కోడ్ ఉల్లంఘించినట్లు రుజువైతే ఆ ఎన్నిక రద్దవుతుంది: CEO

రాష్ట్రంలో నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది. గడువు దగ్గర పడుతుండటంతో.. ముహూర్తాలు చూసుకొని.. రాజకీయ పార్టీలతో పాటు, రెబల్స్, ఇండిపెండెంట్లుగా నామినేషన్లు వేస్తున్నారు నేతలు. ఇవాళ (బుధవారం) ఒక్క రోజే 132నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ నెల 12న 38..  13న 39..  14న 331 మంది నామినేషన్ వేశారు. ఇక ఇప్పటివరకు ఉన్న ఓటర్ల వివరాలను తెలిపింది ఈసీ. కోటీ 39లక్షల 84వేల 412 మంది పురుషులు, కోటీ 37లక్షల 41వేల 175మంది మహిళా ఓటర్లు ఉన్నట్లు చెప్పారు. మొత్తం 2కోట్ల 77లక్షల 28వేల 226మంది ఓటర్లు ఉన్నారని ప్రకటించారు.

ఎన్నికల ప్రక్రియలో భాగంగా పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది ఎలక్షన్ కమిషన్. అభ్యర్థుల ప్రచార ఖర్చుపై మరో నిబంధన విధించింది ఈసీ. అభ్యర్థి ప్రచార ఖర్చులు చేసేటప్పుడు.. పదివేలలోపు మాత్రమే క్యాష్ ఇవ్వాలని.. మిగతా అమౌంటు చెక్కురూపంలో చెల్లించాలంటూ ఆదేశాలిచ్చింది. ఈ ఆదేశాలను కచ్చితంగా అమలు చేయాల్సిందేనన్నారు సీఈవో రజత్ కుమార్. మరోవైపు కోడ్ ఉల్లంఘనల్లో భాగంగా.. ఎలక్షన్ కమిషన్ జారీచేసే నోటీసులను కొందరు అభ్యర్థులు చాలా లైటు తీసుకున్నట్లు కనిపిస్తుందన్నారు. కోడ్ ఉల్లంఘించినట్లు కోర్టులో రుజువైతే ఆ ఎన్నికే రద్దవుతుందన్న విషయం గుర్తించుకోవాలన్నారు.

ఇక ఎన్నికల నిర్వహణ సజావుగా సాగేందుకు 53మంది పరిశీలకులు అందుబాటులో ఉంచుతోంది ఈసీ. అభ్యర్థుల నిధుల ఖర్చుపై ఈ పరిశీలకులు ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. ఒక వీడియో ఫోటోగ్రాఫర్, అకౌంట్ టీం నియోజకవర్గానికి ఇద్దరు లేదా ముగ్గురు పరిశీలకులు ఉండనున్నారు. ఇక ఇప్పటివరకు 69 కోట్ల 86 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. 6కోట్ల 66లక్షల విలువ చేసే మద్యం.. 5కోట్ల 67లక్షల విలువ చేసే  గోల్డ్, గంజాయి, గుట్కా సీజ్ చేశారు.

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ప్రభావం ఉన్నంతగా తెలంగాణలో లేదని రజత్‌కుమార్‌ చెప్పారు. ఎన్నికల ప్రచారం చేస్తున్న నేతలపై మావోయిస్టులు నిఘా పెట్టినట్టు తెలుస్తోందని, అభ్యర్థులకు స్థానిక పోలీసులు భద్రత కల్పించాల్సి ఉంటుందని తెలిపారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy