కేంద్ర మంత్రి కామెంట్స్ : కారు, బైక్ ఉన్నోళ్లు పేదోళ్లేం కాదు.. రేట్లు భరిస్తారు

పెట్రోల్‌ ధరల పెంపును సమర్ధించారు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కేజే ఆల్ఫాన్స్‌. కేరళలో పర్యటిస్తున్న ఆయన్ని పెట్రోల్ రేట్లు పెరగటంపై విలేకరులు ప్రశ్నించారు. దీంతో ఆయన ఘాటుగానే స్పందించారు. పెట్రోల్‌ ధరల పెంపుతో వచ్చే ఆదాయం అంతా కూడా పేదల సంక్షేమం కోసమే ఉపయోగించనున్నామని చెప్పారు. పెట్రోల్ ధరలను పెంచడం అనేది.. ప్రభుత్వం ముందుగా అనుకునే తీసుకున్న నిర్ణయమన్నారు. ప‌న్ను క‌ట్టే స్థోమత ఉన్న‌వాళ్ల మీదనే ప‌న్ను వ‌సూలు చేస్తున్న‌ట్లు మంత్రి తెలిపారు.

కార్లు, బైక్‌ ఉన్న‌వాళ్లే పెట్రోల్ కొంటారన్న మంత్రి.. వాళ్లేమీ ఆక‌లితో అల‌మ‌టించ‌డంలేదు కదా అని ఎదురు ప్రశ్నించారు. వాళ్లు ప‌న్ను క‌ట్టేందుకు సిద్దంగా ఉన్న‌వాళ్లే. వాళ్లు క‌చ్చితంగా ప‌న్ను క‌ట్టాల్సిందేనని స్పష్టం చేశారు. ఇదేమీ పెద్ద విషయం కాదన్నట్లు స్పందించారు. కారు, బైక్ కొంటున్నారు అంటే ఆర్థికంగా ఉన్నవారే కదా.. వాళ్లు వినియోగించే పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచితే తప్పేంటి అన్నారు.

మేం పన్నులు విధిస్తుంది పేదల జీవితాలను మార్చేందుకే అన్నారు. ఇలా వచ్చే ట్యాక్స్ లతో ఇళ్లు, టాయిలెట్లు, మౌళిక వ‌స‌తుల ఏర్పాటుకు వాడుతున్న‌ట్లు తెలిపారు. పేదల కనీస అవసరాలకు కావాల్సినవన్నీ తీరుతాయన్నారు. పెట్రోల్ తో వస్తున్న డబ్బంతా  ప్రభుత్వం దోచుకుంటున్న సొమ్ముకాదన్న మంత్రి.. ఎవరు చెల్లించగలరో వారికే పన్నులు విధిస్తున్నామన్నారు. పెట్రోల్‌ ధరల పెంపు, పన్నుల విధానాన్ని మంత్రి ఆల్ఫాన్స్ సమర్ధించారు.

మంత్రి ఆల్ఫాన్స్ కామెంట్స్ ట్విట్టర్ లో కలకలం రేపాయి. దోపిడీ చేయమని చట్టం చెబుతుందా అని కొందరు ప్రశ్నిస్తే.. కార్లు, బైక్స్ వదిలేసి పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ లో తిరుగుతాం రేట్లు తగ్గిస్తారా అని మరికొందరు ప్రశ్నించారు. ఓసారి మంత్రిగారు హోదాను పక్కనబెట్టి రోడ్డుపైకి వస్తే తెలుస్తుంది.. ఎందుకు కార్లు, బైక్ లు ప్రజలు కొంటున్నారో అని మరికొందరు ట్విట్లతో మంత్రిపై విరుచుకుపడ్డారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy