
ఈ విషయం తెలుసుకున్న శేఖర్ కమ్ముల మంగళవారం (జూన్-26) సిటీ సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వస్తున్న కొత్త సినిమాలో నటించడానికి యువతీయువకులు కావాలి అంటూ శేఖర్ పేరుతో నెల క్రితం క్వికర్ లో ఓ ప్రకటన వెలువడింది. సాధారణంగానే శేఖర్ కమ్ముల సినిమాల్లో కొత్త వారికి అవకాశాలు ఇస్తుంటారు. దీంతో ఈ ప్రకటన నిజమని నమ్మిన రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ఆ పోస్ట్ లో ఉన్న నంబర్‌ను సంప్రదించారు.
ఫోన్లు రిసీవ్ చేసుకున్న వ్యక్తి.. ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవడానికి రూ.4 వేలు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించాడు. ముందుగా రూ.2 వేల వరకు తన బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేయాలని, ఆపై ఈ జూన్ 25న ఫైనల్ ఇంటర్వ్యూ హైదరాబాద్ లో ఉంటుందని నమ్మబలికాడు. ఆ రోజు మిగిలిన మొత్తం చెల్లించాలని చెప్పాడు. దీనికి స్పందించిన వేలాది మంది మోసగాడు సూచించిన ఖాతాలో డబ్బు డిపాజిట్ చేశారు.
అయితే ఇదే విషయంపై శేఖర్ కమ్ములకు తెలిసిన ఒంగోలుకు చెందిన ప్రదీప్
సోమవారం(25న) హైదరాబాద్ కి వచ్చి శేఖర్ కమ్ములను కలిశారు. మొదట డిపాజిట్ చేసింది పోగా మిగిలిన మొత్తం చెల్లిస్తానని, తనను ఇంటర్వ్యూ చేయాలని ఆయన్ను కోరారు. దీంతో అవాక్కైన శేఖర్ ఆరా తీయగా ప్రదీప్ అసలు విషయం చెప్పారు. అది మోసపూరిత ప్రకటన అని, తనకు సంబంధం లేదని చెప్పిన శేఖర్ కమ్ముల సైబర్ క్రైమ్స్ అదనపు డీసీపీ కేసీఎస్ రఘువీర్‌ను కలసి ఫిర్యాదు చేశారు. సైబర్ కేటుగాళ్లు ఇచ్చిన బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఫోన్ నెంబర్, ఆధారంగా విచారణ చేపట్టినట్లు తెలిపారు పోలీసులు. ఇలాంటి విషయాలపై అప్రమత్తంగా ఉండాలని ఎలాంటి అనుమానం వచ్చినా పోలీసులను సంప్రదించాలని సూచించారు పోలీసులు.