ సాహుతోపాటు.. దీరజ్ కుమార్, ఎంఎం శర్మ అందులో ఉన్నారు. ఎన్నికలను బహిష్కరిస్తున్నామంటూ మావోయిస్టులు చేసిన ప్రకటనతో.. అక్కడ ఎలక్షన్ యాత్ర నిర్వహించింది దూరదర్శన్ టీమ్. మంగళవారం ఉదయం దంతెవాడకు చేరుకుంది యూనిట్. చత్తీస్ గఢ్ దంతెవాడలో పర్యటిస్తున్నా అంటూ సహచరుడితో కలిసి ఓ సెల్ఫీ ఫొటోను పోస్ట్ చేశాడు సాహు. అక్కడి వాటర్ ఫాల్స్ విజువల్స్…. స్వచ్ఛ్ బస్తర్ అనే సింబాలిక్ స్టాచ్యూ ఫొటోను పోస్ట్ చేశాడు. ఇది జరిగిన కొద్ది సేపటికే.. జవాన్ల పెట్రోలింగ్ వాహనం లక్ష్యంగా మావోలు జరిపిన దాడిలో కెమెరామన్ సాహు ప్రాణాలు కోల్పోయాడు. ఆ ఫేస్ బుక్ పోస్టే.. సాహు చివరి పోస్ట్ అయ్యింది.

తనను కలిసిన ప్రతి ఒక్కరితోనూ సెల్ఫీ దిగడం ఏఎన్ సాహుకు అలవాటు. అవే ఫొటోలు షేర్ చేస్తూ.. ఏఎన్ సాహుతో ఉన్న అనుబంధాన్ని ఫేస్ బుక్ లో పంచుకుంటున్నారు అతడి సన్నిహితులు. “నక్సలైట్ చర్యకు కారణం రాజకీయ నాయకులే… దమ్ముంటే వెళ్లి నక్సల్స్ తో మాట్లాడాలి గానీ… మధ్యలో అమాయకుల ప్రాణాలు పోతున్నాయి” అంటూ ఆవేదన చెందుతున్నారు సన్నిహితులు.

“దూరదర్శన్ ఒక గొప్ప ఉద్యోగిని కోల్పోయింది. ప్రసార భారతి పరివారం ఆవేదనలో ఉంది.” అంటూ సంతాపం తెలుపుతున్నారు సంస్థల ఉద్యోగులు. తమ సంస్థకే ఆదర్శప్రాయంగా నిలిచిన కెమెరామన్ అచ్యుతానందన్ సాహును కోల్పోవడం బాధగా ఉందని BPFTIO సంస్థ అంటోంది.

రెండేళ్ల కిందటే సాహుకు పెళ్లయింది. “ప్రేమ గుడ్డితే కావొచ్చు.. కానీ పెళ్లి మాత్రం కళ్లు తెరిపించేది” అని ఓ సందర్భంలో ఫామిలీ ఫొటో షేర్ చేశాడు ఏఎన్ సాహు.

“అతడి కుటుంబానికి అండగా ఉంటాం. ఇలాంటి ప్రమాదకరమైన ప్రాంతాలకు వెళ్లి రిపోర్టింగ్ చేసే జర్నలిస్టుల ధైర్యానికి మేం సెల్యూట్ చేస్తున్నాం” అని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి రాజ్యవర్ధన్ రాథోడ్ స్పందించారు.

At Dantewada Chhatishgarh Election Yatra.

Posted by Achyuta Nanda Sahu on 2018 m. Spalis 29 d., Pirmadienis

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy