కేరళలో వరద బీభత్సం : 54 మందిని కాపాడిన ఆర్మీ

కేరళలో వరద బీభత్సం కొనసాగుతోంది. మృతుల సంఖ్య 29కు చేరింది. శనివారం (ఆగస్టు-11) మున్నార్‌ లోని ప్లమ్‌ జూడీ రిసార్టులో చిక్కుకున్న 54 మంది పర్యాటకులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు ఆర్మీ, NDRF సిబ్బంది. పాలక్కాడ్, వయనాద్, కొజిక్కోడ్ జిల్లాల్లో కొందరు వరద ప్రవాహంలో కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది. చాలా జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తం అయ్యంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్రంలోని జలశయాలన్నీ ప్రమాదకరస్థాయికి చేరాయి. చెరుథోని డ్యామ్ ఐదు గేట్లు ఎత్తారు. చెరుథోని పట్టణ ప్రజలను అధికారులు ఖాళీ చేయించారు. నీటి ఉధృతితో ఇడుక్కి డ్యామ్ మరో మూడు గేట్లు ఎత్తారు. పాలక్కాడ్ జలాశయంలోకి భారీగా నీరు చేరుతోంది. ఇరువని, ఎంగప్పుజ, చెర్పుజ, మరిప్పుజ, ముఠప్పన్ నదులు పొంగి పొర్లుతున్నాయి. పెరియార్ నదిలో నీటిమట్టం వేగంగా పెరుగుతుండంతో లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఇడుక్కి రిజర్వాయర్ నుంచి మరింత నీటిని విడుదల చేసే అవకాశం ఉండటంతో ఇడుక్కితో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించింది.

కొన్ని జిల్లాల్లో ఊళ్లకు ఊళ్లు మునిగి రవాణా వ్యవస్థ స్తంభించింది. చాలాచోట్ల పంట పొలాలు నీట మునిగాయి. కానూర్ లో వరదల ధాటికి ఇళ్లు కూలిపోయాయి. కర్ణాటక సరిహద్దులోని తూర్పు కొండ ప్రాంతాల్లో కుండపోతగా వర్షం పడుతోంది. కొండచరియలు విరిగి పడుతుండటంతో స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. NDRF దళాలు, వైమానిక, నావిక దళాలు రంగంలోకి దిగి లోతట్టు ప్రాంతాలు, వరద నీటిలో చిక్కుకున్న వారిని రక్షిస్తున్నాయి. హైలికాప్టర్లతో రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ చేస్తున్నాయి.

వర్షాలతో 54 వేల మంది నిర్వాసితులయ్యారు. వారిలో 53 వేల 501 మందిని పునరావాస కేంద్రాలకు తరలించామని అధికారులు తెలిపారు. మరోవైపు వర్షాల ధాటికి తీవ్రంగా దెబ్బతిన్న 7 ఉత్తర జిల్లాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు అదనంగా మరో 5 ఆర్మీ బృందాలను రంగంలోకి దింపారు. వరదలపై మరోమారు అధికారులతో సమీక్ష చేశారు CM పినరయి విజయన్. మరో రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది కేరళ ప్రభుత్వం. వరదల ధాటికి రోడ్లు, రైల్వే ట్రాక్ లు కొట్టుకుపోయాయి. పల్లివాసన్ లోని రిసార్టులో 60 మంది చిక్కుకున్నారు. వారిలో 20 మంది విదేశీ టూరిస్టులున్నారు. రెండురోజులుగా రిసార్టులోనే చిక్కుకున్న టూరిస్టులను హెలీకాప్టర్ల సాయంతో కాపాడే ప్రయత్నం చేస్తున్నారు ఆర్మీ, NDRF సిబ్బంది. ఇక కేరళ వెళ్లొద్దంటూ.. తమ టూరిస్టులకు ఆదేశాలు ఇచ్చింది అమెరికా.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy