కేసీఆర్‌ బాటలోనే మోడీ

modi-kcrముస్లిం యువతుల కోసం షాదీ షగున్‌  

తెలంగాణ బాటలోనే నడుస్తున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. కేసీఆర్‌ ప్రభుత్వం ముస్లిం యువతుల కోసం అమలు చేస్తున్న షాదీ ముబారక్‌ పథకం తరహాలోనే ఒక పథకం ప్రవేశపెట్టారు మోడీ. దీని పేరు షాదీ షగున్‌ (శుభ కల్యాణం). తెలంగాణలో షాదీ ముబారక్‌ పథకంలో పేద ముస్లిం యువతుల పెళ్లి ఖర్చుల కోసం రూ.51 వేలు అందజేస్తున్నారు. రాష్ట్రంలో 2014 అక్టోబరు 2న ఈ పథకం ప్రారంభమైంది. వార్షికాదాయం రూ.2 లక్షలు మించని ముస్లిం కుటుంబాలకు ఈ ఆర్థిక సహాయం అందుతోంది. ఇదే తరహాలో ఉన్నత విద్య అభ్యసించేలా ముస్లిం యువతులను ప్రోత్సహించేందుకూ మోడీ ప్రభుత్వం నజరానా ప్రకటించింది. పట్టభద్రులైన ముస్లిం యువతులకు పెళ్లి కానుక అందించనుంది. ఇది కూడా రూ.51 వేలు కావడం విశేషం. పట్టభద్రులు కావడంతో పాటు అంతకుముందు మౌలానా అజాద్‌ ఎడ్యుకేషనల్‌ ఫౌండేషన్‌ (ఎంఏఈఎఫ్‌) స్కాలర్‌ షిప్ అందుకుని ఉంటే కూడా ఈ నజరానా అందుతుంది.

అలాగే 9, 10 తరగతులు చదివే ముస్లిం బాలికలు ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున ఇవ్వాలని జాతీయ మైనారిటీ కమిషన్‌ నేతృత్వంలో పని చేసే ఎంఏఈఎఫ్‌ నిర్ణయించింది. ‘ట్రిపుల్‌ తలాక్‌ పద్ధతికి వ్యతిరేకంగా చేపట్టిన చర్యలతో మోడీ ప్రభుత్వానికి ముస్లిం మహిళల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించింది. యూపీ ఎన్నికల్లో ముస్లిం మహిళలు పెద్ద ఎత్తున బీజేపీకి ఓటు వేశారు. మరో రెండేళ్లలో సార్వత్రిక ఎన్నికలున్న నేపథ్యంలో వారి మద్దతును మరింత కూడగట్టేందుకు షాదీ షగున్‌ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు పరిశీలకులు భావిస్తున్నారు. ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి సుమిత్‌ బోస్‌ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ సిఫారసు మేరకు ఈ నిర్ణయం తీసుకుంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy