గమనిస్తూ ఉంటాయి.. తప్పు చేస్తే పట్టేస్తాయి

 ‘నా చుట్టూ ఎవరూ లేరు. నేను ఒక్కడ్నే ఉన్నాను. ఎవరూ చూడడం లేదు…’ అని కొందరు చెడ్డ పనులు చేస్తుంటారు. ఒంటరిగా ఉన్నప్పుడే మనిషిలోని బలహీనతలు బయటకొస్తాయి. చెడు ఆలోచనలు పుట్టుకొస్తాయి. దాంతో, గర్వం వచ్చేస్తుంది. తప్పా, ఒప్పా అని కూడా చూడకుండా తప్పులు చేస్తుంటారు. మనిషి చేసే ప్రతి పనికి పద్దెనిమిది సాక్షులుంటాయని పురాణాలు చెప్తున్నాయి.

పద్దెనిమిది సాక్షులు
మనం పనిలో ఉన్నా , ఖాళీగా ఉన్నా …ఒంటరిగా ఉన్నా , పది మందిలో ఉన్నా … ప్రతి క్షణం ప్రకృ-తికి చెందిన కొన్ని శక్తులు మనల్ని నీడలా తోడుంటాయి. అవే.. పంచభూతాలు, అంతరాత్మ, ధర్మం, యముడు, సూర్యచంద్రులు, పగలు, రాత్రి, ఉభయ సంధ్యలు, నాలుగు వేదాలు. వీటి గురించి ఉపనిషత్తులు కూడా చెప్పాయి. ఇవన్నీ మనిషి వెంటే ఉంటూ మంచి చేస్తున్నా రా, చెడు చేస్తున్నా రా అని గమనిస్తూ ఉంటాయట. అందుకే, చేసిన తప్పుల నుంచి ఎవరూ తప్పించుకోలేరని అంటారు. ఆ పద్దెనిమిది మనిషి చెడు పనులకు సాక్ష్యం చెప్పి, శిక్షపడేలా చేయలేకపోవచ్చు. కానీ, ప్రతి ఒక్కరూ తమకు తాము సమాధానం చెప్పుకోవాల్సిన సందర్భం మాత్రం జీవితంలో తప్పక వస్తుందని అంటారు ఆధ్యాత్మి కవేత్తలు. మనిషి తప్పు చేసి న్యా యస్థా నాలు, పోలీసులను నమ్మించి బయటపడొచ్చు. కానీ తప్పుచేసేటప్పుడు చూసిన పద్దెనిమిది సాక్షుల నుంచి మాత్రం బయటపడలేడు. ఎందుకంటే, ‘మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయేవరకు అవి మనిషితో కలిసే ఉంటాయి. తప్పొప్పులు లెక్కకడతాయి. మంచి చేస్తే సంతోషంగా ఉండేలా చేస్తాయి. తప్పులు చేస్తే శిక్షలు పడేలా చూస్తాయి. అది ఈ జన్మలో కావచ్చు, మరో జన్మలోఅయినా కావొచ్చు’ అని కర్మసిద్దాంతం చెపుతుంది. ఈ ఆలోచన మనిషి మంచిగా ప్రవర్తించడానికి, చెడు పనులు చేయకుండా ఉండటానికి తప్పక ఉపయోగపడుతుంది.

మనసే న్యాయస్థానం
‘పొరపాటు చేసినప్పుడు నీకు అంతరాత్మ లేదా? ఇంత తప్పు చేయడానికి మనసెలా వచ్చింది?’ అని తిడుతుంటారు పెద్దవాళ్లు. కోపం, ఆవేశం ఉన్నప్పుడు మనిషి మనసు చెప్పిన మాట వినడు. తప్పులు చేస్తాడు. తెలిసి కూడా ఇతరులకు ఇబ్బందులు కలిగిస్తాడు. కోపం తగ్గాక, తప్పు తెలుసుకుని బాధపడతాడు. అందుకే, ఏ పనైనా చేసే ముందు… ‘తప్పా, ఒప్పా’ అని రెండు నిమిషాలు ఆలోచిస్తే చాలు. పొరపాట్లు చాలా వరకు జరగవు. ప్రకృతికి, తోటి మనుషులకు భయపడే కంటే, ఎవరికి వాళ్లు తమ మనసుకు భయపడమని చెప్తాయి పురాణ గ్రంథాలు. నిజమైన న్యా యస్థానం మనసే. తప్పు చేసిన తర్వాత కాదు, అసలు పొరపాటు చేయకుండానే ఆపేస్తుంది.

ఆర్భాటాలు అక్కర్లేదు
కొందరు ప్రతి పనిని అందరికి తెలిసేలా చేస్తారు. చిన్న మంచి చేసినా పేరు ప్రఖ్యాతులు కావాలనుకుంటారు. మాట సాయం చేసినా పది మందికి గొప్పగా చెప్పుకుంటారు. పూజలు, వ్రతాలు చేసేటప్పుడైతే అందర్నీ పిలిచి పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. కానీ, పెద్దవాళ్లు కుడిచేత్తో చేసే సాయం ఎడమ చేతికి తెలియకూడదని చెప్తారు. ఎందుకంటే, మనిషి చేసే ప్రతి పని మనసుకు తెలిస్తే చాలు. చేశామన్న తృప్తి కలిగితే చాలు. అంతేకానీ, ఒకరికి సాయం చేస్తే, మళ్లీ తిరిగి చేస్తారని, అవసరం వచ్చినప్పడు ఉపయోగపడతారనే ఉద్దేశంతో చేయకూడదు. మంచి పనులు చేయడమే మనిషి కర్తవ్యంగా భావించాలన్నదే ఈ పద్దెనిమిది సాక్షులున్నాయని చెప్పడం వెనుక అసలు ఉద్దేశం.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy