గుర్మీత్ తీర్పు : పంచకులలో హింసాత్మకం..ఐదుగురు మృతి
గుర్మీత్ రామ్ రహీమ్ ను సీబీఐ కోర్టు దోషిగా నిర్ధారించడంతో పంజాబ్, హర్యానాల్లో హింస చెలరేగింది. పంచకులలో జరుగుతున్న హింసాత్మక ఘటనల్లో ఐదుగురు చనిపోయినట్టు PTI తెలిపింది. పంచకుల టౌన్ లోని సెక్టార్-5,6 లలో ఆందోళనకారులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. లాఠీఛార్జ్ చేయడంతో పాటు, గాల్లోకి కాల్పులు జరిపారు. అయినా ఆందోళనకారులు వెనక్కి తగ్గకపోవడంతో వాటర్ కెనాన్లు సైతం ప్రయోగించారు. సెక్టార్-6లో 10మంది గాయపడ్డారు. భద్రతా బలగాలను ఏమాత్రం లెక్క చేయడం లేదు ఆందోళనకారులు. కోర్టు దగ్గర మీడియా ఛానెళ్లకు చెందిన OB వ్యాన్లను ధ్వంసం చేశారు. కొన్నింటికి నిప్పు పెట్టారు. కొందరు రిపోర్టర్లు, మీడియా సిబ్బందిని కొట్టారు. రోహ్ తక్ లోని సునారియా జైలు చుట్టుపక్కల కేంద్ర పారిశ్రామిక భద్రతా దళాలను మోహరించారు.
పంజాబ్ లోనూ పరిస్థితి తీవ్రంగా ఉంది. బఠిందా, మన్సా, ఫిరోజ్ పూర్, ముక్తసర్ లలో కర్ఫ్యూ విధించారు. పంజాబ్ లోని మలౌట్ రైల్వే స్టేషన్, పెట్రోల్ బంక్ లకు నిప్పు పెట్టారు ఆందోళనకారులు. ప్రశాంతంగా ఉండాలని గుర్మీత్ భక్తులకు విజ్ఞప్తి చేశారు పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్. హింసాత్మక ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా రైల్వే శాఖ రెండు రాష్ట్రాల్లో 201 రైళ్ల సర్వీసులను రద్దు చేసింది. గుర్మీత్‌ను దోషిగా నిర్ధారిస్తూ కోర్టు తీర్పు చెప్పడంతో దేశ రాజధాని ఢిల్లీలోనూ భద్రతను కట్టుదిట్టంచేశారు. మరోవైపు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఫోన్లో మాట్లాడారు.