కొత్త శకానికి నాంది : MRO ఆఫీసుల్లోనే రిజిస్ట్రేషన్స్

REGISTRATIONS MROతెలంగాణ రాష్ట్రం కొత్త శకానికి నాంది పలికింది. రిజిస్ట్రేషన్ విధానంలో కొత్త మార్పుకి శ్రీకారం చుట్టింది. మే 7వ తేదీ నుంచి MRO (మండల రెవెన్యూ ఆఫీస్) లో స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ప్రస్తుతం స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖకే పరిమితమైన రిజిస్ట్రేషన్ల బాధ్యత, అధికారాలు.. ఇక నుంచి రెవెన్యూ శాఖకు కూడా రానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 443 మండల కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియను మొదలుపెట్టడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. 7వ తేదీన ఐదు కార్యాలయాల్లో ప్రయోగాత్మకంగా రిజిస్ట్రేషన్లు ప్రారంభించనున్నారు. తొలి విడతగా సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్, కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్నది. రంగారెడ్డి జిల్లా కొత్తూరు, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్, ఖమ్మం జిల్లా కూసుమంచి మండలాలను ఎంపిక చేశారు.

ఈ మూడు చోట్ల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నందున ఆయా కార్యాలయాలకు సమగ్ర భూముల వివరాలున్న ధరణి వెబ్‌ సైట్‌ ను మాత్రమే అనుసంధానం చేయాలని నిర్ణయించారు. రెండో దశలో మే 19 నుంచి మరో 30 కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రారంభిస్తారు. జూన్ 6వ తేదీ నుంచి అన్ని మండల రెవెన్యూ కార్యాలయాలకు విస్తరిస్తారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు అవసరమైన శిక్షణ, ఏర్పాట్లను పూర్తిచేయడానికి 30 మంది నోడల్ అధికారులను నియమిస్తూ.. సీసీఎల్‌ఏ డైరెక్టర్ వాకాటి కరుణ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు చెందిన జిల్లా రిజిస్ట్రార్లు, డీఐజీలు నోడల్ అధికారులుగా వ్యవహరించనున్నారు.

రిజిస్ట్రేషన్ల శాఖ, రెవెన్యూ అధికారుల మధ్య సమన్వయకర్తలుగా జిల్లా కలెక్టర్లు వ్యవహరిస్తారు. మండల కార్యాలయాల్లో ఏర్పాట్లను కలెక్టర్లు పర్యవేక్షించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 584 మండల రెవెన్యూ కార్యాలయాలు ఉండగా 443 కార్యాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు చేపట్టనున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. వాటిలోనే అన్ని ప్రాంతాల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఇకపై 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు కొనసాగించాలని నిర్ణయించిన్నప్పటికీ పరిధి తగ్గుతుంది. ప్రస్తుతం మూడు లేదా నాలుగు మండలాలకు కలిపి ఒక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఉన్నది. ఇక నుంచి అవి ఒక మండలానికే పరిమితం కానున్నాయి. మిగతా రెవెన్యూ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు నిర్వహిస్తారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలున్న మండలాలను మినహాయించి మిగతా మండలాల్లో రెవెన్యూ అధికారులకు రిజిస్ట్రేషన్ అధికారాలు ఇస్తున్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy