కోటిమందిని వెనక్కి పంపే పనిలో ట్రంప్

usaఅమెరికాలో అక్రమంగా ఉంటున్న కోటిమందికి పైగా పరాయిదేశాలవాళ్ళను వెనక్కు పంపే కార్యక్రమం వేగం పెరిగింది. ఈ కార్యక్రమానికి అమలు చేసేందుకు అమెరికా సర్కార్ రెడీ అయింది. హోమ్ లాండ్ సెక్యూరిటీ డిపార్ట్ మెంట్ జారీ చేసిన తాజా  ఆర్డర్లతో ఈ గెంటివేత జోరు మరింత పెరగబోతోంది.

అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ పాలసీని అమలు చేసే క్రమంలో హోమ్ లాండ్ సెక్యూరిటీ డిపార్ట్ మెంట్ తాజాగా కొన్ని మెమోలు జారీ చేసింది. కస్టమ్స్ ఆఫీసర్లకు, బోర్డర్ ప్రొటెక్షన్ ఆఫీసర్లకు లెక్కలేనన్ని అధికారాలు ఈ మెమోల ద్వారా వచ్చాయి. అక్రమంగా ఉంటున్నవాళ్ళను గుర్తుపట్టి, విచారణ జరిపి, దేశం నుంచి గెంటేసే పని ఈ మెమోలతో చాలా సులువైపోతుంది.

ఈ మెమోల ప్రకారం….దేశంలోకి ఎవరైనా సరే, సరైన డాక్యుమెంట్లు లేకుండా ప్రవేశించడానికి ప్రయత్నం చేసినట్టయితే…..వెంటనే వాళ్ళను అరెస్టు చేసి కేసు ముగిసేవరకు జైల్లోనే ఉంచే వీలుంది. దీనికి లోకల్ పోలీసుల సాయం తీసుకుంటారు. అమెరికా బోర్డర్ వెంబడి కాపలా కోసం 10 వేలమంది కొత్త ఏజెంట్లను నియమించాలని కూడా ఒక మెమోలో ఉంది. అలాగే, బోర్డర్ దగ్గర కాపలాకు మరో 5 వేలమందిని రిక్రూట్ చేసుకుంటారు.ఇక అక్రమంగా ఉంటున్నారని ఎవరి విషయంలోనైనా అనుమానం వస్తే, వాళ్ళను అరెస్టు చేసి దేశంనుంచి పంపించడానికి కూడా ఆఫీసర్లకు పూర్తి అధికారం ఉంటుందన్నమాట

అమెరికాలో ఉంటున్న వారెవరైనా వలసల చట్టంలోనిఓ ఒక్కక్లాజును పాటించకపోయినట్లుగా అనిపిస్తే,, అలాంటి వారిని కూడా అరెస్టు చేసి వాళ్ళ సొంత దేశానికి వెనక్కు పంపించే అధికారం కూడా హోమ్ లాండ్ సెక్యూరిటీ ఆఫీసర్లకు ఉంటుంది. ఎవరైనా అక్రమంగా ఉంటున్నారని తెలిసినా, వాళ్ళను జైల్లో పెట్టే పద్ధతి ఇప్పుడు లేదు. అరెస్టు చేసి, వెంటనే వదిలేసేవారు.  కోర్టులో కేసు వేసి, విచారణ సమయంలో రమ్మని చెప్పేవారు. ఇప్పుడలా కాకుండా వాళ్ళను అరెస్టు చేసి జైల్లో పెడతారు. వాళ్ళ కేసు విచారణ పూర్తయ్యేవరకు జైల్లో ఉండాల్సిందే.

ఇక మరో మెమో మరింత వింతగా ఉంది. ఇంతకుముందు మెక్సికో నుంచి అక్రమంగా అమెరికాలో ప్రవేశించినవాళ్ళను మాత్రమే తిరిగి మెక్సికోకు పంపించేసేవారు. ఇప్పుడలా కాదు, వాళ్ళు మెక్సికన్లు అయినా కాకపోయినా వేరే సౌత్ అమెరికన్ దేశాలవాళ్ళయినా సరే, మెక్సికోకే పంపేయాలని తాజా మెమోలో ఉంది. అలాగే మెక్సికోతో ఉన్న సరిహద్దు ఏరియాలో గోడ కట్టడాన్ని కంటిన్యూ చేయాలని, మరింత దూరం వరకు గోడ ఉండాలని మరో తాజా మెమోలో ఉంది.

కొత్త మెమోల అమలుతో లక్షలాదిమంది అరెస్టయ్యే అవకాశం ఉంది కనుక, జైళ్ళ సంఖ్యను బాగా పెంచాలని కూడా నిర్ణయించారు. చిన్నప్పుడే అమెరికాలో అడుగుపెట్టి, ఇప్పటికీ ఎలాంటి వీసా లేకుండా ఉన్న 7 లక్షల 50  వేలమందికి మాత్రం ప్రస్తుతానికి రిలీఫ్ ఉంటుంది. 2012 లో అప్పటి ప్రెసిడెంట్ ఒబామా ఇచ్చిన ప్రొటెక్షన్ ఆర్డర్ ఈ ఏడున్నరలక్షలమందికీ ఆసరాగా నిలిచింది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy