కేబినెట్ కూర్పులో కేసీఆర్ మార్క్..!

2తెలంగాణ తొలి సీఎంగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. కేసీఆర్ తో పాటు 11 మంది కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ ప్రముఖులు, వివిధ జేఏసీ నేతలు, టీఆర్ఎస్ కార్యకర్తలు హాజరయ్యారు. అయితే కేబినెట్ కూర్పులో కేసీఆర్ మార్క్ స్పష్టంగా కనిపిస్తుందని చెప్పవచ్చు. కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడైన నాయిని నరసింహారెడ్డికి సముచిత స్థానం కల్పించారు. ఆయనకు అసెంబ్లీ, మండలిలో సభ్యత్వం లేకపోయినా కేబినెట్ లో స్థానం కల్పించారు. త్వరలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయనకు ఎమ్మెల్సీగా గెలిపించన్నారు. ఇక హైదరాబాద్ లో టీఆర్ఎస్ పార్టీ కి బలమైన నేతగా పేరొందిన మహ్మద్ అలీఖాన్ కు కేబినెట్ లో చోటు కల్పించారు. మైనారిటీ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలనే యోచనలో అలీఖాన్ కు మంత్రి పదవి ఇచ్చారు కేసీఆర్. ప్రస్తుతం ఈయన ఎమ్మెల్సీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇక దళిత సామాజిక వర్గానికి ప్రాధాన్యతనిస్తూ టి.రాజయ్యకు అవకాశం కల్పించారు. అలీఖాన్, రాజయ్యలలో ఒకరికి డిప్యూటీ సీఎం పదవి దక్కే అవకాశం ఉంది. అలాగే కేసీఆర్ కు నమ్మకస్తుడు, అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించిన ఈటెల రాజేందర్ ను కూడా కేబినెట్ లోకి తీసుకున్నారు కేసీఆర్. గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న పోచారం శ్రీనివాస్ రెడ్డికి కూడా కేబినెట్ స్థానం కల్పించారు.

ఇక రెడ్డి సామాజిక వర్గానికి ప్రాధాన్యతనిస్తూ.. నలుగురిని కేబినెట్ లోకి తీసుకున్నారు. నాయిని, పోచారం లతో పాటు మహేందర్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డిలకు కేబినెట్ స్థానం కల్పించారు. ఇక కేసీఆర్ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో బలమైన నేత అయిన హరీశ్ రావుకు కేబినెట్ స్థానం కల్పించారు. అలాగే కేసీఆర్ తన కుమారుడు కేటీఆర్ కు కూడా కేబినెట్ లో స్థానం కల్పించారు. అలాగే సికింద్రాబాద్ నుంచి గెలిచిన పద్మారావుకు కూడా కేబినెట్ పదవి కల్పించారు. అలాగే కేసీఆర్ తనను నమ్మి టీడీపీని వదిలి వచ్చిన జోగు రామన్నను కూడా కేబినెట్ లోకి తీసుకున్నారు. అయితే మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాలకు మంత్రి పదవులు దక్కలేదు. మంత్రి వర్గ విస్తరణలో ఈ రెండు జిల్లాల నేతలకు అవకాశం రానుంది. మహబూబ్ నగర్ నుంచి జూపల్లి కృష్ణారావుకు అవకాశం వస్తుందని భావించినా ప్రస్తుతం అది కుదరలేదు. త్వరలోనే జూపల్లికి మంత్రి పదవి ఇస్తారని చెబుతున్నారు. మొత్తం మీద చూస్తే తనకు నమ్మకస్తులు, విధేయులకు కేబినెట్ పదవులు కల్పించారు కేసీఆర్.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy