కొత్త బట్టలు కొనిస్తానంటూ నమ్మించి నరికాడు.. తండ్రి మనోహరా చారి అరెస్ట్

హైదరాబాద్ : ఎర్రగడ్డ గోకుల్ థియేటర్ దగ్గర తన కూతురు మాధవి, ఆమె భర్త సందీప్ లను నడిరోడ్డుపై నరికి చంపేందుకు ప్రయత్నించాడు తండ్రి మనోహరా చారి. మిర్యాలగూడలో ప్రణయ్ ను హత్య చేసిన మారుతీరావు లాగే… హైదరాబాద్ లో నేరుగా ఇద్దరిని టార్గెట్ చేసి చంపటానికి ఘాతుకానికి ఒడిగట్టాడు అమ్మాయి తండ్రి. కన్నకూతురు, ఆమె భర్తను మంచి మాటలతో నమ్మించి చంపేందుకు ప్రయత్నించాడు.

కొత్త బట్టలు కొనిస్తాను రామ్మా అని అమ్మాయికి ఫోన్ చేసి.. గోకుల్ థియేటర్ దగ్గరకు రప్పించాడు తండ్రి మనోహరా చారి. తండ్రి మాటలు విని.. భర్తతో కలిసి మాధవి అక్కడికి టూవీలర్ పై వచ్చింది. తన దగ్గరున్న బ్యాంగ్ లో నుంచి కొబ్బరి బొండాలు నరికే కొడవలిని తీసి.. ముందుగా సందీప్ పై రెండు వేట్లు వేశాడు. కూతురు మాధవి అడ్డుకుని.. తండ్రిని పక్కకు లాగడంతో.. ఇద్దరూ కిందపడ్డాడు. లేచి వెంటనే కూతురుపై వేటువేశాడు. ఆమె చేతులు అడ్డుపెట్టడంతో.. చేయిని నరికేశాడు. ఆ తర్వాతపై చెవి, దవడ భాగంలోనూ బలమైన వేటు వేశాడు. నరుకుతూనే మాధవిని హెచ్చరించాడు. అప్పటికే కొడవలి గాయాలతో ఉన్న సందీప్ ఏమాత్రం ప్రతిఘటించలేకపోయాడు. ఆ తర్వాత జనం పోగవ్వడంతో.. పారిపోయాడు.

కులాంతర వివాహమే ఈ హత్యాయత్నానికి కారణమని తెలుస్తోంది. మాధవి, సందీప్ లు ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. మాధవి గోల్డ్ స్మిత్ – బీసీ సామాజికవర్ చెందిన యువతి కాగా, సందీప్ ఎస్సీ సామాజికవర్గానికి చెందిన యువకుడు. మాధవిని అతని మేనమామకు ఇచ్చి పెళ్లి చేయాలని ఆమె తల్లిదండ్రులు భావించారు. అయితే మేనమామను కాదని… తాను ప్రేమించిన సందీప్ ను ఇటీవల గుడిలో పెళ్లిచేసుకుంది మాధవి.

కూతురు తన పరువు తీసేసిందనే ఆవేశం, కోపంతో తండ్రి మనోహరా చారి వారిని చంపాలని నిర్ణయించుకున్నాడు. మారుతీరావు ఉదంతం సంచలనం రేపడంతో.. తానూ అదే దారిలో వెళ్లాలని అనుకుని ఉండొచ్చు. బామ్మర్ది ఇంట్లో ఉంటూ.. ఇద్దరినీ చంపేందుకు ప్లాన్ వేశాడు. మీకు కొత్త బట్టలు పెడతాను… రావాలంటూ ఇద్దరినీ నమ్మించి, పిలిపించాడు. తండ్రి దారుణ ఆలోచనను గుర్తించలేని కొత్త దంపతులిద్దరూ.. గోకుల్ థియేటర్ వద్దకు వచ్చారు.  స్కూటీపై ఆయన కోసం ఎదురు చూశారు. బ్యాగ్ ఓపెన్ చేస్తుంటే.. కొత్త బట్టలు తీస్తున్నాడనే అనుకున్నారు ఇద్దరూ. కానీ, ఊహించని రీతిలో కొడవలితో ఎటాక్ చేశాడు ఆ తండ్రి.

ప్రస్తుతం తీవ్రమైన గాయాలతో ఇద్దరూ హాస్పిటల్ లో ఉన్నారు. వీరిలో మాధవి పరిస్థితి క్రిటికల్ గా ఉంది. మెడ దగ్గర కొడవలి వేటు పడటంతో… మెదడుకు సంబంధించిన నరాలు దెబ్బతిన్నాయని.. ఎడమ చేయికి గాయం కావడంతో… రక్తం బాగా పోయిందని యశోద డాక్టర్లు చెప్పారు. అటు సందీప్ చికిత్స పొందుతున్న నీలిమ హాస్పిటల్ ముందు.. ఎస్సీ సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. పోలీసులు బాధితుల నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. ప్రాథమిక దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు మనోహరా చారిని అరెస్ట్ చేశారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy