కొత్త వలస బిల్లు: ఇంగ్లిష్ వస్తేనే అమెరికాకు

trumpఅమెరికాలో ఇకపై వలస విధానం మారబోతోంది.  అమెరికాలో గ్రీన్ కార్డు కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఇండియన్లతో పాటు ఇతర విదేశీయులకు..ఇన్నాళ్లూ గ్రీన్‌కార్డుల జారీకి అనుసరించిన లాటరీ విధానానికి ట్రంప్‌ సర్కారు స్వస్తి పలకనుంది. ఇంగ్లిష్ లో మంచి పట్టు, ఉన్నత విద్య,  ఎక్కువ  సాలరీఅ, వయసు ప్రాతిపదికగా ఇకపై కార్డులు జారీ చేయనున్నారు. గ్రీన్‌కార్డుల సంఖ్యను గణనీయంగా తగ్గించే లక్ష్యంతో ‘రైజ్‌’(రిఫార్మింగ్‌ అమెరికన్‌ ఇమిగ్రేషన్‌ ఫర్‌ స్ట్రాంగ్‌ ఎంప్లాయ్‌మెంట్‌) బిల్లును రూపొందించారు. ప్రతిభ ప్రాతిపదికన గ్రీన్‌కార్డులు జారీ చేయాలంటూ సెనెటర్లు టామ్‌ కాటన్, డేవిడ్‌ పెర్‌డ్యూ రూపొందించిన ఈ బిల్లుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాజాగా ఆమోదం తెలిపారు.

వాస్తవానికి వలసల్ని తగ్గించడమే బిల్లు ఉద్దేశమైనా భారత్‌ వంటి దేశాల నుంచి వచ్చే ఉన్నత విద్యావంతులు, ఐటీ ఉద్యోగులకు ఈ బిల్లు మేలు చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు. బిల్లులోని ప్రతిపాదించిన అంశాల ప్రకారం చూస్తే భారతీయులే ముందుంటారని, దీంతో సులువుగా గ్రీన్‌కార్డులు దక్కుతాయంటున్నారు. ప్రతిపాదిత బిల్లు ఉభయసభల్లో గట్టెక్కి చట్టం అమల్లోకి వస్తే లాటరీకి స్వస్తి పలికి ప్రతిభ ఆధారంగా గ్రీన్‌కార్డులు జారీ చేస్తారు. అమెరికాలో మాస్టర్స్‌ డిగ్రీ, 26–30 ఏళ్ల మధ్య వయసు, ఆంగ్లంలో మంచి ప్రావీణ్యం, మంచి వేతనం ఉంటే గ్రీన్‌కార్డులు పొందడం తేలిక కానుంది. ప్రస్తుతం అమెరికా ఏడాదికి 10 లక్షల గ్రీన్‌కార్డులు జారీ చేస్తుండగా.. పదేళ్లలో సగానికి తగ్గించేలా ఈ బిల్లును రూపొందించారు.

‘రైజ్‌ చట్టం వల్ల అమెరికాలో పేదరికం తగ్గడమేగాక, జీతాలు పెరుగుతాయి. బిలియన్‌ డాలర్ల పన్నులు ఆదా అవుతాయి’ అని ట్రంప్‌ తెలిపారు. గత 50 ఏళ్ల అమెరికా వలస విధాన ప్రక్రియలో ఇది కీలకమైన సంస్కరణగా నిలిచిపోతుందన్నారు. గ్రీన్‌కార్డుల జారీలో తక్కువ నైపుణ్యమున్న వారికి అవకాశం కల్పిస్తున్న ప్రస్తుత విధానానికి రైజ్‌ చట్టం మంచి ప్రత్యామ్నాయమన్నారు. అమెరికన్‌ ఉద్యోగులు చెదిరిపోకుండా ఈ బిల్లు రక్షణ కల్పిస్తుందన్నారు. నైపుణ్యం లేని వలస ఉద్యోగులు తగ్గడం ద్వారా అమెరికన్ల వేతనాలు పెరుగుతాయన్నారు. ప్రస్తుత వలస విధానం అమెరికన్‌ ప్రజలు, ఉద్యోగులకు అనుకూలంగా లేదని… కొత్త చట్టంతో 21వ శతాబ్దంలో అమెరికా పోటీతత్వాన్ని, అమెరికాతో దేశ పౌరులకు ఉన్న దృఢమైన బంధాన్ని పునరుద్ధరిస్తుందన్నారు. ప్రతీ ఏడాది 10 లక్షల మందికి గ్రీన్‌కార్డుల్ని జారీచేస్తున్నట్లు తెలిపారు. అమెరికాలోని మోంటానా రాష్ట్ర జనాభాతో అది సమానం. అయితే దురదృష్టవశాత్తూ ఇప్పటిదాకా ఆంగ్లంపై పట్టు, ఉద్యోగ నైపుణ్యం, మంచి వేతనం ప్రాతిపదికగా గ్రీన్‌కార్డుల కేటాయింపు జరగడం లేదు. ఇకపై అలా ఉండదని తెలిపారు ట్రంప్‌.

రైజ్‌ బిల్లు చట్టరూపమైతే.. భారతీయులకు లాభమే. ప్రస్తుతం 3 నుంచి 3.5 లక్షల మంది సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు హెచ్‌–1బీ వీసాపై అమెరికాలో ఉన్నారు. 2016లో మొత్తం 1,26,692 మంది ఇండియన్లు హెచ్‌–1బీ పొందడమో, పొడిగించుకోవడమో చేశారని అమెరికా అధికారిక లెక్కలు చెబుతున్నాయి. గతేడాది అమెరికా జారీ చేసిన హెచ్‌–1బీ వీసాల్లో భారతీయులకే ఏకంగా 72 శాతం దక్కాయి. వీరిలో అత్యధికులు అమెరికాలో స్థిరపడాలనే కోరుకుంటారు. గ్రీన్‌కార్డులకు దరఖాస్తు చేస్తే రైజ్‌ విధానంలో భారతీయులకు పాయింట్లు అధికంగా వచ్చే అవకాశాలుంటాయి.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy