కోమటిరెడ్డి, సంపత్‌లకు హైకోర్టులో ఊరట

high-court-hyderabadఅసెంబ్లీ నుంచి బహిష్కరణకు గురైన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌లకు హైకోర్టులో ఊరట లభించింది. వారు ప్రాతినిధ్యం వహిస్తున్న నల్గొండ, అలంపూర్‌ నియోజకవర్గాలు ఖాళీ అయినట్లుగా ప్రకటించిన వాటిలో ఆరు వారాల పాటు ఎన్నికల ప్రక్రియ చేపట్టరాదని  కేంద్ర ఎన్నికల కమిషన్ ను హైకోర్టు ఆదేశించింది. అసెంబ్లీలో ఈ నెల 12న గవర్నర్‌ ప్రసంగానికి సంబంధించిన మొత్తం ఒరిజినల్‌ వీడియో ఫుటేజీని 22న సీల్డ్‌ కవర్‌లో అందజేయాలని అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించింది. మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని అసెంబ్లీ కార్యదర్శి, న్యాయ, శాసన వ్యవహారాల కార్యదర్శి, కేంద్ర ఎన్నికల సంఘం కార్యదర్శులకు స్పష్టం చేస్తూ… విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ బి.శివశంకరరావు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.

కోమటిరెడ్డి, సంపత్‌లు తమను అసెంబ్లీ నుంచి బహిష్కరించడం, తమ అసెంబ్లీ నియోజకవర్గాలు ఖాళీగా ఉన్నట్లు నోటిఫై చేయడంపై హైకోర్టును ఆశ్రయించారు. రాజ్యాంగ పదవిలో ఉన్న గవర్నర్‌ మాట్లాడుతున్న టైంలో కోమటిరెడ్డి, సంపత్‌కుమార్‌లు సభా మర్యాదలకు భంగం కలిగేలా అనుచితంగా ప్రవర్తించారని అడ్వకేట్‌ జనరల్‌ ప్రకాశ్‌రెడ్డి కోర్టుకు తెలిపారు. పిటిషనర్ల తరఫు న్యాయవాదుల వాదనలు ఇప్పటికే ముగిసిన క్రమంలోఏజీ వాదనలు వినిపించారు.

కోమటిరెడ్డి, సంపత్‌కుమార్‌ల ప్రపవర్తనపై సభలో తీర్మానం పెట్టి బహిష్కరించారని చెప్పారు. బహిష్కరణ నిర్ణయం స్పీకర్‌ తీసుకున్నది కాదని, సభ తీసుకున్నదని తెలిపారు. కోమటిరెడ్డి విసిరిన ఇయర్‌ఫోన్‌తో మండలి చైర్మన్‌ కంటికి గాయమైందని, అయినా కోమటిరెడ్డిలో కనీసం పశ్చాత్తాపం లేదని తెలిపారు. సభ్యుల ప్రవర్తన ఆధారంగా చర్యలు తీసుకునే అధికారం స్పీకర్‌కు ఉందని, ఈ మేరకు సుప్రీం కోర్టు తీర్పులు ఉన్నాయని తెలిపారు. సభ కార్యకలాపాలకు విఘాతం కలిగించలేదని పిటిషనర్లు ఎక్కడా పేర్కొనలేదని, అలాగే అసెంబ్లీ తీర్మానాన్ని ఎక్కడా సవాల్‌ చేయలేదని, మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వరాదని విజ్ఞప్తి చేశారు.

అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయినట్లుగా ప్రకటించి నోటిఫికేషన్‌ ఇచ్చామని, ఎన్నికల నిర్వహణ ప్రక్రియ ఎన్నికల కమిషన్‌దేనని వివరించారు. సభలో ఆరు కెమెరాలు పనిచేశాయని, ఇందులో గవర్నర్‌ వైపు ఉన్న రెండు కెమెరాల ఫుటేజీని కోరుతున్నామని పిటిషనర్‌ తరఫు న్యాయవాది తెలిపారు. మొత్తం వీడియో ఫుటేజీని సమర్పిస్తామని ఏజీ నివేదించారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy