కొట్టుకున్నారు.. కారప్పొడి చల్లుకుని కుర్చీలు విరగ్గొట్టారు.. శ్రీలంక పార్లమెంట్ లో రభస

కొలంబో : ప్రజాప్రతినిధులు విచక్షణ కోల్పోయారు. వీధి రౌడీల్లా ఒకరినొకరు కొట్టుకున్నారు. కుర్చీలు విసురుకున్నారు. కారప్పొడి చల్లుకున్నారు. పార్లమెంటునే యుద్ధభూమిలా మార్చేశారు. రచ్చ రచ్చ చేసేశారు. ఈ సీన్ కొలంబోలోని శ్రీలంక పార్లమెంట్ లో నవంబర్ 16 శుక్రవారం సాయంత్రం జరిగింది.

బలపరీక్షలో కొత్త ప్రధానమంత్రి రాజపక్సే ఓడిపోయిన తర్వాత… శ్రీలంక పార్లమెంట్ శుక్రవారం రెండోరోజు సమావేశమైంది. గురువారం మొదలైన ఘర్షణ శుక్రవారం కూడా కొనసాగింది. రాజపక్సే బలపరీక్షలో ఓడిపోయారని… వెంటనే ఎన్నికలు నిర్వహించాలంటూ తాజా మాజీ ప్రధాని విక్రమసింఘే, అతడి మద్దతుదారులైన ఎంపీలు డిమాండ్ చేశారు. దీనిపై ఓటింగ్ జరిపేందుకు స్పీకర్ జయసూరియ అంగీకరించిన సందర్భంగా చెలరేగిన  వాగ్వాదం… కొట్టుకునేవారకు వెళ్లింది.

రెండు వర్గాలు స్పీకర్ పోడియం ముందుకు వచ్చాయి. ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకున్నారు. గల్లాలు పట్టుకుని నెట్టుకున్నారు. కత్తులు చూపిస్తూ స్పీకర్‌ పైన కారప్పొడి చల్లారు. కుర్చీలు విరగ్గొట్టారు. నిండు సభలో రచ్చ చేశారు. పార్లమెంట్ సెక్యూరిటీ సిబ్బంది కూడా కొద్దిసేపు వారిని కంట్రోల్ చేయలేకపోయారు.

శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాలన సిరిసేన అక్టోబర్ నెలలో విక్రమ్‌ సింఘేని ప్రధాని పదవి నుంచి తప్పించి రాజపక్సేను ప్రధానిగా నియమించారు. ఉన్నపళంగా పార్లమెంట్‌ను రద్దుచేశారు. తనను పదవి నుంచి తొలగించే అధికారం అధ్యక్షుడికి లేదని, పార్లమెంట్‌ లోనే బలం నిరూపించుకుంటానని విక్రమసింఘే కోర్టుకెక్కారు. బుధవారం పార్లమెంట్‌ లో బలపరీక్ష నిర్వహించారు. 225 మంది సభ్యులున్న పార్లమెంట్‌ లో రాజపక్సెకు మద్దతుగా 122 మంది ఎంపీలు ఓటేశారు. ఆ ఫలితాన్ని అధ్యక్షుడు సిరిసేన ఆమోదించకపోవడంతో గురువారం మళ్లీ ఓటింగ్ నిర్వహించగా బలపరీక్షలో రాజపక్సె ఓడిపోయారు. గురువారం నాడు కూడా పార్లమెంట్ లో గొడవ జరిగింది. సిరిసేన, రాజపక్సే మద్దతుదారులైన కొందరు ఎంపీలు స్పీకర్‌ను చుట్టుముట్టి దాడికి యత్నించారు. విక్రమ్‌సింఘే పార్టీకి చెందిన సభ్యులు రక్షణగా నిలిచారు. ఒక సభ్యుడు స్పీకర్‌ మైక్‌ను విరగ్గొట్టారు. డస్ట్‌బిన్‌ను, పుస్తకాలను స్పీకర్ పైకి విసిరేశారు. శుక్రవారం పార్లమెంట్ లో మరింత హీనంగా గొడవ జరిగింది. ప్రస్తుతం శ్రీలంకలో ప్రధానిగా ఎవరూ లేరని… కేబినెట్ రద్దయిందని స్పీకర్ చెప్పారు.

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy