గ్రాండ్ సక్సెస్: తల్లి గర్భసంచి కూతురికి.. దేశంలోనే తొలి ఆపరేషన్

pune-doctors-111పూణే వైద్యులు అరుదైన ఘనతను సాధించారు. దేశ వైద్య చరిత్రలో మునుపెన్నడూ జరగని ఆపరేషన్ ను విజయవంతంగా పూర్తి చేశారు. ఓ తల్లికి మాతృత్వపు ఆనందాన్ని కలిగించడానికి… గర్భసంచి మార్పిడీ శస్త్రచికిత్సను చేశారు. ఈ చికిత్సలో ఇంకో విశేషం కూడా ఉంది. ఈ ఆపరేషన్ లో తన కూతురుకి గర్భసంచిని ఇచ్చింది ఓ తల్లి. అత్యంత సంక్లిష్టమైన ఈ గర్భసంచి మార్పిడి శస్త్రచికిత్సను పుణెలోని గెలాక్సీ కేర్‌ హాస్పిటల్ డాక్టర్లు గురువారం విజయవంతంగా పూర్తిచేశారు. మనదేశంలో జరిగిన తొలి గర్భసంచి మార్పిడి ఆపరేషన్ ఇదే. శస్త్రచికిత్సకు తొమ్మిదిన్నర గంటల సమయం పట్టిందని.. తల్లీబిడ్డలిద్దరూ క్షేమంగా ఉన్నారు. ఈ ప్రక్రియలో పూర్తి ఫలితాలు ఏడాది తర్వాత వస్తాయంటున్నారు హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్‌ శైలేష్‌ పుంతంబేకర్‌. గర్భసంచిని స్వీకరించిన మహిళ గర్భం దాల్చాలంటే ఏడాదిపాటు వేచి ఉండాలని సూచించారు. అప్పట్లోగా ఆమె శరీరం నూతన గర్భాశయానికి అలవాటుపడుతుందని తెలిపారు.

ప్రపంచ వ్యాప్తంగా 15 లక్షల మంది మహిళలు ఇలాంటి రుగ్మతలతో బాధపడుతున్నారు. అయితే ఇప్పటి వరకు 30 మందికి మాత్రమే గర్భసంచి మార్పిడీ చేయగా వారిలో ఆరుగురు మాత్రమే ఫలితాన్ని పొందారు. ఈ విధానంలో ట్రాన్స్ జెండర్లు కూడా మాతృత్వపు ఆనందాన్ని పొందవచ్చు. గర్భసంచి లేకుండా జన్మించినవారు, గర్భసంచి సంబంధిత తీవ్ర వ్యాధులతో బాధపడుతున్న మహిళలు సంతాన భాగ్యం కోల్పోతారు. అలాంటి వారందరికీ గర్భసంచి మార్పిడీ శస్త్ర చికిత్స చేయించొచ్చు.

ఇలా చేస్తారు..

గర్భసంచి మార్పిడి ప్రక్రియలో తొలుత దాత నుంచి అండాలను తొలగించి.. వీర్యకణాలతో ఫలదీకరణం చెందిస్తారు. తద్వారా లభించిన పిండాలను శీతలీకరణ పద్ధతిలో నిల్వ చేస్తారు. అనంతరం గర్భాశయాన్ని తీసి.. గ్రహీత శరీరంలో అమరుస్తారు. ఆపై ఏడాది తర్వాత(స్వీకర్త శరీరం గర్భసంచికి అలవాటుపడ్డాక) పిండాలను గర్భాశయంలో ప్రవేశపెడతారు. తద్వారా ఆమె గర్భం దాల్చుతుంది. స్వయంగా బిడ్డకు జన్మనిస్తుంది. సాధారణంగా కోరుకున్న సంఖ్యలో పిల్లలు జన్మించాక గ్రహీత శరీరం నుంచి గర్భాశయాన్ని తొలగిస్తారు. దీర్ఘకాలంలో ఎలాంటి ప్రతికూలతలు ఎదురవ్వకుండా చూడటమే దాని వెనుక ఉద్దేశం.  ఈ ఆపరేషన్ కు 10 -14 గంటల సమయం పడుతుంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy