కేంద్రమంత్రి గోపీనాథ్ ముండే ఇక లేరు…

Gopinath_Munde_car_after_accident_june_3_360కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గోపీనాథ్ ముండే గుండెపోటుతో మరణించారు. ముంబయి వెళ్లేందుకు ఢిల్లీ విమానాశ్రయానికి వెళ్తుంతుండగా ఈ ఘటన జరిగింది. చికిత్స కోసం ఎయిమ్స్ కు తరలించినా లాభం లేకపోయింది.ఈరోజు ఉదయం 6.30 గంటలకు గోపీనాథ్ ముండే ఢిల్లీ నుంచి ముంబై వెళ్లేందుకు విమానాశ్రయానికి వెళుతుండగా రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ప్రమాదంలో ఆయనకు గాయాలు కాకపోయినా…ఆ హఠాత్పరిణామానికి ఆయనకు గుండెపోటు వచ్చింది. ముండే ప్రయాణిస్తున్న కారును వేరే కారు ఢీ కొట్టింది. దాంతో ఆయన ముందు సీటుకు గుద్దుకున్నారు. అప్పుడే ఆయనకు హార్ట్ ఎటాక్ వచ్చింది. వెంటనే ఆయన్ని చికిత్స నిమిత్తం ఎయిమ్స్ కు తరలించారు. ఎయిమ్స్ ట్రామా సెంటర్ కు తీసుకొచ్చేసరికి ఆయనకు ఊపిరి అందట్లేదని, రక్తపోటు ఏమాత్రం లేదని, నాడి కూడా కొట్టుకోవట్లేదని, గుండె ఆడట్లేదని ఎయిమ్స్ డాక్టర్లు చెబుతున్నారు. అందుకే వెంటనే పావుగంట పాటు సీపీఆర్ (కార్డియో పల్మనరీ రీససికేషన్) చేశామని తెలిపారు. తాము ఎంత తీవ్రంగా ప్రయత్నించినా ఆయన శరీరం స్పందించలేదని అందువల్ల ఉదయం 7.20 నిమిషాలకు మరణించినట్లు ధ్రువీకరించామని చెప్పారు. ప్రమాదం జరిగిన పది నిమిషాలలోనే ముండేను ఆయన పీఏ ఆస్పత్రికి తీసుకొచ్చారని అన్నారు. దక్షిణ ఢిల్లీలోని అరబిందో మార్గ్ సమీపంలో ప్రమాదం జరిగింది.
Gopinath_Munde_file_360గోపీనాథ్ ముండే గోపీనాథ్ పాండురంగ ముండే. స్వస్థలం మహారాష్ట పరాలీ. 1949 ఫిబ్రవరి 14 జన్మించారు. స్థానిక అంబెజోగాయ్ కాలేజీలో బీఏ కామర్స్ చేశారు ముండే. 1971లో బీజేపీలోకి ఎంట్రీ ఇచ్చారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ RSS లో కీలక పాత్ర పోషించారు అదే బ్యాక్ గ్రౌండ్ తో మహారాష్ట్ర భారతీయ జనతాపార్టీ యువజనసేన రాష్ట్ర శాఖ అధ్యక్షులుగా కూడా పనిచేశారు. ఆ తర్వాత మహారాష్ట్ర అసెంబ్లీకి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1992 నుంచి 95 వరకూ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షనేతగానూ.. 1995 నుంచి 1999 వరకు మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి గానూ పదవీబాధ్యతలు నిర్వహించారు. 2009లో లోక్ సభ ఎంపీగా ఎన్నికయ్యారు. 2014 సాధారణ ఎన్నికల్లో బీడ్ నియోజకవర్గనుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయనకు మోడీ తన మంత్రివర్గంలో చోటు కల్పించారు. ముండే ప్రస్తుతం కేంద్రంలో గ్రామీణాభివృద్ధి శాఖమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు .
ముండే మరణ వార్త తనను తీవ్రంగా కలచివేసిందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ముండే తనకు అత్యంత ఆప్తుడు, సహచరుడుని కొల్పోయానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేబినెట్ లో చేరి కేంద్రమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వారం రోజులకే ఇలా జరగడం తీవ్ర విషాదమని పేర్కొన్నారు. ముండే కుటుంబ సభ్యులకు మోడీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన కుటుంబసభ్యులకు పార్టీ అండగా ఉంటుందని నరేంద్ర మోడీ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. కేంద్రమంత్రి గోపినాథ్ ముండే మృతి పట్ల భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సంతాపాన్ని తెలిపారు.
గోపీనాథ్ ముండే మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు పలువురు బీజేపీ నేతలు. ముండే మరణం పార్టీకి తీరని లోటన్నారు.గోపీనాథ్ ముండే అకాల మరణం బీజేపీ నేతలను తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. ఇక ఆయన మరణవార్త విన్న కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
మధ్యాహ్నం 12 గంటలకు గోపీనాథ్ ముండే భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్ధం బీజేపీ కార్యాలయానికి తీసుకు వెళ్లనున్నట్లు బీజేపీ నేత నితీన్ గడ్కరీ తెలిపారు. రేపు ముండే పుట్టిన ఊరు లాతూరులో ఆయన అంత్యక్రియలు జరుగుతాయని గడ్కరీ తెలిపారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy